ముగ్గురు రైస్ మిల్లర్లకు సేవా అవార్డులు
Published Mon, Jan 27 2014 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM
పెనుమంట్ర, న్యూస్‌లైన్ : భారత గణతంత్ర వేడుకల్లో పెనుమంట్ర మండలానికి చెందిన ఇద్దరి రైస్‌మిల్లర్లతోపాటు తణుకు మండలం వేల్పూరుకు చెందిన ఓ రైస్‌మిల్లర్‌కు జిల్లా సేవా అవార్డులు దక్కాయి. 2012-13 సంవత్సరానికి గాను భారత ప్రభుత్వానికి లెవీ బియ్యం సేకరణలో ఆలమూరు వంశీతేజ మోడరన్ రైస్‌మిల్ అధినేత, రాష్ట్ర రైస్‌మిల్లర్స్ అసోషియేషన్ ఉపాధ్యక్షుడు నూకల వెంకటసత్యనారాయణ (చిట్టిబాబు) ప్రథమ అవార్డుకు ఎంపికయ్యారు. మల్లిపూడిలోని గుడిమెట్ల సుందరరామిరెడ్డి అండ్‌కో అధినేత గుడిమెట్ల రామకృష్ణారెడ్డి ద్వితీయ అవార్డుకు ఎంపికకాగా, తణుక మండలం వేల్పూరుకు చెందిన శ్రీరామలింగేశ్వరా రైస్‌మిల్ అధినేత బండారు గోవిందు తృతీయ అవార్డుకు ఎంపికయ్యారు.
వీరితోపాటు పెనుమంట్ర మండల పరిషత్ పరిధిలో వివిధ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, వాటిని త్వరితగతిన పూర్తి చేయడంలో సఫలీకృతులైన ఎంపీడీవో ఎస్.వెంకటేశ్వర్రావు ఉత్తమ సేవా అవార్డు దక్కించుకున్నారు. వీరు ఏలూరులో ఆదివారం కలెక్టర్ సిద్ధార్థ జైన్ చేతులమీదుగా ఉత్తమసేవా అవార్డులు, ప్రశంసా పత్రాలను అందుకున్నారు. రైస్‌మిల్లర్లలో ద్వితీయ అవార్డుకు ఎంపికైన గుడిమెట్ల రామకృష్ణారెడ్డికి బదులుగా ఆయన సోదరుడు, మరో మేనేజింగ్ పార్టనర్ గుడిమెట్ల సుందరరామిరెడ్డి కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. ఈ సందర్భంగా వీరిని పలువురు అభినందించారు.
Advertisement
Advertisement