పోలీసుల తనిఖీలు
♦ ఉదయాన్నే తనిఖీల జోరు హా రూ. 500 జరిమానా
♦ ఉన్నతాధికారుల ఆదేశంతో వెనక్కి
♦ నాలుగు రోజులు అవకాశం
♦ ఆర్టీఏ కార్యాలయాల వద్ద బారులు
వాహన చోదకులు ఒరిజినల్ లైసెన్స్‌ను కల్గి ఉండాలన్న ఉత్తర్వులు బుధవారం అమల్లోకి వచ్చాయి. ఉదయాన్నే పోలీసులు వాహనాల తనిఖీలు జోరెత్తారు. ఒరిజినల్ లైసెన్స్‌లు లేని వారి భరతం పడుతూ రూ.500 వరకు జరిమానా విధించారు. అయితే, ఉన్నతాధికారుల ఆదేశంతో కాసేపటికి వెనక్కు తగ్గారు. ఇక, ఆర్టీఏ కార్యాలయాలు వాహనదారులతో కిటకిటలాడాయి.
సాక్షి, చెన్నై : అతి వేగం కారణంగా ప్రమాదాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో వాహనదారుల భరతం పట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రతి వాహన దారుడు తమ వెన్నంటి ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్‌ను కల్గి ఉండాల్సిందేనన్న ఉత్తర్వులకు మద్రాసు హైకోర్టు సైతం మద్దతు ప్రకటించింది. దీంతో బుధవారం నుంచి ఒరిజినల్ లైసెన్స్‌లు తప్పనిసరి అయ్యాయి. ప్రభుత్వ ఉత్తర్వులు అమల్లోకి రావడంతో రాష్ట్రంలో అనేకచోట్ల పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. సాధారణంగానే వాహనదారులు పట్టుబడితే, ముక్కు పిండి మరీ జరిమానా మోత విధించే పోలీసులు, తాజాగా ఒరిజినల్ అస్త్రంతో ఉదయాన్నే రోడ్డెక్కారు. చెన్నై వంటి నగరాల్లో సిగ్నల్స్ వద్ద హెల్మెట్‌లు ధరించి ఉన్నా సరే, అనుమానంగా కనిపిస్తే చాలు, ఆ వాహన దారుడి లైసెన్స్‌ను పరిశీలించడం, ఒరిజినల్ లేని పక్షంలో రూ. 500 జరిమానా మోత మోగించే పనిలో పడ్డారు.
వేధించవద్దన్న ఉన్నతాధికారులు
పదిన్నర, పదకొండు గంటల వరకు అనేకచోట్ల ఈ జరిమానా మోత మోగినా, ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో పోలీసులు వెనక్కు తగ్గారు. వాహనదారుల్ని వేధించే చర్యలకు పాల్పడ వద్దని పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. నాలుగు రోజుల పాటు ఎలాంటి తనిఖీలు వద్దని, లైసెన్స్‌లు పొందేందుకు తగ్గ అవకాశాన్ని ఇచ్చే విధంగా వాహనదారులకు కాస్త ఊరట కల్పించారు. ఈ నాలుగు రోజుల పాటు ›ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనదారులకు అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు, కరపత్రాల పంపిణీకి పోలీసులు నిర్ణయించారు. ఇక, శనివారం వరకు గడువు లభించినట్టు అయింది. ఆదివారం సెలవు దినం కావడంతో, తదుపరి సోమవారం నుంచి పోలీసుల తనిఖీలు మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు ఎక్కువే. దీంతో వాహనదారులు లైసెన్స్‌ల కోసం ఆర్టీఏ కార్యాలయాల వద్ద క్యూ కట్టే పనిలో పడ్డారు.
ఆర్టీఏ వద్ద క్యూ
రాష్ట్రవ్యాప్తంగా వాహనదారులు లైసెన్స్‌లు, డూప్లికేట్ ఒరిజినల్స్ కోసం దరఖాస్తుల్ని హోరెత్తిస్తున్నారు. దీంతో ఆర్టీఏ కార్యాలయాల వద్ద క్యూ చాంతాడంతగా పెరిగింది. అలాగే, అక్కడి బ్రోకర్లకు పండుగే అన్నట్టుగా పరిస్థితి నెలకొంది. గత నెలాఖరులో డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్ తప్పనిసరి అన్న ఉత్తర్వుల్ని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఇప్పటివరకు 82 వేల మంది లైసెన్స్‌ల కోసం దరఖాస్తులు చేసుకుని ఉండడం గమనార్హం. అలాగే, లక్ష మంది రెన్యూవల్‌కు, మూడు వేల మంది వరకు డూప్లికేట్ ఒరిజినల్ లైసెన్స్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. జూన్, జూలై నెలల్లో 60 నుంచి 70 వేలలోపు దరఖాస్తులు లైసెన్స్‌లు, రెన్యూవల్స్ కోసం రాగా, ప్రస్తుతం సంఖ్య పెరగడం గమనించాల్సిన విషయం. ఇక, చెన్నైలోని 14 ఆర్టీఏ కార్యాలయాల వద్ద ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో వాహనదారులు బారులు తీరడంతో ఆ పరిసరాలు కిటకిటలాడాయి. బ్రోకర్లు తామంటే తాము త్వరితగతిన ఇప్పిస్తామంటూ వాహన చోదకుల ముందు వాలిపోయారు.