ప్రహ్లాద్‌మోదీ కార్యదర్శినంటూ హైదరాబాదీ దందాలు
హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ కార్యదర్శినంటూ నగరవాసి దందా ప్రారంభించాడు. ఢిల్లీకి ఫోన్లు చేసి పలు అపాయింట్‌మెంట్లు, ఫైల్స్‌పై సంతకాలు చేయాలంటూ డిమాండ్ చేశాడు. కొన్ని పనులు కూడా చేయించుకుని ఆర్థికంగానూ లాభపడినట్లు ప్రచారం జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సంతోష్‌నగర్ ప్రాంతానికి చెందిన వెంకటప్రసాద్ యాడ్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. ఇతడి స్నేహితుడు తెలంగాణ రేషన్ డీలర్స్ అసోసియేషన్ సెక్రటరీగా పని చేస్తుండటంతో ఆలిండియా రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న ప్రహ్లాద్ మోదీ గతంలో చంద్రాయణగుట్ట ప్రాంతానికి వచ్చారు.
అప్పట్లో తన స్నేహితుడి ద్వారా ఆయనను కలిసిన వెంకట ప్రసాద్ ఆ తర్వాత ఒకటి రెండుసార్లు ప్రహ్లాద్‌మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. దీన్ని క్యాష్ చేసుకుందామని పథకం వేసిన వెంకట ప్రసాద్ ఓ సెల్‌ఫోన్ నెంబర్ తీసుకుని ‘ట్రూ కాలర్’ యాప్‌లో ‘పీఎంఓ మోదీ సెక్రటరీ’ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాడు. గత కొన్ని రోజులుగా పలు కేంద్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులకు ఫోన్లు చేస్తూ దందాలు మొదలుపెట్టాడు. తాను ప్రహ్లాద్‌మోదీ వ్యక్తిగత కార్యదర్శినని, ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) నుంచి మాట్లాడుతున్నానంటూ చెబుతూ.. అనేక మందికి అపాయింట్‌మెంట్లు ఇవ్వాలని, కొన్ని ఫైల్స్‌పై త్వరగా సంతకాలు చేసి క్లియర్ చేయాలని డిమాండ్ చేయడంతో పాటు మరికొన్ని సిఫార్సులు చేయించుకుంటున్నాడు.
దీనిపై ఢిల్లీకి చెందిన కొందరు ఉన్నతాధికారులు నగర పోలీసు విభాగానికి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. బీజేపీ లీగల్ సెల్ ఈ వ్యవహారంపై అబిడ్స్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీంతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం బుధవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం అబిడ్స్ పోలీసులకు వెంకటప్రసాద్ ను అప్పగించారు.