వెలుగొండ కొండల్లో చిరుతల సంచారం
రెండు రోజుల క్రితం మేకను చంపిన చిరుత పులులు
చిరుత పులలను గుర్తించిన రైల్వే కూలీలు
భయాందోళనలో కొండ కింద గ్రామాల ప్రజలు
డక్కిలి : వెలుగొండ కొండల్లో చిరుత పులులు సంచరిస్తున్నట్లు సోమవారం ఓబులాపురం–కృష్ణపట్నం రైల్వే కూలీలు గుర్తించారు. రెండు రోజుల క్రితం వెంబులూరు గ్రామ సమీపంలోని అంబేడ్కర్‌నగర్‌కి చెందిన మేకలను చిరుత పులులు వేటాడి చంపినట్లు గుర్తించారు. సోమవారం అంబేడ్కర్‌నగర్‌కి చెందిన కొంతమంది కూలీలు రైల్వే పనులకు వెళ్లి సాయంత్రం తిరిగి వస్తుండగా కొండలపై 5 చిరుత పులులు సంచరిస్తుండగా ప్రత్యక్షంగా చూశామని, వాటిలో రెండు పెద్దవని, మూడు చిన్నవిగా ఉన్నాయని ఆ గ్రామానికి చెందిన కూలీలు విలేకర్లకు తెలిపారు. వెలుగొండ కొండల్లో పులులు సంచరిస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న కొండ కింద గ్రామాల్లోని పలు గ్రామాల రైతులు మేకలు, ఆవులు, గేదెలను కొండల్లోకి మేత కోసం తోలుకుపోయేందుకు భయపడుతున్నారు. అంతేకాక గ్రామాల్లోకి చిరుత పులులు వస్తాయేమోనని భయాందోళన చెందుతున్నారు.
చిరుత పులులపై సమాచారం లేదు
వెలుగొండలు కొండల్లో చిరుత పులుల సంచారంపై ఎలాంటి సమాచారం మాకు అందలేదు. చిరుత పులుల సెన్సెస్‌పై గతంలో ఎప్పడూ సేకరించలేదు. పెంచలకోన అడవుల్లో చిరుతలు తిరుగుతుంటాయి. ఇక్కడ చిరుత గండ్లు మాత్రమే ఉన్నట్లు గుర్తించాం. ఏదైనా ఉంటే బేస్‌క్యాంప్ సిబ్బంది మా దృష్టికి తీసుకువస్తారు.
– గోపాల్‌కృష్ణ, డీఆర్వో