సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో నివసించే రాజు.. ఎప్పటిలాగే ఆఫీస్ నుంచి రాత్రి 7 గంటలకు వచ్చి ఇంటి ముందు బైక్ పార్క్ చేశాడు. ఉదయాన్నే బయటకొచ్చి చూస్తే.. బైక్ కనిపించలేదు. చుట్టుపక్కల వెతికి, ఎక్కడా కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. రాజు ఫిర్యాదు చేసి నెలలు కాదు ఏళ్లు గడిచాయి. ఇప్పటివరకూ తన బైక్ జాడ తెలియలేదు. ఇలా నిత్యం రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లు.. కొన్ని చోట్ల ఏకంగా లారీలు కూడా మాయమైపోతున్నాయి. ఇలాంటి కేసుల్లో పోలీసుల దర్యాప్తు తూతూమంత్రంగా జరుగుతుండటంతో దొంగలు మరింత రెచ్చిపోతున్నారు. ఏటా వేల సంఖ్యలో వాహనాలు కొల్లగొడుతున్నారు. గడిచిన మూడేళ్లలో 12,243 వాహనాలు చోరీకి గురైనట్టు పోలీస్ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. మహారాష్ట్ర, బిహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకకు చెందిన గ్యాంగులు వాహనాల చోరీలో ఆరితేరాయి. ఈ ముఠాలకు స్థానిక ముఠాలు ఆశ్రయం కల్పించడం, లాజిస్టిక్ సపోర్ట్ చేయడం, వాహనాలు రాష్ట్రం దాటించడం చేస్తూ దోపిడీ సొత్తులో వాటా పంచుకుంటున్నాయి.
పట్టించుకునే దిక్కులేదు..
వేల సంఖ్యలో కార్లు, ఆటోలు, లారీలు, ద్విచక్ర వాహనాలు చోరీకి గురవుతుంటే సంబంధిత జిల్లాల్లో పోలీసుల దర్యాప్తు నత్తనడకన సాగుతోంది. మనుషులు అదృశ్యమైన కేసులే వేల సంఖ్యలో పెండింగ్‌లో ఉండగా.. ఇక వాహనాల సంగతి అంతే సంగతులనే రీతిలో దర్యాప్తు జరుగుతోంది. 12,243 వాహనాల్లో 22 శాతం కార్లు చోరీకి గురికాగా, 14 శాతం ఆటోలు, 2 శాతం భారీ వాహనాలు ఉన్నట్లు పోలీస్ రికార్డుల్లో చెబుతున్నాయి. అందులో మిగిలిన 62 శాతం ద్విచక్ర వాహనాలు చోరీ గురైనట్లు వెల్లడిస్తున్నాయి. చోరీకి గురైన వాహనాల సొత్తును లెక్కేస్తే కార్లు, బైకులు, ఆటోలు మొత్తం కలిపి రూ.100 కోట్ల వరకు ఉంటుందని పోలీస్ శాఖ ఏటా వెలువరించే వార్షిక నివేదికల్లో చెబుతోంది.
దొరికినా తిరిగాల్సిందే..!
వాహనం చోరికి గురైన కేసుల్లో పోలీసులు పెద్దగా దర్యాప్తు చేయడం లేదన్న ఆరోపణ బలంగా వినిపిస్తోంది. వాహనాల తనిఖీలు, కార్టన్ సెర్చ్.. తదితర సమయాల్లో పట్టుబడ్డ వాహనాలు నెలలకొద్దీ స్టేషన్లలోనే మూలుగుతుంటాయి. పట్టుబడ్డవి నిజంగా దొంగ వాహనాలు అయితే వాటి అసలు యజమానులు ఎవరు? వాహనం ఎక్కడ చోరీకి గురైంది? తదితర వివరాలను సేకరించాలి. కానీ ఎక్కడా అలా చేసిన దాఖలాలు లేవు. దొరికిన వాహనాలను స్టేషన్లలో తుప్పు పట్టేదాకా ఓ మూలన పడేయాల్సిందే. ఇదే రీతిలో గోషా మహల్‌లోని స్టేడియంలో వేలాది వాహనాలు మూలనపడ్డాయి. మరికొన్ని కేసుల్లో చోరీకి గురైన వాహనాలు దొరి కినా కేసు చార్జిషీట్ దశలో ఉందని, కోర్టు ద్వారా తీసుకో వాలని పోలీసులు చెబుతుండటంతో బాధితులు తమ సొత్తుపై ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.
బండి... తిరిగిరాదండి!
Published Sat, Apr 7 2018 4:20 AM | Last Updated on Sat, Apr 7 2018 8:36 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment