Venu Srinivasan
-
ప్రతిష్టాత్మక అవార్డులు సొంతం చేసుకున్న వ్యాపారవేత్తలు.. వీరే!
ఇటీవల జరిగిన ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (AIMA) 13వ మేనేజింగ్ ఇండియా అవార్డ్స్ వేడుకలో కుమార్ మంగళం బిర్లా ప్రతిష్టాత్మక 'బిజినెస్ లీడర్ ఆఫ్ ది డికేడ్' అవార్డుని సొంతం చేసుకున్నారు. వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకున్న ఈయన 2017లోనే అవుట్‌స్టాండింగ్ బిజినెస్ లీడర్ అవార్డుని కైవసం చేసుకున్నాడు. సుమారు 34 దేశాల్లో వ్యాపారణాలను విజయవంతంగా ముందుకు సాగిస్తున్నారు మంగళం బిర్లా గత దశాబ్దంలో భారతీయ పరిశ్రమకు చేసిన సేవలకుగాను ఈ అవార్డు లభించింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రంలో ఇతర కంపెనీల నాయకులు కూడా ఆవార్డులను గెలుచుకున్నారు. ఇందులో టాటా స్టీల్ చైర్మన్ టీవీ నరేంద్రన్‌కు 'AIMA-JRD టాటా కార్పొరేట్ లీడర్షిప్' అవార్డు, ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును టొరెంటో గ్రూప్ చైర్మన్ సమీర్ మెహతా సొంతం చేసుకున్నారు. యంగ్ ఎంటర్ ఎంటర్ప్రెన్యూర్ ఏథర్ ఎనర్జీ వ్యవస్థాపకులు తరుణ్ మెహతా, స్వప్నిక్ జైన్ కైవసం చేసుకున్నారు. అదే సమయంలో టీవీఎస్ కంపెనీ చైర్మన్ వేణు శ్రీనివాసన్ అవుట్‌స్టాండింగ్ ఇన్స్టిట్యూట్ బిల్డర్ అవార్డు, బజాజ్ ఫిన్ సర్వ్ చైర్మన్ సంజయ్ బజాజ్ ట్రాన్స్ఫార్మషన్ బిజినెస్ లీడర్ అవార్డు సొంతం చేసుకున్నారు. -
ఆధార్ ప్రింట్ చేసినట్టు కాదు..!
న్యూఢిల్లీ: త్రిచక్ర వాహనాలను 2023 నుంచి, ద్విచక్ర వాహనాలను 2025 నుంచి పూర్తిగా ఎలక్ట్రిక్ రూపంలోనే అనుమతించాలన్న నీతి ఆయోగ్ ప్రతిపాదనపై అగ్రశ్రేణి ఆటో కంపెనీలు అభ్యంతరాలు వ్యక్తంచేశాయి. ఇదేమీ ఆధార్ కార్డును ప్రింట్ చేసింత ఈజీ కాదని టీవీఎస్, బజాజ్ ఆటో వ్యాఖ్యానించాయి. ఈ ప్రతిపాదనల వెనక తగినంత అధ్యయనం, సంప్రదింపులు లేవని పేర్కొన్నాయి. ‘‘ఇది ఆధార్ కార్డు కాదు. సాఫ్ట్వేర్, ప్రింట్ కార్డులు కాదు. మొత్తం సరఫరా చెయిన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ప్రస్తుత వ్యవస్థ నుంచి దానికి మళ్లాల్సి ఉంటుంది’’ అని టీవీఎస్ మోటార్ కంపెనీ చైర్మన్, ఎండీ వేణు శ్రీనివాసన్ పేర్కొన్నారు. తమ ప్రతిపాదనలపై రెండు వారాల్లో ఆటో మొబైల్ పరిశ్రమ స్పందించాలని నీతి ఆయోగ్ కోరిన నేపథ్యంలో వేణు శ్రీనివాసన్ ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. నాలుగు నెలల సమయం కోరాం... ‘‘ఓ ప్రణాళికతో ముందుకు రావడానికి మాకు నాలుగు నెలల సమయం పడుతుందని తెలియజేశాం. ప్రణాళిక ఓ నగరంతో (అత్యధిక ద్విచక్ర వాహనాలు కలిగిన నగరం) మొదలవుతుంది. ఆ తర్వాత బదిలీ అన్నది కొంత కాలానికి జరుగుతుంది’’ అని వేణు శ్రీనివాసన్ తెలిపారు. 2 కోట్ల వాహనాలు, 15 బిలియన్ డాలర్ల అమ్మకాలు, 10 లక్షల మంది ఉపాధితో కూడిన ఈ రంగంలో ఒకేసారి పూర్తిగా మార్పు అన్నది సాధ్యం కాదని చెప్పారాయన. థర్మల్ (బొగ్గు ఆధారిత) విద్యుత్‌తో నడిచే బ్యాటరీలకు మళ్లడం కాలుష్యాన్ని తగ్గించదని స్పష్టంచేశారు. కాలుష్యంలో వాహనాల పాత్ర 20 శాతం అయితే, ఇందులో ద్విచక్ర వాహనాల నుంచి వెలువడే కాలుష్యం 20 శాతమేనని, అంటే కేవలం 4 శాతం కాలుష్యం గురించి ఇదంతా చేస్తున్నట్టుగా ఉందని అభిప్రాయపడ్డారు. దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులను ఆకర్షించిందని, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. కాగా పూర్తిగా 100 శాతం ఎలక్ట్రిక్ వాహనాలకు మళ్లడం అన్నది అవసరం లేదని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ చెప్పారు. కార్లు తదితర వాహనాలను వదిలేసి, కేవలం ద్వి, త్రిచక్ర వాహనాలనే లక్ష్యం చేసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం: హీరో మోటోకార్ప్ 150సీసీ సామర్థ్యం వరకు, ఇంటర్నల్ కంబస్టన్ ఇంజిన్లతో కూడిన ద్విచక్ర వాహనాలను పూర్తిగా నిషేధించాలన్న నీతి ఆయోగ్ విధానంతో తలెత్తబోయే పరిణామాలపై తాము తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్టు అగ్రగామి టూవీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్ ప్రకటించింది. ఈ విధానంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. 150సీసీ సామర్థ్యంలోపు ముఖ్యంగా 100సీసీ, 110సీసీ, 125సీసీ విభాగంలో విక్రయమయ్యే అత్యధిక వాహనాలు ఈ కంపెనీవే. భాగస్వాములు అందరి ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని కంపెనీ సూచించింది. ఎలక్ట్రిక్ వాహనాల అమలును బలవంతంగా రుద్దడానికి బదులు, మార్కెట్ పరిస్థితులు, కస్టమర్ల వైపు నుంచి ఆమోదం వంటి అంశాలతో ఎలక్ట్రిక్ వాహనాలకు మళ్లడం అనేది ఆధారపడి ఉండాలని సూచించింది. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ, దేశ జీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ రంగంపై ప్రతిపాదిత నిషేధం తీవ్ర ప్రభావం చూపుతుందని హీరో మోటోకార్ప్ ఆందోళన వ్యక్తం చేసింది. -
టీవీఎస్ బాస్‌పై సంచలన ఆరోపణలు
సాక్షి, చెన్నై: తమిళనాట పవిత్ర విగ్రహాల మాయం, చోరీ కేసులో కీలక పరిణామం చేసుకుంది. రెండు ప్రధాన ఆలయాల్లో విగ్రహాల మాయంపై హైకోర్టు విచారణకు ఆదేశించిన నేపథ్యంలో టీవీఎస్ చైర్మన్, ఎండీ వేణు శ్రీనివాసన్ ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై కేసు నమోదు, అరెస్ట్‌కు అవకాశం ఉందన్న అంచనాలతో కోర్టులో పిటిషన్ వేశారు. విగ్రహాల చోరీ కేసులకు సంబంధించిన పిటిషన్‌ను జస్టిస్ ఆర్ మహదేవన్, జస్టిస్ పీడీ అదికేశవులతో కూడిన స్పెషల్ డివిజన్ బెంచ్ శుక్రవారం విచారించింది. ఆరు వారాలపాటు ఆయనను అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది. అనంతరం, శ్రీనివాసన్ ముందుస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఆరు వారాలకు వాయిదా వేశారు. ప్రస్తుతానికి శ్రీనివాసన్‌కు ఊరట లభించింది. మరోవైపు కేవలం కాపాలీశ్వర్ భక్తుడిగా తాను ఆలయ వృద్ది కోసం వ్యక్తిగత నిధులను భారీగా వెచ్చించానని పిటిషన్లో శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఆలయ పెయింటింగ్, ఇతర పునర్నిర్మాణ ఖర్చుల కోసం 70 లక్షల రూపాయలను వెచ్చించినట్టు కోర్టుకు తెలిపారు. అంతకుమించి తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అలాగే శ్రీరంగం ఆలయ పునర్నిర్మాణం కోసం ఆలయ ఛైర్మన్‌గా వ్యక్తిగతంగా 25 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్టు వెల్లడించారు. అలాగే తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో 100 ఆలయాలను పునర్నిర్మాణం పూర్తిచేసినట్టు శ్రీనివాసన్ పేర్కొన్నారు. జూలై 28న మద్రాసు హైకోర్టు సమర్పించిన అఫిడవిట్లో వేణు శ్రీనివాసన్ పేరును ఎలిఫెంట్ రాజేంద్రన్ ప్రస్తావించారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. అందుకే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసినట్టు చెప్పారు. తిరుచ్చికి చెందిన రంగజరాన్ నరసింహన్, చెన్నైకి చెందిన ఎలిఫెంట్ రాజేంద్రన్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. శ్రీరంగం ఆలయం నుంచి పవిత్రమైన అనేక పురాతన కళాఖండాలు చోరీకి గురయ్యాయనీ, ఆలయంలోని ప్రధాన పెరుమాళ్(విష్ణుమూర్తి) విగ్రహం దెబ్బతిందని ఫిర్యాదుదారులు ఆరోపించారు. అలాగే కపాలీశ్వర్ ఆలయంలో శివుడిని పూజించే నెమలి(పార్వతిదేవి ప్రతిరూపంగా భావించే) ప్రతిమను మార్చివేశారని ఆరోపించారు. 2004లో ఆయన పునరుద్ధరణ కార్యక్రమంలో వీటిని రాత్రికి రాత్రే తారుమారు చేశారనేది పిటిషన్ దారుల ప్రధాన ఆరోపణ. కాగా 2004లో తమిళనాడులోని దేవాలయాలలో కుంభాభిషేకం నిర్వహణకు నియమించిన ప్రభుత్వ కమిటీ(ఆలయ పునరుద్ధరణ కమిటీ)లో వేణు శ్రీనివాసన్ సభ్యుడిగా ఉన్నారు. అలాగే శ్రీరంగం ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్‌గా కూడా ఆయన ఉన్నారు. ఇక్కడ కుంభాభిషేకం నిర్వహణలో కూడా ఈయన భాగం. తమిళనాడులోని ప్రసిద్ధ ఆలయాలు, చెన్నైశివారు ప్రాంతంలో మైలాపూర్‌లోని కపాలీశ్వర, శ్రీరంగం ఆలయాల విగ్రహాలు, ఇతర పురాతన వస్తులు మాయం కేసులో విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశించిన మరోసటి రోజే శ్రీనివాసన్ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. మరోవైపు టీవీఎస్ ట్రస్ట్ పేరుతో దేశవ్యాప్తంగా ముఖ్యంగా తమిళనాడులోని అనేక పురాతన ఆలయాల పునరుద్ధరణ, అభివృద్ధికి సహాయ సహకారాలందించే శ్రీనివాసన్‌పై తాజా ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.