vehicles robbery
-
యూట్యూబ్‌లో చూసి.. వాహనాలు చోరీ
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైల్ స్టేషన్ల నుంచి సమీప ప్రాంతాలకు ప్రయాణించడానికి ఉద్దేశించిన వోగో కంపెనీ యాక్టివా వాహనాలను చోరీ చేస్తున్న ముఠా గుట్టును దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఈ గ్యాంగ్ సభ్యులు యూట్యూబ్‌లో చూసి జీపీఎస్ పరికరాల తొలగింపు నేర్చుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బుధవారం కొత్వాల్ అంజనీకుమార్, అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి ఈ కేసు వివరాలను వెల్లడించారు. పాతబస్తీలోని భవానీనగర్, యాకత్పురా ప్రాంతాలకు చెందిన మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ యాసీన్, మీర్ హంజా ఇంటర్మీడియట్ విద్యార్థులు. వోగో వాహనాలను యాప్ ద్వారా వాహనాలను అద్దెకు తీసుకోవచ్చని, ఇంజిన్ ఆన్ అయితేనే దాని జీపీఎస్ పరికరం పని చేస్తుందని రిజ్వాన్ గుర్తించాడు. ఇదే విషయాన్ని మిగిలిన ఇద్దరికీ చెప్పి వాహనాలన్నీ యాక్టివా 5జీలే కావడంతో చోరీ చేద్దామని చెప్పాడు. ముగ్గురూ కలిసి రంగంలోకి దిగారు. చిక్కడపల్లి, ఎల్బీనగర్, ఉప్పల్, అబిడ్స్ ఠాణాల పరిధిలో ఉన్న మెట్రో స్టేషన్లలో పార్కింగ్ ప్లేసుల్లో ఉండే వోగో వాహనాలను అపహరించేవారు. ఇలా నాలుగు నెలల్లో 38 వాహనాలను తస్కరించారు. వాటిపై ఉన్న వోగో స్టిక్కర్లు తొలగించి, హ్యాండిల్ లాక్ బిగించి నకిలీ తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రాలు తయారు చేసేవారు. వీటిని వినియోగించి ఆ వాహనాలను సయ్యద్ అహ్మద్ మెహేదీ, ఎజాజ్, నోయన్, వజీద్‌ల ద్వారా ఇతరులకు విక్రయించారు. సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు ఎన్.శ్రీశైలం, మహ్మద్ థకీయుద్దీన్, వి.నరేందర్, కె.చంద్రశేఖర్‌లు వల పన్ని నిందితులను పట్టుకున్నారు. మెహేదీ, ఎజాజ్, నోమన్ మినహా నలుగురిని అరెస్టు చేసింది. 38 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. -
యూట్యూబ్‌లో చూసి.. చోరీలు చేసి!
హైదరాబాద్: యూట్యూబ్‌లో వీడియోలు చూసి ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న ఓ బాలుడు పోలీసులకు పట్టుబడ్డాడు. మూడు నెలల్లో పదిహేను స్పోర్ట్స్ బైక్‌లను మాయం చేశాడు. ఆసిఫ్‌నగర్ ఏసీపీ చక్రవర్తి వివరాలను వెల్లడించారు. పహాడీ షరీఫ్ ప్రాంతంలో నివాసముండే అబ్దుల్ ఖాదర్ కుమారుడు(15) ద్విచక్ర వాహనాలను దొంగిలించే వీడియోలను ఈ ఏడాది మార్చిలో యూట్యూబ్‌లో చూశాడు. తర్వాత కొద్ది రోజులకు స్నేహితుడి వాహనాన్నే దొంగిలించాడు. జల్సాలకు అలవాటు పడి చోరీలబాట పట్టాడు. స్థానికంగా ఉండే పాత నేరస్తుడు, ఎలక్ట్రీషియన్ మొహమ్మద్ సోహైల్(19), మరో ఇద్దరు స్నేహితులతో కలసి చోరీలకు పాల్పడుతు న్నాడు. ఈ దొంగలు కేవలం స్పోర్ట్స్ బైక్‌లు, బుల్లెట్లు, రాయల్‌ఎన్‌ఫీల్డ్, 200 సీసీ పైన ఉన్న పల్సర్ వాహనాలనే చోరీ చేసేవారు. కేవలం రెండు, మూడు నిమిషాల వ్యవధిలోనే తాళం విరగ్గొట్టి ఎంతటి వాహనాన్నైనా సునాయాసంగా తస్కరించేవారు. ఈ వాహనాలను విక్రయించిన సొమ్ముతో షికార్లు చేయడం, మండి బిర్యాని తినడం వంటివి చేసేవారు. దొరికింది ఇలా..... ఈ నెల 10న కాళీమందిర్ ప్రాంతానికి చెందిన అక్షయ్ తన కేటీఎం స్పోర్ట్స్ బైక్‌పై అత్తాపూర్‌లోని స్నేహితున్ని కలవడానికి వెళ్లాడు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో మొఘల్‌నగర్ రింగ్ రోడ్ వద్దకు రాగానే వాహనంలో పెట్రోల్ అయిపోయింది. సమీపంలో ఉన్న క్లాసిక్ గార్డెన్ ఫంక్షన్ హాల్ వద్ద బైక్ పార్కు చేసి ఇంటికి వెళ్లిపోయాడు. ఉదయాన్నే వచ్చి చూడగా వాహనం కనిపించకపోవడంతో లంగర్‌హౌస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం సాలార్జంగ్ కాలనీలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఈ దొంగలను కానిస్టేబుళ్లు మనీష్‌కుమార్ తివారి, నరేష్‌బాబు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చోరీ విషయాలు బయటపడ్డాయి. ముగ్గురు మైనర్ బాలురతోపాటు మొహమ్మద్ సోహైల్(19), మొహమ్మద్ గఫూర్ ఖాన్(20)లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి వద్ద నుండి 4 రాయల్ ఎన్ఫీల్డ్లతోపాటు 15 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.15 లక్షలుంటుందని పోలీసులు తెలిపారు. -
మూడేళ్లలో రూ.100 కోట్ల వాహనాలు చోరీ!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో నివసించే రాజు.. ఎప్పటిలాగే ఆఫీస్ నుంచి రాత్రి 7 గంటలకు వచ్చి ఇంటి ముందు బైక్ పార్క్ చేశాడు. ఉదయాన్నే బయటకొచ్చి చూస్తే.. బైక్ కనిపించలేదు. చుట్టుపక్కల వెతికి, ఎక్కడా కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. రాజు ఫిర్యాదు చేసి నెలలు కాదు ఏళ్లు గడిచాయి. ఇప్పటివరకూ తన బైక్ జాడ తెలియలేదు. ఇలా నిత్యం రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లు.. కొన్ని చోట్ల ఏకంగా లారీలు కూడా మాయమైపోతున్నాయి. ఇలాంటి కేసుల్లో పోలీసుల దర్యాప్తు తూతూమంత్రంగా జరుగుతుండటంతో దొంగలు మరింత రెచ్చిపోతున్నారు. ఏటా వేల సంఖ్యలో వాహనాలు కొల్లగొడుతున్నారు. గడిచిన మూడేళ్లలో 12,243 వాహనాలు చోరీకి గురైనట్టు పోలీస్ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. మహారాష్ట్ర, బిహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకకు చెందిన గ్యాంగులు వాహనాల చోరీలో ఆరితేరాయి. ఈ ముఠాలకు స్థానిక ముఠాలు ఆశ్రయం కల్పించడం, లాజిస్టిక్ సపోర్ట్ చేయడం, వాహనాలు రాష్ట్రం దాటించడం చేస్తూ దోపిడీ సొత్తులో వాటా పంచుకుంటున్నాయి. పట్టించుకునే దిక్కులేదు.. వేల సంఖ్యలో కార్లు, ఆటోలు, లారీలు, ద్విచక్ర వాహనాలు చోరీకి గురవుతుంటే సంబంధిత జిల్లాల్లో పోలీసుల దర్యాప్తు నత్తనడకన సాగుతోంది. మనుషులు అదృశ్యమైన కేసులే వేల సంఖ్యలో పెండింగ్‌లో ఉండగా.. ఇక వాహనాల సంగతి అంతే సంగతులనే రీతిలో దర్యాప్తు జరుగుతోంది. 12,243 వాహనాల్లో 22 శాతం కార్లు చోరీకి గురికాగా, 14 శాతం ఆటోలు, 2 శాతం భారీ వాహనాలు ఉన్నట్లు పోలీస్ రికార్డుల్లో చెబుతున్నాయి. అందులో మిగిలిన 62 శాతం ద్విచక్ర వాహనాలు చోరీ గురైనట్లు వెల్లడిస్తున్నాయి. చోరీకి గురైన వాహనాల సొత్తును లెక్కేస్తే కార్లు, బైకులు, ఆటోలు మొత్తం కలిపి రూ.100 కోట్ల వరకు ఉంటుందని పోలీస్ శాఖ ఏటా వెలువరించే వార్షిక నివేదికల్లో చెబుతోంది. దొరికినా తిరిగాల్సిందే..! వాహనం చోరికి గురైన కేసుల్లో పోలీసులు పెద్దగా దర్యాప్తు చేయడం లేదన్న ఆరోపణ బలంగా వినిపిస్తోంది. వాహనాల తనిఖీలు, కార్టన్ సెర్చ్.. తదితర సమయాల్లో పట్టుబడ్డ వాహనాలు నెలలకొద్దీ స్టేషన్లలోనే మూలుగుతుంటాయి. పట్టుబడ్డవి నిజంగా దొంగ వాహనాలు అయితే వాటి అసలు యజమానులు ఎవరు? వాహనం ఎక్కడ చోరీకి గురైంది? తదితర వివరాలను సేకరించాలి. కానీ ఎక్కడా అలా చేసిన దాఖలాలు లేవు. దొరికిన వాహనాలను స్టేషన్లలో తుప్పు పట్టేదాకా ఓ మూలన పడేయాల్సిందే. ఇదే రీతిలో గోషా మహల్‌లోని స్టేడియంలో వేలాది వాహనాలు మూలనపడ్డాయి. మరికొన్ని కేసుల్లో చోరీకి గురైన వాహనాలు దొరి కినా కేసు చార్జిషీట్ దశలో ఉందని, కోర్టు ద్వారా తీసుకో వాలని పోలీసులు చెబుతుండటంతో బాధితులు తమ సొత్తుపై ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. -
ఇద్దరు బాలనేరస్తుల అరెస్ట్
రూ.3.21 లక్షల సొత్తు స్వాధీనం నెల్లూరు (క్రైమ్) : ఇళ్లల్లో, వాహనాలు చోరీలకు పాల్పడుతూ పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న ఇద్దరు బాలనేరస్తులను శుక్రవారం ఐదో నగర పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.3.21 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమాచారం మేరకు.. నగరంలోని సీఆర్పీ డొంక మసీదు సమీపంలో నివసిస్తున్న ఓ బాలుడు సౌత్రాజుపాళెంకు చెందిన మరో బాలుడు స్నేహితులు. వీరిద్దరు వ్యసనాలకు బానిసై చోరీల బాట బట్టారు. నిందితులు తాళం వేసిన ఇళ్లు, దుకాణాలను లక్ష్యంగా ఎంచుకుని దొంగతనాలకు పాల్పడటంతో పాటు ఆరు బయట ఉన్న ద్విచక్ర వాహనాలను చోరీ చేయడం ప్రారంభించారు. వారిపై ఐదో నగర పోలీసులు నిఘా ఉంచారు. శుక్రవారం నిందితులు అయ్యప్పగుడి సమీపంలో ఉండగా ఐదో నగర ఇన్స్పెక్టర్ పి. సుబ్బారావు ఆధ్వర్యంలో ఎస్ఐ జగత్సింగ్ తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ. లక్ష విలువ చేసే బంగారు ఆభరణా లు, రూ.1.50 లక్షల విలువ చేసే అల్యూమినియం వస్తువులు, హోండాషైన్, సూపర్స్ల్పెండర్బైక్ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 3.21 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది. దీంతో వారిని పోలీసులు జువైనల్ హోమ్‌కు తరలించారు. ఇది ఇలా ఉంటే మరో మూడు బైక్‌లు అనామత్తుగా దొరికాయని వాటి వివరాలను సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.