అత్తారింటికి దారిలో...
బ్రేక్ ఇన్స్పెక్టర్ మామూళ్ల కక్కుర్తి అదుపులోకి తీసుకున్న పోలీసులు
వెంకటాచలం: ప్రయాణంలో ఉన్నా చేతి వాటం కుదురుగా కూర్చోనివ్వలేదు. ఆ బ్రేక్ ఇన్స్పెక్టర్ అత్తారింటికి వెళ్తూ దారిలో మామూళ్లు వసూలు చేసుకుపోదామనుకున్నారు. కానీ పోలీసులకు దొరికిపోయి మరో ‘అత్తారింటికి’ వెళ్లారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్గేట్ వద్ద స్థానిక ఎస్సైకి విజయవాడకు చెందిన బ్రేక్ ఇన్స్పెక్టర్ కృష్ణవేణి పట్టుబడిన వివరాల్లోకి వెళితే..
వెంకటగిరిలోని తన అత్తగారింటికి భర్త, అత్తతో కలసి విజయవాడ నుంచి బ్రేక్ ఇన్స్పెక్టర్ కృష్ణవేణి ఆదివారం బయలుదేరారు. సాయంత్రం 6.30గంటల సమయంలో వెంకటాచలం టోల్గేట్ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో అక్కడకు గేదెలను చెన్నైకు తీసుకెళుతున్న మూడు లారీలు వచ్చాయి. వెంటనే బ్రేక్ ఇన్స్పెక్టర్ కృష్ణవేణి కారుడ్రైవర్ ఆ లారీలను ఆపాడు. ఒక్కొక్కరు రూ.30 వేలు ఇవ్వాల్సిందిగా లారీడ్రైవర్లను డిమాండ్ చేశారు. వారు అంత ఇచ్చుకోలేమనడంతో కొంతసేపు వాదన జరిగింది. ఈ సమయంలో వెంకటాచలం ఎస్సై వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఎస్సైను చూసి బ్రేక్ఇన్స్పెక్టర్ కారును హడావుడిగా నెల్లూరువైపు యూటర్న తీయించారు. ఇది గమనించి ఎస్సై తన సిబ్బందితో కారును అడ్డగించి బ్రేక్ ఇన్స్పెక్టర్ను, ఆమె భర్తను, అత్తను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే వారు లారీడ్రైవర్ల నుంచి తీసుకున్న రూ. 1,500ను కూడా స్వాధీనం చేసుకున్నారు. టోల్గేటు వద్దే కేసు నమోదు చేసి వారిని పోలీస్స్టేషన్ తరలించారు. పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు రావడంతో ఎస్సై రాత్రి 10 గంటల వరకు ఈ విషయాన్ని బయటకు పొక్కనీయలేదు.
డ్రైవరు కక్కుర్తి పడ్డాడు!
ఈ విషయమై బ్రేక్ ఇన్స్పెక్టర్ కృష్ణవేణిని పోలీసులు వివరణ కోరగా తమ కారు డ్రైవరు కక్కుర్తిపడి మామూళ్లు వసూలు చేశాడన్నారు. ఆ వసూళ్లకు తమకు ఎలాంటి సంబంధం లేదని సమాధానమిచ్చారు.