సాక్షి, హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వే జోన్ ప్రగతి పథంలో పరుగులు తీస్తుందని జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ పేర్కొన్నారు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అంకితభావంతో, అత్యుత్తమ సేవలను అందజేయడమే ఈ ప్రగతికి కారణమని చెప్పారు. సికింద్రాబాద్ రైల్ నిలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించిన 68వ రైల్వే వారోత్సవాలలో జీఎం అరుణ్‌కుమార్ జైన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా అత్యుత్తమ సేవలందించిన 77 మంది అధికారులు, ఉద్యోగులకు విశిష్ట రైల్ సేవా పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ..ఈ ఏడాది 383.85 కి.మీ. కొత్త ట్రాక్‌లతో కొత్త ప్రాంతాలకు రైల్వే సదుపాయాలను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. ‘మిషన్ ఎలక్ట్రిఫికేషన్’ సాధించే దిశగా రికార్డు స్థాయిలో 1,017 రూట్ కి.మీ.ని విద్యుదీకరించినట్లు తెలిపారు.
ఈ ఆర్థిక ఏడాదిలో రూ. 21,635.49 కోట్ల అత్యధిక ఆదాయాన్ని ఆర్జించామన్నారు. అందులో 131.854 మిలియన్ టన్నుల సరుకు రవాణా ద్వారా రూ.13,051.09 కోట్ల ఆదాయం లభించిందన్నారు. అదనపు జనరల్ మేనేజర్ ఆర్.ధనుంజయులు, సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ అరవింద్ మల్ఖేడే, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎ.శ్రీధర్, వివిధ విభాగాల ఉన్నతాధికారులు, డివిజనల్ రైల్వే మేనేజర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment