పోలీసులం అంటూ వచ్చారు..
మలేషియా టౌన్షిప్: పోలీసులమంటూ నమ్మబలికి ఓ మహిళ నుంచి బంగారు నగలు దోచుకెళ్లారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరం కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్బీ మూడోఫేజ్ ఎల్ఐజీ కాలనీకి చెందిన వెంకటరమణమ్మ శనివారం ఉదయం దేవాలయంలో పూజలు ముగించుకుని ఇంటికి వెళ్తోంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చి పక్కవీధిలో దొంగతనం జరిగిందని, తాను మఫ్టీలో ఉన్న పోలీసునని నమ్మబలికాడు.
మెడలో ఉన్న గొలుసును తీసి ఇస్తే ఎలా భద్రపరుచుకోవాలో చూపిస్తానని చెప్పాడు. దీంతో వెంకటరమణమ్మ మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు పుస్తెల తాడును ఆ అపరిచితుడికి ఇచ్చింది. దాన్ని ఇలా భద్రపర్చాలంటూ గొలుసును కర్చీఫ్లో ఉంచి మడతపెట్టాడు. ఆమె దృష్టి మరల్చి గొలుసు బదులు గులకరాయిని అందులో ఉంచి ఆమెకు ఇచ్చాడు. గొలుసును తన వద్ద ఉంచుకుని, అక్కడే బైక్పై సిద్ధంగా ఉన్న వ్యక్తితో కలసి క్షణాల్లోనే ఉడాయించాడు. కాసేపటి తర్వాత మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు కుటుంబసభ్యులతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.