3 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
– 7న గరుడ సేవ, 8న స్వర్ణరథం, 10న రథోత్సవం
– 3న శ్రీవారికి సీఎం చేతుల మీదుగా పట్టువస్త్రాలు
– భారీ ఏర్పాట్లలో టీటీడీ యంత్రాంగం
తిరుపతి : తిరుమల కొండపై వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 3 నుంచి 11 వరకూ జరుగనున్నాయి. 3న «ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు 11న జరిగే స్వామివారి స్నపన తిరుమంజన, చక్రస్నానం, ధ్వజావరోహణంలతో ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే తొలి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తిరుమలకు విచ్చేసి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కాగా ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లలో టీటీడీ అధికార యంత్రాంగం నిమగ్నమైంది.
ఏటా తిరుమల వేంకటేశుని వార్షిక బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి. సుమారు 10 లక్షల మందికి పైగా భక్తులు ఉత్సవాలకు హాజరై స్వామివారిని దర్శిస్తుంటారు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి కూడా భక్తులు ఉత్సవాలకు హాజరవుతుంటారు. ఈ ఏడాది కూడా ఉత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించి విజయవంతం చేయాలని టీటీడీ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈనెల 27న కోయిల్ అళ్వార్ తిరుమంజన సేవ, అక్టోబరు 2న అంకురార్పణలతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. 3 నుంచి శ్రీవారికి వాహన సేవలు ప్రారంభమవుతాయి. 3న ఉదయం 6.15 గంటలకు ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేషవాహనం సేవలుంటాయి. అదేవిధంగా 4న చిన్న శేషవాహనం,హంస వాహనం, 5న సింహ వాహనం, ముత్యపుపందిరి వాహన సేవలు, 6న కల్పవక్ష, సర్వభూపాల వాహనాలు,7న మోహినీ అవతారం,అదే రోజు రాత్రి గరుడ వాహనం, 8న హనుమంత, గజవాహన సేవలు, 9న సూర్యప్రభ, చంద్రప్రభ వాహనసేవలు ఉంటాయి. 10న ఉదయం 7 గంటలకు కనుల విందుగా రథోత్సవాన్ని నిర్వహించనున్నారు. అదేరోజు రాత్రి అశ్వవాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఉత్సవాల్లో చివరి రోజైన అక్టోబరు 11న ఉదయం 6–9 గంటల మధ్య స్వామి వారి స్నపన తిరుమంజనం, చక్రస్నానం కార్యక్రమాలు పూర్తవుతాయి. రాత్రి 9 గంటలకు ధ్వజావరోహణంతో స్వామివారి సేవలు ముగుస్తాయి.
ఈ నెలాఖరుకు ఏర్పాట్లు పూర్తి...
ఈ నెలాఖరుకల్లా ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు ఇప్పటికే వివిధ విభాగాల అధికారులతో మూడు విడతలుగా సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తెలుగు, తమిళ, కన్నడ భక్తుల కోసం ఆయా భాషల్లో ఉత్సవాల ప్రసారాలు ఉండాలని ఎస్వీబీసీ చానల్ సీఈవో నరసింహారావుకు సూచించారు. భక్తులకు సంబంధించిన భద్రత, వాహనాల రాకపోకలు, వసతి, మాడవీధుల్లో వాహనసేవల నిర్వహణలపై చర్చించారు. టీటీడీ పాలకమండలి ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జేఈవోలు కేఎస్ శ్రీనివాసరాజు, ప్రోలా భాస్కర్లు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.