Kadiri TDP Incharge Kandikunta Venkata Prasad Harassment On CI - Sakshi
Sakshi News home page

కందికుంట మా అమ్మను తిట్టినా నేను భరించా.. సీఐ మధు

Published Tue, Sep 13 2022 9:55 AM | Last Updated on Tue, Sep 13 2022 10:55 AM

Kadiri TDP Incharge Kandikunta Venkata Prasad Harassment On CI   - Sakshi

అనంతపురం: తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకర్గ ఇన్‌చార్జ్‌ కందికుంట వెంకట ప్రసాద్‌ కదిరి టౌన్‌ సీఐ తమ్మిశెట్టి మధును టార్గెట్‌ చేసినట్లు తెలిసింది. ఆ సీఐ ఇక్కడుంటే తమ ఆటలు సాగవని భావించి ఎలాగైనా ఆ సీఐని ఇక్కడి నుంచి పంపించే కుట్రలు చేస్తున్నట్లు సమాచారం. పట్టణంలోని ఎన్‌జీఓ కాలనీ చివర కొందరు మూడు దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన స్థలంలో ఇటీవల ప్లాట్లు చదును చేసుకుంటుంటే కందికుంటతో పాటు ఆయన అనుచరులు అక్కడికెళ్లి గొడవకు దిగిన విషయం తెలిసిందే. అడ్డుకున్న సీఐ మధును కందికుంట అసభ్య పదజాలంతో దూషించారు. 

జేసీబీని పెట్రోలు పోసి తగలబెట్టాలని చూస్తే పోలీసులు ఆ గుంపును చెదరగొట్టే ప్రయత్నంలో కందికుంట చేతికి స్వల్పంగా దెబ్బ తగిలింది. దీన్ని జీర్ణించుకోలేని కందికుంట అప్పటి నుంచి సీఐని టార్గెట్‌ చేశాడు. ఎల్లో మీడియాలో ఆయనపై తప్పుడు కథనాలు రాయించి ఇక్కడి నుంచి బదిలీ చేయించడమో, లేదంటే సస్పెండ్‌ చేయించడమో చేయాలని కుట్ర పన్నుతున్నట్లు టీడీపీలోనే మరో వర్గం చెబుతోంది. కాగా, తనకల్లు మండలం కొర్తికోటలో జరిగిన త్రిబుల్‌ మర్డర్‌ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరచినందుకు ప్రభుత్వం ఆయనకు ఏబీసీడీ(అవార్డు ఫర్‌ బెస్ట్‌ క్రైం డిటెక్షన్‌) అవార్డు కూడా ఇచ్చింది. అలాంటి పోలీసు అధికారిని టీడీపీ టార్గెట్‌ చేయడంపై కదిరి ప్రజలు మండిపడుతున్నారు. 

ఇవిగో సాక్ష్యాలు.. 

►‘భూతగాదా జరిగినప్పుడు సీఐ మధు నా నోట్లో తుపాకీ పెట్టి కాల్చాలని చూశాడు..’ అని కందికంట తప్పుడు ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేశాడు. 

► ఇటీవల కదిరి మున్సిపల్‌ పరిధిలోని సైదాపురంలో స్థానిక ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డి ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమం చేపట్టినప్పుడు అక్కడ కందికుంట అనుచరులు ఎమ్మెల్యేపై అనవసరంగా గొడవకు దిగారు. అక్కడే ఉన్న సీఐ మధు వారిని వారించారు. తర్వాత సైదాపురానికి చెందిన ఒకరిద్దరు టీడీపీ మహిళలు పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి సీఐ మధు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ తప్పుడు ఫిర్యాదు చేశారు.  

► పట్టణంలో గణేష్‌ నిమజ్జనం రోజు కూడా కందికుంట వర్గం అడుగడుగునా సీఐని టార్గెట్‌ చేసింది. శోభాయాత్రలో గొడవలు సృష్టించి ఆ నెపం సీఐపై నెట్టాలని కుట్రలు చేశారు. కానీ ఆరోజు పోలీసులు సంయమనం పాటించారు. 

► టీడీపీ మహిళా రాష్ట్ర నాయకురాలు పరీ్వన్‌భాను కొందరు మహిళలను వెంటబెట్టుకొని రెండు రోజుల క్రితం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి మహిళల పట్ల సీఐ ప్రవర్తన ఏం బాగోలేదంటూ నిరసన ప్రదర్శించాలని వెళ్లారు. ఇటీవల కందికుంట అనుచరులు పట్టపగలే నడిరోడ్డుపై ఓ వ్యక్తిని చావబాది.. కిడ్నాప్‌ చేయాలని ప్రయతి్నంచిన వీడియోను సీఐ చూపెట్టడంతో ఆమె సిగ్గుతో వెనుదిరగాల్సి వచ్చింది. 

► భూతగాదాలో కందికుంటపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన కుటాగుళ్లకు చెందిన గంగులప్పను కందికుంట ఇంటికి పిలిపించి రాజీ చేసుకున్నట్లు తెలుస్తోంది. సీఐ ప్రోద్బలంతోనే తాను ఆరోజు కేసు పెట్టాల్సి వచ్చిందంటూ సీఐపైనే రివర్స్‌ కేసు పెట్టించాలనే కుట్ర కూడా జరుగుతున్నట్లు పోలీసు నిఘా వర్గాలు పసిగట్టాయి.  

కుట్రలకు ఖాకీ భయపడదు 
కుట్రలకు, బెదిరింపులకు ఖాకీ బెదరదు. కందికుంట మా అమ్మను తిట్టినా నేను భరించా. మున్సిపల్‌ ఎన్నికల సమయంలో కూడా నన్ను తిట్టాడు.  శాంతిభద్రతలకు విఘాతం కలగరాదని సంయమనంతో ఉన్నా. తప్పుడు కేసులకు భయపడితే పోలీసు ఉద్యోగం చేయలేం.  
– మధు, కదిరి టౌన్‌ సీఐ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement