venkata prasad
-
ఈ సీఐ ఉంటే మా ఆటలు సాగవ్!
అనంతపురం: తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ కదిరి టౌన్ సీఐ తమ్మిశెట్టి మధును టార్గెట్ చేసినట్లు తెలిసింది. ఆ సీఐ ఇక్కడుంటే తమ ఆటలు సాగవని భావించి ఎలాగైనా ఆ సీఐని ఇక్కడి నుంచి పంపించే కుట్రలు చేస్తున్నట్లు సమాచారం. పట్టణంలోని ఎన్జీఓ కాలనీ చివర కొందరు మూడు దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన స్థలంలో ఇటీవల ప్లాట్లు చదును చేసుకుంటుంటే కందికుంటతో పాటు ఆయన అనుచరులు అక్కడికెళ్లి గొడవకు దిగిన విషయం తెలిసిందే. అడ్డుకున్న సీఐ మధును కందికుంట అసభ్య పదజాలంతో దూషించారు. జేసీబీని పెట్రోలు పోసి తగలబెట్టాలని చూస్తే పోలీసులు ఆ గుంపును చెదరగొట్టే ప్రయత్నంలో కందికుంట చేతికి స్వల్పంగా దెబ్బ తగిలింది. దీన్ని జీర్ణించుకోలేని కందికుంట అప్పటి నుంచి సీఐని టార్గెట్ చేశాడు. ఎల్లో మీడియాలో ఆయనపై తప్పుడు కథనాలు రాయించి ఇక్కడి నుంచి బదిలీ చేయించడమో, లేదంటే సస్పెండ్ చేయించడమో చేయాలని కుట్ర పన్నుతున్నట్లు టీడీపీలోనే మరో వర్గం చెబుతోంది. కాగా, తనకల్లు మండలం కొర్తికోటలో జరిగిన త్రిబుల్ మర్డర్ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరచినందుకు ప్రభుత్వం ఆయనకు ఏబీసీడీ(అవార్డు ఫర్ బెస్ట్ క్రైం డిటెక్షన్) అవార్డు కూడా ఇచ్చింది. అలాంటి పోలీసు అధికారిని టీడీపీ టార్గెట్ చేయడంపై కదిరి ప్రజలు మండిపడుతున్నారు. ఇవిగో సాక్ష్యాలు.. ►‘భూతగాదా జరిగినప్పుడు సీఐ మధు నా నోట్లో తుపాకీ పెట్టి కాల్చాలని చూశాడు..’ అని కందికంట తప్పుడు ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేశాడు. ► ఇటీవల కదిరి మున్సిపల్ పరిధిలోని సైదాపురంలో స్థానిక ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డి ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమం చేపట్టినప్పుడు అక్కడ కందికుంట అనుచరులు ఎమ్మెల్యేపై అనవసరంగా గొడవకు దిగారు. అక్కడే ఉన్న సీఐ మధు వారిని వారించారు. తర్వాత సైదాపురానికి చెందిన ఒకరిద్దరు టీడీపీ మహిళలు పట్టణ పోలీస్ స్టేషన్‌కు వచ్చి సీఐ మధు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ తప్పుడు ఫిర్యాదు చేశారు. ► పట్టణంలో గణేష్ నిమజ్జనం రోజు కూడా కందికుంట వర్గం అడుగడుగునా సీఐని టార్గెట్ చేసింది. శోభాయాత్రలో గొడవలు సృష్టించి ఆ నెపం సీఐపై నెట్టాలని కుట్రలు చేశారు. కానీ ఆరోజు పోలీసులు సంయమనం పాటించారు. ► టీడీపీ మహిళా రాష్ట్ర నాయకురాలు పరీ్వన్‌భాను కొందరు మహిళలను వెంటబెట్టుకొని రెండు రోజుల క్రితం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మహిళల పట్ల సీఐ ప్రవర్తన ఏం బాగోలేదంటూ నిరసన ప్రదర్శించాలని వెళ్లారు. ఇటీవల కందికుంట అనుచరులు పట్టపగలే నడిరోడ్డుపై ఓ వ్యక్తిని చావబాది.. కిడ్నాప్ చేయాలని ప్రయతి్నంచిన వీడియోను సీఐ చూపెట్టడంతో ఆమె సిగ్గుతో వెనుదిరగాల్సి వచ్చింది. ► భూతగాదాలో కందికుంటపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన కుటాగుళ్లకు చెందిన గంగులప్పను కందికుంట ఇంటికి పిలిపించి రాజీ చేసుకున్నట్లు తెలుస్తోంది. సీఐ ప్రోద్బలంతోనే తాను ఆరోజు కేసు పెట్టాల్సి వచ్చిందంటూ సీఐపైనే రివర్స్ కేసు పెట్టించాలనే కుట్ర కూడా జరుగుతున్నట్లు పోలీసు నిఘా వర్గాలు పసిగట్టాయి. కుట్రలకు ఖాకీ భయపడదు కుట్రలకు, బెదిరింపులకు ఖాకీ బెదరదు. కందికుంట మా అమ్మను తిట్టినా నేను భరించా. మున్సిపల్ ఎన్నికల సమయంలో కూడా నన్ను తిట్టాడు. శాంతిభద్రతలకు విఘాతం కలగరాదని సంయమనంతో ఉన్నా. తప్పుడు కేసులకు భయపడితే పోలీసు ఉద్యోగం చేయలేం. – మధు, కదిరి టౌన్ సీఐ -
నిత్య పెళ్లి కొడుకు
నెల్లూరు, బుచ్చిరెడ్డిపాళెం: పెళ్లి కాలేదని చెప్పి మోసం చేసి మూడో పెళ్లి చేసుకుని తనను ముంచేశాడని భార్య కన్నీరు పెట్టింది. నాలుగో పెళ్లికి సిద్ధమవుతున్నాడని తెలుసుకుని భర్త ఇంటి ముందు ఆమె తల్లిండ్రులతో కలిసి సోమవారం ధర్నాకు దిగింది. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం భద్రిరాజుపాళేనికి చెందిన పుచ్చలపల్లి గంగిరెడ్డి, జయమ్మ దంపతుల ఏకైక కుమార్తె రాధను బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన కమతం శ్రీనివాసులురెడ్డి, శ్రీనివాసమ్మ ఏకైక కుమారుడు కమతం వెంకట ప్రసాద్‌రెడ్డికి ఇచ్చి 2016 డిసెంబరు 4న తిరుమలలో వివాహం చేశారు. వరకట్నం కింద రూ.11 లక్షల నగదు, 15 సవర్ల బంగారం ఇచ్చారు. అయితే వివాహానికి ముందు నెల్లూరులో ఉన్నామని చెప్పిన ప్రసాద్‌రెడ్డి వివాహమైన తర్వాత బుచ్చిరెడ్డిపాళేనికి తీసుకు వచ్చాడు. సొంత ఇళ్లు, పొలాలు ఉండటంతో ఇక్కడే ఉందామని నమ్మబలికాడు. పది రోజుల తర్వాత నుంచి రాధ తల్లిదండ్రులు ఉంటున్న ఇంటిని తన పేరిట రాయమని రాధను మామ శ్రీనివాసులురెడ్డి డిమాండ్ చేశాడు. వాళ్లకు వేరే ఆధారం లేదని రాధ చెప్పడంతో భర్త, అత్తమామలు చిత్రహింసలు పెట్టడం ప్రారంభించారు. మామ శ్రీనివాసులురెడ్డి కోడలు రాధను శారీరకంగా హింసించడం మొదలు పెట్టాడు. అత్త శ్రీనివాసమ్మ రాధ జడ కత్తిరించడం, వాతలు పెట్టడం మొదలు పెట్టింది. రాత్రి నిద్రపోయే సమయంలో శ్రీనివాసులురెడ్డి కోడలు రాధ పక్కన పడుకునేవాడు. ఈ విషయం భర్త ప్రసాద్‌రెడ్డికి చెప్పినా సర్దుకుపోమని చెప్పేవాడు. ఈ క్రమంలో 2017 ఏప్రిల్‌లో నెల్లూరుకు ద్విచక్ర వాహనంలో తీసుకెళుతూ పడేశాడు. దీంతో నువ్వు మీ పుట్టింటికి వెళ్లి కొంతకాలం ఉండమని చెప్పాడు. అప్పటికే చిత్రహింసలు భరించలేక ఇబ్బంది పడుతున్న రాధ అత్తింట్లో ఉండలేక రెండు నెలలు పుట్టింటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ప్రసాద్‌రెడ్డి అత్తమామలకు ఫోన్‌చేసి మీ అమ్మాయిని మీ వద్దే ఉంచుకోండి అంటూ చెప్పాడు. విచారిస్తే వెలుగులోకి వచ్చింది ప్రసాద్‌రెడ్డి ఫోన్ సంభాషణతో కంగారు పడిన రాధ తల్లిదండ్రులు బుచ్చిరెడ్డిపాళేనికి రాగా ఇంట్లోకి రానివ్వలేదు. తలుపులకు తాళం వేశారు. లోపల ఉండి కూడా ఎవరూ లేరని ప్రసాద్‌రెడ్డి తల్లి శ్రీనివాసమ్మ చెప్పేది. దీంతో ప్రసాద్‌రెడ్డి కుటుంబీకులు, స్థానికులను విచారించగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రసాద్‌రెడ్డికి 2013లో సుప్రియ అనే యువతితో వివాహమైంది. 2015లో కాగులపాడుకు చెందిన నిరోషా అనే యువతితో వివాహం జరుగుతుండగా ప్రసాద్‌రెడ్డికి ముందే జరిగిన పెళ్లి విషయం తెలిసి మండపంలోనే వివాహాన్ని ఆపేశారు. ఆ తర్వాత 2016 డిసెంబరు 4వ తేదీన రాధను వివాహం చేసుకున్నారు. మళ్లీ ఇప్పుడు తాజాగా నాలుగో పెళ్లికి సిద్ధమవుతున్నాడని రాధ వాపోయింది. పోలీసుల అదుపులో భర్త రాధ తన కుటుంబ సభ్యులతో కలిసి భర్త ప్రసాద్‌రెడ్డి ఇంటి ముందు సోమవారం ధర్నాకు దిగింది. దీంతో మామ శ్రీనివాసులురెడ్డి తమపై కొందరు దాడి చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఇంటి వద్దకు రాగా, జరిగిన విషయం తెలిసి పోలీసులు ప్రసాద్‌రెడ్డిని బయటకు పిలిచారు. అయితే అతను ఇంట్లో తలుపు వేసుకుని బయటకు రాలేదు. ఎట్టకేలకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసులకు ఫిర్యాదు గతంలో బుచ్చిరెడ్డిపాళెంలో పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రాధ ఆవేదన వ్యక్తం చేసింది. మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరకు జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ వద్దకు వెళ్లడంతో తన సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకున్నారని చెప్పింది. 2017 జూన్‌లో విజయవాడ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఇప్పుడు చార్జిషీట్ సిద్ధం చేస్తుండటంతో ఎక్కడ మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తుందోనని ఆస్తి మొత్తం ప్రసాద్‌రెడ్డి తన తల్లి శ్రీనివాసమ్మ పేరిట రిజిస్టర్ చేశారని తెలిపింది. అత్త మామలతో కాకుండా వేరో చోట తాను కాపురం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, తనకు న్యాయం చేయాలని రాధ కన్నీటి పర్యంతమైంది. ఈ విషయమై సీఐ టీవీ సుబ్బారావును సంప్రదించగా రాధ ఎస్పీని కలిసిన విషయం వాస్తవమేనన్నారు. ఫిర్యాదు తనకు అందగా పరిశీలించానన్నారు. ఇది వరకే దీనిపై విజయవాడలో కేసు నమోదైందని, కోర్టులో కేసు నడుస్తోందని తెలిపారు. -
ప్రహ్లాద్‌మోదీ కార్యదర్శినంటూ హైదరాబాదీ దందాలు
హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ కార్యదర్శినంటూ నగరవాసి దందా ప్రారంభించాడు. ఢిల్లీకి ఫోన్లు చేసి పలు అపాయింట్మెంట్లు, ఫైల్స్‌పై సంతకాలు చేయాలంటూ డిమాండ్ చేశాడు. కొన్ని పనులు కూడా చేయించుకుని ఆర్థికంగానూ లాభపడినట్లు ప్రచారం జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సంతోష్‌నగర్ ప్రాంతానికి చెందిన వెంకటప్రసాద్ యాడ్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. ఇతడి స్నేహితుడు తెలంగాణ రేషన్ డీలర్స్ అసోసియేషన్ సెక్రటరీగా పని చేస్తుండటంతో ఆలిండియా రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న ప్రహ్లాద్ మోదీ గతంలో చంద్రాయణగుట్ట ప్రాంతానికి వచ్చారు. అప్పట్లో తన స్నేహితుడి ద్వారా ఆయనను కలిసిన వెంకట ప్రసాద్ ఆ తర్వాత ఒకటి రెండుసార్లు ప్రహ్లాద్మోదీతో ఫోన్లో మాట్లాడారు. దీన్ని క్యాష్ చేసుకుందామని పథకం వేసిన వెంకట ప్రసాద్ ఓ సెల్‌ఫోన్ నెంబర్ తీసుకుని ‘ట్రూ కాలర్’ యాప్‌లో ‘పీఎంఓ మోదీ సెక్రటరీ’ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాడు. గత కొన్ని రోజులుగా పలు కేంద్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులకు ఫోన్లు చేస్తూ దందాలు మొదలుపెట్టాడు. తాను ప్రహ్లాద్‌మోదీ వ్యక్తిగత కార్యదర్శినని, ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) నుంచి మాట్లాడుతున్నానంటూ చెబుతూ.. అనేక మందికి అపాయింట్మెంట్లు ఇవ్వాలని, కొన్ని ఫైల్స్‌పై త్వరగా సంతకాలు చేసి క్లియర్ చేయాలని డిమాండ్ చేయడంతో పాటు మరికొన్ని సిఫార్సులు చేయించుకుంటున్నాడు. దీనిపై ఢిల్లీకి చెందిన కొందరు ఉన్నతాధికారులు నగర పోలీసు విభాగానికి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. బీజేపీ లీగల్ సెల్ ఈ వ్యవహారంపై అబిడ్స్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీంతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం బుధవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం అబిడ్స్ పోలీసులకు వెంకటప్రసాద్ ను అప్పగించారు. -
ఏసీబీకి చిక్కిన డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్
తిరుపతి: తిరుపతి కార్పొరేషన్లో డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్-1 గా పనిచేస్తున్న వెంకట ప్రసాద్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. తిరుపతి రూరల్ మండలం కొరమేణుగుంట గ్రామానికి చెందిన సునీత అనే మహిళ తెలుగుగంగ కొళాయి కనెక్షన్ కోసం కొన్నిరోజుల క్రితం దరఖాస్తు చేసుకుంది. ధరఖాస్తు చేసి చాలా రోజులైనా ఇంకా మంజూరు కాకపోవడంతో వెంకట ప్రసాద్‌ను కలిసి విషయం గురించి చెప్పింది. దీంతో ఆయన రూ. 30 వేలు ఇస్తేనే పని అవుతుందని తెలిపాడు. రూ. 20 వేలు ఇస్తానని కార్పొరేషన్ అధికారితో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు ఆమె భర్త తెలియజేశాడు. పథకం ప్రకారం తిరుపతిలోని ఇండియన్ ఆయిల్ పెట్రోలు పంపు వద్ద లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డబ్బులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
ఎస్సై వేధింపులతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
గుంటూరు: గుంటూరు జిల్లాలోని అమరావతిలో ఎస్సై వెంకటప్రసాద్ ఓవరాక్షన్‌తో వైఎస్సార్ సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రత్యర్థుల ఫిర్యాదుతో 14 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. అయితే కోర్టులో బెయిల్ తెచ్చుకున్నప్పటికీ పోలీస్ స్టేషన్‌కు పిలిచి ఎస్సై వేధిస్తున్నట్టు ఎస్సైపై ఆరోపణలు వెలువెత్తాయి. ఈ క్రమంలో ఎస్సై వేధింపులు పడలేక నాగరాజు అనే కార్యకర్త పురుగలమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలిసింది. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.