
లక్నో: ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ లక్నో విమానాశ్రయంలో బుధవారం ధర్నాకు దిగారు. మద్దతుదారులను తానున్న స్థలం వద్దకు పోలీసులు అనుమతించలేదని, పోలీసులు వారిని అరెస్టు చేశారన్న ఆరోపణలతో ఆయన ఈ ధర్నా చేశారు. అయితే తామెవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు చెబుతున్నారు. విమానాశ్రయ అదనపు జనరల్ మేనేజర్ కథనం ప్రకారం.. సాయంత్రం నాలుగు గంటల సమయంలో విమానం దిగిన ప్రహ్లాద్ మద్దతుదారులను తన వద్దకు అనుమతించలేదని ధర్నా చేశారు.
అంతేగాక పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారని, కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన వారు పోలీస్ స్టేషన్లో ఉన్నంతసేపు తాను ధర్నాను విరమించేది లేదని స్పష్టం చేశారు. ఈ చర్య తీసుకోవాల్సిందిగా ప్రధాని కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయని పోలీసులు చెప్పారని అన్నారు. అయితే ఆయా వాదనలను సరోజిని నగర్ పోలీస్ ఎస్‌హెచ్‌ఓ మహేంద్ర సింగ్ ఖండించారు. తన పరిధితో ప్రహ్లాద్‌కు సంబంధించిన వారెవరూ అరెస్టయినట్లు తనకు తెలియదని అన్నారు. అయితే ప్రధాని సోదరుడైన ప్రహ్లాద్ పేరును ఫోర్జరీ చేసి జితేంద్ర తివారి అనే ఓ వ్యక్తి సుల్తాన్‌పూర్‌లో అరెస్టయ్యాడని నగర ఎస్‌హెచ్‌ఓ భూపేంద్ర సింగ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment