Vema Reddy
-
‘ఏపీలో స్థానిక సంస్థలు నిర్వీర్యం’
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వం స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పంచాయితీ విభాగం అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి మండిపడ్డారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ పంచాయతీరాజ్‌లకు సువర్ణ అధ్యాయం ప్రారంభమైన రోజన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో పంచాయితీల కరెంట్ బిల్లులు చెల్లించకుండా మినహయింపు ఇచ్చారన్నారు. కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే పంచాయితీలు కూడా కరెంట్ బిల్లులు కట్టాలంటూ వచ్చిన డబ్బుల్ని లాగేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలకు సమాంతరంగా జన్మభూమి కమిటీలను నడుపుతున్నారని ఆరోపించారు. ప్రజలు ఎన్నుకున్న వారిని పక్కన పెట్టి పార్టీ నాయకులతో స్థానిక సంస్థల్ని నడపటం చాలా దారుణమన్నారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చే నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకుంటుందన్నారు. పంచాయితీల్లో కార్మికులకు మూడు నెలల నుంచి జీతాలు లేవన్నారు. కార్మికులు జీతాలు ఇవ్వకుండా స్వచ్ఛ భారత్‌లో స్వచ్ఛత ఎక్కడ నుంచి వస్తుందన్నారు. మంత్రి లోకేష్ పంచాయితీల్లో రోడ్లు వేశామని చెబుతున్నారు.. ఎక్కడ వేశారో చెప్పాలని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఉద్యోగులు కడుపుమంటతో రగిలిపోతున్నారని తెలిపారు. ఉద్యోగుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారని .. దయచేసి స్థానిక సంస్థల్ని బతుకనివ్వాలని ఆయన కోరారు. -
'చివరకు మిగిలేది’ నవలను సినిమాగా చేయాలని ఉంది
‘‘ఓ కారు డ్రైవర్ స్నేహం నా కెరీర్‌ని మలుపు తిప్పింది. సినిమా ఇండస్ట్రీలోకి రావాలన్న నా కలకు మార్గం ఆ డ్రైవర్ చూపించాడు. రహీమ్ అనే ఆ డ్రైవర్ నన్ను రచయిత పోసాని కృష్ణమురళి దగ్గర అసిస్టెంట్‌గా చేర్చాడు’’ అని రచయిత వేమారెడ్డి చెప్పారు. పోసాని దగ్గర రైటింగ్ అసిస్టెంట్‌గా, తర్వాత సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన వేమారెడ్డి ‘తడాఖా’, ‘రేసుగుర్రం’ తదితర చిత్రాలకు సంభాషణలు రాశారు. ప్రస్తుతం సుమంత్ అశ్విన్ హీరోగా ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తన కెరీర్ గురించి వేమారెడ్డి వివరిస్తూ -‘‘నాకు మొదట్నుంచీ దర్శకత్వం మీద మక్కువ ఉంది. రచయితగా సంపాదించిన అనుభవంతో డైరక్షన్ చేస్తున్నాను. ఎమ్మెస్ రాజుగారు, సుమంత్ అశ్విన్ కథ వినగానే అంగీకరించారు. నా స్నేహితులే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సహజీవనం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అంతర్లీనంగా మంచి సందేశం కూడా ఉంది. ఇప్పటికి 50 శాతం సినిమా పూర్తయ్యింది’’ అని చెప్పారు. చిన్నప్పట్నుంచీ పుస్తకాలు చదవడం బాగా అలవాటని, ఎక్కడైనా బుక్ ఫెస్టివల్ జరిగితే అక్కడికి వెళ్లిపోతుంటానని అన్నారు. తాను చదివిన నవలల్లో ‘చివరికి మిగిలేది’ బాగా ఆకట్టుకుందని, దాన్ని కొంచెం సినిమాటిక్‌గా మార్చి, సినిమా చేయాలని ఉందని అన్నారు.