సాక్షి, హైదరాబాద్: మెట్రో రైల్ స్టేషన్ల నుంచి సమీప ప్రాంతాలకు ప్రయాణించడానికి ఉద్దేశించిన వోగో కంపెనీ యాక్టివా వాహనాలను చోరీ చేస్తున్న ముఠా గుట్టును దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఈ గ్యాంగ్ సభ్యులు యూట్యూబ్‌లో చూసి జీపీఎస్ పరికరాల తొలగింపు నేర్చుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బుధవారం కొత్వాల్ అంజనీకుమార్, అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి ఈ కేసు వివరాలను వెల్లడించారు. పాతబస్తీలోని భవానీనగర్, యాకత్‌పురా ప్రాంతాలకు చెందిన మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ యాసీన్, మీర్ హంజా ఇంటర్మీడియట్ విద్యార్థులు. వోగో వాహనాలను యాప్ ద్వారా వాహనాలను అద్దెకు తీసుకోవచ్చని, ఇంజిన్ ఆన్ అయితేనే దాని జీపీఎస్ పరికరం పని చేస్తుందని రిజ్వాన్ గుర్తించాడు. ఇదే విషయాన్ని మిగిలిన ఇద్దరికీ చెప్పి వాహనాలన్నీ యాక్టివా 5జీలే కావడంతో చోరీ చేద్దామని చెప్పాడు. ముగ్గురూ కలిసి రంగంలోకి దిగారు.
చిక్కడపల్లి, ఎల్బీనగర్, ఉప్పల్, అబిడ్స్ ఠాణాల పరిధిలో ఉన్న మెట్రో స్టేషన్లలో పార్కింగ్ ప్లేసుల్లో ఉండే వోగో వాహనాలను అపహరించేవారు. ఇలా నాలుగు నెలల్లో 38 వాహనాలను తస్కరించారు. వాటిపై ఉన్న వోగో స్టిక్కర్లు తొలగించి, హ్యాండిల్ లాక్ బిగించి నకిలీ తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రాలు తయారు చేసేవారు. వీటిని వినియోగించి ఆ వాహనాలను సయ్యద్ అహ్మద్ మెహేదీ, ఎజాజ్, నోయన్, వజీద్‌ల ద్వారా ఇతరులకు విక్రయించారు. సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు ఎన్.శ్రీశైలం, మహ్మద్ థకీయుద్దీన్, వి.నరేందర్, కె.చంద్రశేఖర్‌లు వల పన్ని నిందితులను పట్టుకున్నారు. మెహేదీ, ఎజాజ్, నోమన్ మినహా నలుగురిని అరెస్టు చేసింది. 38 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment