Velpuru
-
గుప్త నిధుల కోసం ఆలయంలో తవ్వకాలు
సాక్షి, వేల్పూరు: గుప్త నిధుల కోసం తవ్వకాలు నిర్వహించిన ఘటన మండలంలోని వేల్పూరులో గల రామలింగేశ్వరస్వామి ఆలయంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఆలయ పూజారి ఆమంచి రవికుమార్ ఫిర్యాదు మేరకు పురావస్తుశాఖ కన్జర్వేటివ్ అసిస్టెంట్ వెంకటయ్య, అచ్చంపేట ఎస్ఐ పి.పట్టాభిరామయ్య శుక్రవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆలయంలో వేయిపడగల నాగేంద్రస్వామి రాతి విగ్రహాన్ని కూల్చివేశారు. ఆలయ ప్రాంగణంలోని శివలింగం కింద ఉండే పాణపట్టాన్ని పూర్తిగా కూల్చేసి భూమిలో మూడు అడుగుల లోతులో గొయ్యి తీశారు. స్వామివారి ఎదురుగా ఉండే నందీశ్వరుని రాతి విగ్రహాన్ని దిమ్మెపై నుంచి కింద పడేసి, ఆ ప్రదేశంలో లోతైన గొయ్యి తీసి నిధుల కోసం అన్వేషించిన ఆనవాళ్లు కనిపించాయి. దేవాలయ పరిసరాల్లో అక్కడక్కడే గుప్త నిధుల కోసం పరిశీలించిన దాఖలాలున్నాయి. 18వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజావాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ఒకే సారి 101 శివాలయాలను నిర్మించి అందులో ఒకే సమయంలో 101 శివలింగాలను ప్రతిష్టించారని చరిత్ర చెబుతోంది. వాటిలో రామలింగేశ్వరస్వామి ఆలయం ఒకటిగా చరిత్రకారులు చెబుతున్నారు. విగ్రహాల ప్రతిష్టా సమయంలో విగ్రహాల కింద బంగారు నిధులు భూస్థాపితం చేసినట్లు వదంతులు ఎప్పటి నుంచో ఉన్నాయి. గతంలో కూడా పలు మార్లు ఇదే దేవాలయంలో తవ్వకాలు జరగడంతో దేవాలయ ప్రాంగణం మొత్తాన్ని పురావస్తుశాఖ స్వాధీనం చేసుకుని ఆవరణ చుట్టా ఇనుప తీగతో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. అనుమతులు లేకుండా ఆలయ ప్రాంగణంలోకి వెళ్లడం గానీ, పరిసరాల్లో సంచరించడంగానీ నేరంగా అక్కడక్కడా బోర్డులు ఉంచారు. ఇది జరిగి సుమారు 15 సంవత్సరాల పైనే అయింది. తిరిగి ఇన్నేళ్లకు అక్రమార్కుల కళ్లు ఆలయంపై పడటం, ఎవరూ లేని సమయంలో ఆలయంలోకి ప్రవేశించి భక్తులు ఎంతో పవిత్రంగా పూజించే దేవతల విగ్రహాలను కూల్చడం పట్ల పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పూజారి ఫిర్యాదు మేరకు అచ్చంపేట ఎస్.ఐ పి.పట్టాభిరామయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
శిశువు మృతిపై వైద్యాధికారుల విచారణ
వేల్పూరు (తణుకు టౌన్) : తణుకు మండలం వేల్పూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఇటీవల శిశువు మృతి ఘటనపై శుక్రవారం అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌వో ఉమాదేవి విచారణ చేపట్టారు. వేల్పూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన ఆమె శిశువు తల్లిదండ్రులు పోలుమాటి ప్రమోద్, లిల్లీడాలీలను ప్రశ్నించి వివరాలు నమోదు చేసుకున్నారు. అదే సమయంలో పీహెచ్సీ వైధ్యాదికారిని, ఇతర సిబ్బందిని విచారించారు. అనంతరం తణుకులోని ప్రైవేట్ ఆస్పత్రిలోని సిబ్బందిని విచారించారు. వివరాలను నమోదు చేసుకుని నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేస్తామని తెలిపారు. ఈ విచారణలో తణుకు ఏరియా ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ అరుణ, పిల్లల వైద్యులు సత్యనారాయణ పాల్గొన్నారు. -
ముగ్గురు రైస్ మిల్లర్లకు సేవా అవార్డులు
పెనుమంట్ర, న్యూస్‌లైన్ : భారత గణతంత్ర వేడుకల్లో పెనుమంట్ర మండలానికి చెందిన ఇద్దరి రైస్‌మిల్లర్లతోపాటు తణుకు మండలం వేల్పూరుకు చెందిన ఓ రైస్‌మిల్లర్‌కు జిల్లా సేవా అవార్డులు దక్కాయి. 2012-13 సంవత్సరానికి గాను భారత ప్రభుత్వానికి లెవీ బియ్యం సేకరణలో ఆలమూరు వంశీతేజ మోడరన్ రైస్‌మిల్ అధినేత, రాష్ట్ర రైస్‌మిల్లర్స్ అసోషియేషన్ ఉపాధ్యక్షుడు నూకల వెంకటసత్యనారాయణ (చిట్టిబాబు) ప్రథమ అవార్డుకు ఎంపికయ్యారు. మల్లిపూడిలోని గుడిమెట్ల సుందరరామిరెడ్డి అండ్‌కో అధినేత గుడిమెట్ల రామకృష్ణారెడ్డి ద్వితీయ అవార్డుకు ఎంపికకాగా, తణుక మండలం వేల్పూరుకు చెందిన శ్రీరామలింగేశ్వరా రైస్‌మిల్ అధినేత బండారు గోవిందు తృతీయ అవార్డుకు ఎంపికయ్యారు. వీరితోపాటు పెనుమంట్ర మండల పరిషత్ పరిధిలో వివిధ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, వాటిని త్వరితగతిన పూర్తి చేయడంలో సఫలీకృతులైన ఎంపీడీవో ఎస్.వెంకటేశ్వర్రావు ఉత్తమ సేవా అవార్డు దక్కించుకున్నారు. వీరు ఏలూరులో ఆదివారం కలెక్టర్ సిద్ధార్థ జైన్ చేతులమీదుగా ఉత్తమసేవా అవార్డులు, ప్రశంసా పత్రాలను అందుకున్నారు. రైస్‌మిల్లర్లలో ద్వితీయ అవార్డుకు ఎంపికైన గుడిమెట్ల రామకృష్ణారెడ్డికి బదులుగా ఆయన సోదరుడు, మరో మేనేజింగ్ పార్టనర్ గుడిమెట్ల సుందరరామిరెడ్డి కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. ఈ సందర్భంగా వీరిని పలువురు అభినందించారు.