సాక్షి, సిటీబ్యూరో: స్థలం : ఖైరతాబాద్ ఆర్టీఏ కేంద్ర కార్యాలయం, సమయం : శనివారం ఉదయం 11 గంటలు, సందర్భం : నలుగురు వ్యక్తులు ఆర్టీఏ కార్యాలయంలోకి ప్రవేశించారు. తాము ఏసీబీ నుంచి వచ్చామంటూ నేరుగా ఒక మహిళా ఉద్యోగి వద్దకు వెళ్లారు. ఆమెను తమ వెంట తీసుకెళ్లారు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. దీంతో ఉద్యోగులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయాందోళనకు గురయ్యారు. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు జరుగుతున్నాయనే వార్త దావనలంలా వ్యాపించింది. కొన్ని చానళ్లలో స్క్రోలింగులు కూడా వచ్చాయి. కొందరు మీడియా ప్రతినిధులు సైతం అక్కడకు చేరుకున్నారు. కానీ వచ్చిన అగంతకులు ఆ మహిళా ఉద్యోగిని నేరుగా తమ వెంట తీసుకెళ్లారు. ఆర్టీఏ ఆఫీస్ బయట ఉన్న ఏసీ బస్టాపులో కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం లకిడికాపూల్‌లోని ఒక హోటల్‌కు వెళ్లి అక్కడ కొద్ది సేపు మాట్లాడిన అనంతరం ఆమెను వదిలి అయితే వచ్చిన ఆ నలుగురు అగంతకులు అటు ప్రాంతీయ రవాణా అధికారి రమేష్‌కు కానీ, హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ్‌నాయక్‌కు కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రేణుక అనే జూనియర్ అసిస్టెంట్‌ను తమ వెంట తీసుకెళ్లడం కలకలం సృష్టించింది.
ఎవరా అగంతకులు....
నిజానికి ఆమె కోసం వచ్చిన వాళ్లు పోలీసులైనా, ఏసీబీ అధికారులైనా తాము ఎవరో, ఎందుకొచ్చారో స్పష్టంగా వివరిస్తారు. పై అధికారులకు సమాచారం అందజేస్తారు. కానీ అలాంటిదేమీ లేకుండా సరాసరి ఒక మహిళా ఉద్యోగి వద్దకు వచ్చి ఆమెను తీసుకెళ్లడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రైవేట్ వ్యక్తులే ఆ పని చేశారని అధికారులు అంచనా వేశారు. మరోవైపు ఆర్టీఏ కార్యాలయంలో సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల కూడా వచ్చిన వారిని నిర్ధారించడం కష్టంగా మారింది. మరోవైపు తమ వెంట రావలసిందిగా వాళ్లు ఆదేశించడంతో పై అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఆమె బయటకు వారితో బయటకు వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. అది వారి వ్యక్తిగతమైన విషయమై ఉండవచ్చునని కొందరు భావిస్తుండగా, ఆమె మాత్రం వచ్చిన వారు ఎవరో తనకు తెలియదని, తనను డబ్బులు డిమాండ్ చేశారని అనంతరం తిరిగి ఆర్టీఏ కార్యాలయానికి చేరుకున్న రేణుక తన పై అధికారులకు తెలియజేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆరా...
ప్రధాన కార్యాలయం అయిన ఖైరతాబాద్‌లోనే ఈ సంఘటన చోటుచేసుకోవడం, ఆర్టీఏ కార్యాలయంలో ఎలాంటి భద్రత లేకపోవడం, బయటి వ్యక్తులపైన నిఘా వ్యవస్థ కానీ, సీసీ కెమెరాలు కానీ లేకపోవడం ఒకవైపు అయితే మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ఈ సంఘటన చర్యనీయాంశంగా మారింది. జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు ఫోన్ కాల్స్ వెల్లువెత్తాయి.వచ్చిన వాళ్లు ఏసీబీకి చెందిన అధికారులా లేక ప్రైవేట్ వ్యక్తులా, పోలీసులా అనే అంశాన్ని ఆరా తీశారు. ఇలా ఉండగా, అగంతకులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు జేటీసీ పాండురంగ్ నాయక్ తెలిపారు.
Published Sun, Jul 1 2018 7:12 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment