Venkayah Naidu
-
రికార్డు సృష్టించిన అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం-2021
సింగపూర్: అంతర్జాల వేదికపై 34 దేశాల తెలుగు కళాకారులతో “అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం -2021” సంచలనం సృష్టించింది.“శ్రీ సాంస్కృతిక కళాసారథి” సింగపూర్ సంస్థ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా, 3, 4 వ తేదీలలో 24 గంటల పాటు అద్వితీయంగా జరిగిన “అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం 2021” కార్యక్రమంలో ప్రపంచ నలుమూలల నుండి 35 దేశాల నుండి 45 తెలుగు సంస్థలు, ప్రతినిధులు పాల్గొని ఒకే ప్రపంచ తెలుగు సాంస్కృతిక కుటుంబంగా కలసి, తెలుగు సంస్కృతికి నీరాజనాలు పట్టారు. కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారు జ్యోతి ప్రకాశనం గావించి తమ అనుగ్రహభాషణాన్ని అందించగా, భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కార్యక్రమంలో పాల్గొంటున్న 34 దేశాల సంస్థల ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రారంభోపన్యాసం గావించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేకతను సంతరింపజేసింది. “ప్రపంచ నలుమూలల్లో వివిధ దేశాలలో తెలుగువారి ప్రతిభకు పట్టం కట్టే విధంగా, అన్ని దేశాల తెలుగు కళాకారులు ఒక కార్యక్రమం ద్వారా అందరికీ పరిచయం అయ్యేవిధంగా, ఒక ప్రపంచ వేదికను ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం రూపొందించామని, అనూహ్యమైన స్పందన తో 35 దేశాల ప్రతినిధులు పాల్గొనడం మాకు ఎంతో ఆనందంగా అనిపించిందని” శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు, కార్యక్రమం ముఖ్యానిర్వాహుకులు కవుటూరు రత్న కుమార్ తెలిపారు. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు వంటి ప్రముఖ ఆధ్యాత్మిక మార్గదర్శకులు విచ్చేసి సదస్సులో వారందరికీ తమ ఆశీస్సులు అందించారు. రామ్ మాధవ్, మురళి మోహన్, మండలి బుద్ధ ప్రసాద్, వామరాజు సత్యమూర్తి వంటి రాజకీయ ప్రముఖులు, భువనచంద్ర, తనికెళ్ళ భరణి, సాయి కుమార్, హర్షవర్ధన్, వంటి సినీ దిగ్గజాలు, సురేఖ మూర్తి, పార్ధు నేమాని, విజయలక్ష్మి వంటి ప్రముఖ గాయనీ గాయకులు, శ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు, మాండోలిన్ రాజేష్, తాళ్లూరి నాగరాజు వంటి ప్రముఖ వాద్య కళాకారులు సభలో పాల్గొన్నారు. అమెరికా నుంచి ప్రముఖులు చిట్టెన్ రాజు, తోటకూర ప్రసాద్, జయశేఖర్ తాళ్లూరి, నిరంజన్, మధు ప్రఖ్యా , ఇండియా నుంచి ప్రముఖులు డా.వంశీ రామరాజు. డా. మీగడ రామలింగస్వామి, రుద్రాభట్ల రామ్ కుమార్ పాల్గొన్నారు. సుమారు 200 మందికిపైగా కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని శాస్త్రీయ సంగీతం, నృత్యాలు, జానపదాలు, సినీ గీతాలు, వయోలిన్ వీణ వేణువు పియానో మొదలగు వాద్య గానాలు, అష్టావధానం, కవితలు, కథలు, వ్యాసాలు, లఘు నాటికలు మొదలైన ఎన్నో అద్భుత ప్రదర్శనలతో అందరిని అలరించారు. పోలెండ్ దేశస్థుడైన బాల గాయకుడు బుజ్జి చక్కటి తెలుగు పాటలతో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ బృహత్కార్యక్రమానికి రాధిక మంగిపూడి ముఖ్య సమన్వయకర్తగా, ఊలపల్లి భాస్కర్ ప్రధాన సాంకేతిక నిర్వాహకునిగా, గణేశ్న రాధాకృష్ణ, కాత్యాయిని ప్రత్యక్ష ప్రసార నిర్వాహకులుగా, చామిరాజు రామాంజనేయులు, జయ పీసపాటి, సుబ్బు పాలకుర్తి, సునీత, సీతారామరాజు ప్రధాన వ్యాఖ్యాతలుగా, గుంటూరు వెంకటేష్, సురేష్ చివుకుల, మౌక్తిక తదితరులు సాంకేతిక నిర్వాహక బృందంగా వ్యవహరించారు. “శుభోదయం” సంస్థ, గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ సింగపూర్, ఈ రెమిట్, EGA జూస్ ప్రధాన స్పాన్సర్స్ గా, సాక్షి టీవీ, టీవీ5, సింగపూర్ తెలుగు టీవీ, ఈ క్షణం, మా గల్ఫ్, మొదలైన వారు మీడియా పార్ట్నర్స్ గా నిర్వహింపబడిన ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా రెండు రోజులపాటు యూట్యూబ్ మరియు ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడి, సుమారు 20 వేల మంది ప్రేక్షకులను ప్రపంచ వ్యాప్తంగా అలరించింది. అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం 2021లో పాల్గొంటున్న వివిధ దేశాల సంస్థలు.. సింగపూర్ నుంచి తెలుగు భాగవత ప్రచార సమితి, కాకతీయ కల్చరల్ సొసైటీ, మలేషియా తెలుగు సంఘం, హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య, ఇండోనేషియా తెలుగు అసోసియేషన్ , తెలుగు అసోసియేషన్ ఆఫ్ థాయిలాండ్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ బ్రూనై, ఆస్ట్రేలియా నుంచి తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా, తెలుగుమల్లి , తెలుగు అసోసియేషన్ ఆఫ్ సిడ్నీ, న్యూజిలాండ్ నుంచి తెలుగు అసోసియేషన్, సంగీత భారతి, భారతదేశం నుంచి వంశీ ఇంటర్నేషనల్ , రాష్ట్రేతర తెలుగు సమాఖ్య, నవసాహితి ఇంటర్నేషనల్ , జనరంజని ముంబై, విశ్వనాథ ఫౌండేషన్, సౌదీఅరేబియా నుంచి సౌదీ తెలుగు అసోసియేషన్, ఖతార్ నుంచి ఖతార్ తెలుగు సమితి, ఆంధ్ర కళా వేదిక , బహరే్ తెలుగు కళా సమితి , కువైట్ తెలుగు సంఘాల ఐక్యవేదిక , ఒమాన్ తెలుగు కళా సమితి పాల్గొన్నాయి. యుఏఈ నుంచి తెలుగు తరంగిణి, మారిషస్ తెలుగు సాంస్కృతిక నిలయం , దక్షిణాఫ్రికా నుంచి తెలుగు సాహిత్య వేదిక , సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ, ఆంధ్ర ప్రదేశ్ తెలుగు అసోసియేషన్ , తెలంగాణ అసోసియేషన్,, తెలుగు అసోసియేషన్ ఆఫ్ బోత్సువానా , నార్వే నుంచి వీధి అరుగు, నార్వే తెలుగు అసోసియేషన్, యునైటెడ్ కింగ్డమ్ నుంచి తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ , స్వీడన్ తెలుగు కమ్యూనిటీ, ఫిన్లాండ్ తెలుగు అసోసియేషన్ , ఫ్రాన్స్ తెలుగు సంఘం, జర్మనీ కలోన్ తెలుగు వేదిక , నెదర్లాండ్స్ తెలుగు కమ్యూనిటీ , ఐర్లాండ్ తెలుగు సంఘం, డెన్మార్క్ తెలుగు సంఘం, కెనడా నుంచి ఆంటోరియో తెలుగు అసోసియేషన్, అటావా తెలుగు అసోసియేషన్, తెలుగు తల్లి మాసపత్రిక,అమెరికా నుంచి తానా, వంగూరి ఫౌండేషన్ IBAM సంస్థలు ... పోలెండ్, స్విజర్లాండ్ , బెల్జియం, ఉగాండా, జపాన్ , శ్రీలంక దేశాలనుంచి ప్రతినిధులు , కళాకారులు ఈ రెండు రోజుల కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలిసారి ఒకే అంతర్జాల వేదికపై 35 దేశాల తెలుగు ప్రతినిధులు ఇలా కలుసుకుని సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రసంగాలతో వేడుకలు జరుపుకోవడం ఒక విశిష్ట రికార్డుగా పరిగణించి “తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్” అధ్యక్షులు చింతపట్ల వెంకటాచారి ఈ కార్యక్రమాన్ని నమోదు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. -
ఆ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయండి: ఉప రాష్ట్రపతి
సాక్షి, ఢిల్లీ: తెలుగు రాష్ట్రా ల్లో క్రీడల అభివృద్ధికి చేపట్టిన ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలని కేంద్ర క్రీడా మంత్రిని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదేశించారు. ప్రైవేటు రంగాన్ని కూడా క్రీడాభివృద్ధిలో భాగస్వాములు చేయాలని సూచించారు. మంగళవారం ఉప రాష్ట్రపతి ఆయన నివాసంలో క్రీడా మంత్రి కిరణ్ రిజిజు , ఆ శాఖ కార్యదర్శి రాధే శ్యాం జులానియాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల్లో క్రీడాభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలు, వివిధ క్రీడా ప్రాంగణాల నిర్మాణ దశల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మొగళ్లపాలెంలో మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, విజయనగరంలోని విజ్జీ స్టేడియంలో మల్టీపర్పస్ ఇండోర్ హాల్, విశాఖపట్టణంలోని కొమ్మడి మిని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని జిల్లా క్రీడాప్రాధికార కేంద్ర మైదానంలో ఆస్ట్రో టర్ఫ్ హాకీ ఫీల్డ్ ఏర్పాటుతోపాటు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో క్రీడావసతులు తదితర అంశాలపై ఉప రాష్ట్రపతి ఆరా తీశారు. గచ్చిబౌలి స్టేడియాన్ని సద్వినియోగపర్చుకోండి.. మంత్రి సమాధానమిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లో పలు ఇండోర్ స్టేడియంలతో పాటు, ఇతర ప్రాజెక్టుల కోసం నిధులు విడుదల చేశామని.. అయితే నిధుల వినియోగ వివరాలు (యూసీలు) రావడం ఆలస్యం కావడంతో తదుపరి పనుల్లో జాప్యం అవుతున్నాయని వెల్లడించారు. యూసీలను తెప్పించుకుని..వీలైనంత త్వరగా మిగిలిన పనులను పూర్తి చేయాలని ఉపరాష్ట్రపతి ఆదేశించారని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశం మధ్యలో ఏపీ క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌తో కూడా ఉప రాష్ట్రపతి చర్చించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో అత్యాధునిక వసతులున్నాయని.. అక్కడ జాతీయస్థాయి క్రీడలు నిర్వహించి సద్వినియోగపరుచుకోవాలని ఆయన సూచించారు. కేంద్రాన్ని అభినందించిన ఉప రాష్ట్రపతి దేశంలో క్రీడా రంగాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చర్యలను ఉప రాష్ట్రపతి అభినందించారు. మానవ వనరుల అభివృద్ధి, పెట్రోలియం సహా పలు శాఖలు.. దేశంలో క్రీడాభివృద్ధి కోసం క్రీడా మంత్రిత్వ శాఖకు తమవంతు సహకారం అందించేలా చర్చలు జరపాలని కూడా ఆయన సూచించారు. యూనివర్సిటీలు, కాలేజీలు కూడా క్రీడలను ప్రోత్సహించాలని..ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకోవాలని ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. -
చెన్నారెడ్డి సేవలు చిరస్మరణీయం
సాక్షి, హైదరాబాద్: ప్రజాహితం కోసం మర్రి చెన్నారెడ్డి చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రస్తుతించారు. హైటెక్ సిటీ శిల్ప కళావేదికలో ఆదివారం జరిగిన మర్రి చెన్నారెడ్డి శతజయంతి ఉత్సవాల్లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో మర్రి చేసిన పోరాటాన్ని ప్రతిఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. చెన్నారెడ్డి సూచించిన దారిలో నడవడమే ఆయనకు మనమిచ్చే నివాళి అని పేర్కొన్నారు. ‘శాసనసభ లో ఎన్ని విమర్శలు చేసినా హుందాగా స్వీకరించే వారు. మేం అడిగిన ప్రశ్నలకు శాంతంగా సమాధానాలు చెప్పేవారు. శాసన సభలో తాను, జైపాల్ రెడ్డి ఎన్నో సార్లు ప్రశ్నలు సంధించేవాళ్లం’ అని చెప్పారు. పదవులకే వన్నె తెచ్చారు.. ఆయన చేపట్టిన ప్రతి పదవికి వెన్నె తెచ్చారని వెంకయ్య నాయుడు కొనియాడారు. బాల్యం నుంచే నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి అని, రైతు కుటుంబం వచ్చి.. రైతులకు ఎంతో మేలు చేశారని తెలిపారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారని పేర్కొన్నారు. నీటి పారుదల రంగం కోసం విస్తృతంగా కృషి చేశారన్నారు. పరిపాలనలో ఉన్న లోటుపాట్లను సరి చేశారన్నారు. భూ సమస్యల పరిష్కారం కొసం కొత్త పద్దతిని అవలంబించారని పేర్కొన్నారు. ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు.. నిరుపేదలకు భూ పంపిణీ చేశారని పేర్కొన్నారు. యువత నక్సలిజం, తీవ్రవాదం వైపు మళ్లకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. ప్రజాస్వామ్యంలో మర్రి చెన్నారెడ్డి అవలంబించిన విధానాలను ఆచరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. వ్యక్తిగత దూషణలు ప్రమాదకరం.. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత దూషణలు ప్రమాదకరమని.. మన దగ్గర సబ్జెక్టు ఉంటే అరిచి గగ్గోలుపెట్టాల్సిన అవసరం ఉండదని వెంకయ్య నాయుడు అన్నారు. నిర్మాణాత్మకమైన చర్చలు జరిగినప్పుడే వ్యవస్థను మెరుగుపర్చవచ్చని పేర్కొన్నారు. కన్నతల్లిని, మాతృభూమిని మరిచిపోవద్దని ఆయన పిలుపునిచ్చారు. సాధించే వరకు నిద్రపోయే వారు కాదు.. భారత రాజకీయ చరిత్రలో చెన్నారెడ్డి రాజకీయ ప్రస్థానం చాలా గొప్పదని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఆయన అనుకున్నది సాధించే వరుకు నిద్రపోయేవారు కాదన్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించేవారని తెలిపారు. తెలంగాణ ఉద్యమం చేసిన తర్వాత కూడా ఆయన అన్ని ప్రాంతాల వారి హృదయాలను గెలుచుకున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి ఆయన జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చారన్నారు. ఎస్సారెస్పీతో తెలంగాణ రైతులకు ఎంతో మేలు చేశారన్నారు. ఆయన గొప్ప జాతీయవాది అని, రాజస్థాన్ గవర్నర్‌గా ఉండి కశ్మీర్ అంశంపై మాట్లాడిన వ్యక్తి అని దత్తాత్రేయ పేర్కొన్నారు. ఆయన ఓ మహానుభావుడు.. మర్రి చెన్నారెడ్డి ఎంతంటి గొప్పవారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని ఆయన ఓ మహానుభావుడని మాజీ గవర్నర్ కె.రోశయ్య పేర్కొన్నారు. ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు చేపట్టారని, వాటికి వన్నె తెచ్చారని తెలిపారు. అభివృద్ధిపైనే చర్చించే వారు.. మర్రి చెన్నారెడ్డిని ఎప్పుడు కలిసినా అభివృద్ధి గురించే చర్చించేవారని సీనియర్ జర్నలిస్ట్ పొత్తూరి వెంకటేశ్వరరావు అన్నారు. రాష్ట్రాభివృద్ధిపై ఆయనకు స్పష్టమైన అవగాహన ఉండేదన్నారు. ఆయన పోరాటం ఎంతో గొప్పది.. పేదల అభివృద్ధికి మర్రి చెన్నారెడ్డి ఎంతో కృషి చేశారని కాంగ్రెస్ నేత ఆర్సీ కుంతియా అన్నారు. ఇందిరాగాంధీతో రాజకీయంగా ఆయనకు ఎంతో సాన్నిహిత్యం ఉండేదని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ హయాంలో దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. తెలంగాణ సాధించడం కోసం చెన్నారెడ్డి చేసిన పోరాటం ఎంతో గొప్పదన్నారు. ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా ఏ బాధ్యత చేపట్టిన దానికి వెన్నె తెచ్చారన్నారు. -
'ఢిల్లీ వాసులకు జీవిత కాల మహాభాగ్యం'
ఈనెల 30 నుంచి నవంబర్ 8 వరకూ ఢిల్లీ లోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల పోస్టర్ ను సోమవారం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటేశ్వరస్వామి వైభవోత్సవం... ఢిల్లీ వాసులకు జీవిత కాల మహాభాగ్యం అని అన్నారు. తిరుపతి తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు శ్రీవారికి సుప్రభాతం, నిత్య సేవలు ఉంటాయని జేఈవో కోలా భాస్కర్ తెలిపారు. -
ఒక్క ఎస్ఎంఎస్ కూడా రాలేదట!
కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి ఇంత వరకు తనకు ఒక్క ఎస్సెమ్మెస్ కూడా రాలేదంటున్నారు కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కమిటీ (పీసీసీ) ఇటీవలే కోటి ఎస్సెమ్మెస్ సందేశాల ఉద్యమాన్ని ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా రాష్ట్రానికి చెందిన, రాష్ట్రంతో సంబంధం ఉన్న కేంద్ర మంత్రులు ఎం. వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజు, నిర్మలా సీతారామన్, సుజనా చౌదరిల ఫోను నెంబర్లను ప్రకటించి.. ఆయా నెంబర్లకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం పోరాడాలని కోరుతూ ఈ నెల 23వ తేదీ నుంచి 30 వ తేదీల మధ్య కోటి ఎస్సెమ్మెస్ సందేశాలను పంపాలని పీసీసీ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చింది.ఎనిమిది రోజుల పాటు సాగే ఈ ఉద్యమం మరో రెండు రోజులలో ముగియనుంది. అయితే, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఎస్సెమ్మెల ఉద్యమానికి సంబంధించి ఇప్పటి వరకు తన ఫోన్లో ఒక్క సందేశం కూడా రాలేదని వెంకయ్యనాయుడు సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఈ వ్యవహారంపై మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నేతలు ఏవేవో నెంబర్లు ఇచ్చారట. నాకైతే ఒక్క ఎస్సెమ్మెస్ రాలేదు. ఎవరెవరికో ఇలాంటి ఎస్సెమ్మెస్‌లు వెళ్లుతుండొచ్చు అని వ్యాఖ్యానించారు.