
టీవీఎస్ ఛైర్మన్, ఎండీ వేణు శ్రీనివాసన్ (ఫైల్ ఫోటో)
సాక్షి, చెన్నై: తమిళనాట పవిత్ర విగ్రహాల మాయం, చోరీ కేసులో కీలక పరిణామం చేసుకుంది. రెండు ప్రధాన ఆలయాల్లో విగ్రహాల మాయంపై హైకోర్టు విచారణకు ఆదేశించిన నేపథ్యంలో టీవీఎస్ చైర్మన్, ఎండీ వేణు శ్రీనివాసన్ ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై కేసు నమోదు, అరెస్ట్‌కు అవకాశం ఉందన్న అంచనాలతో కోర్టులో పిటిషన్ వేశారు. విగ్రహాల చోరీ కేసులకు సంబంధించిన పిటిషన్‌ను జస్టిస్ ఆర్ మహదేవన్, జస్టిస్ పీడీ అదికేశవులతో కూడిన స్పెషల్ డివిజన్ బెంచ్ శుక్రవారం విచారించింది. ఆరు వారాలపాటు ఆయనను అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది. అనంతరం, శ్రీనివాసన్ ముందుస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఆరు వారాలకు వాయిదా వేశారు. ప్రస్తుతానికి శ్రీనివాసన్‌కు ఊరట లభించింది.
మరోవైపు కేవలం కాపాలీశ్వర్ భక్తుడిగా తాను ఆలయ వృద్ది కోసం వ్యక్తిగత నిధులను భారీగా వెచ్చించానని పిటిషన్‌లో శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఆలయ పెయింటింగ్, ఇతర పునర్నిర్మాణ ఖర్చుల కోసం 70 లక్షల రూపాయలను వెచ్చించినట్టు కోర్టుకు తెలిపారు. అంతకుమించి తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అలాగే శ్రీరంగం ఆలయ పునర్నిర్మాణం కోసం ఆలయ ఛైర్మన్‌గా వ్యక్తిగతంగా 25 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్టు వెల్లడించారు. అలాగే తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో 100 ఆలయాలను పునర్నిర్మాణం పూర్తిచేసినట్టు శ్రీనివాసన్ పేర్కొన్నారు. జూలై 28న మద్రాసు హైకోర్టు సమర్పించిన అఫిడవిట్‌లో వేణు శ్రీనివాసన్ పేరును ఎలిఫెంట్ రాజేంద్రన్ ప్రస్తావించారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. అందుకే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసినట్టు చెప్పారు.
తిరుచ్చికి చెందిన రంగజరాన్ నరసింహన్, చెన్నైకి చెందిన ఎలిఫెంట్ రాజేంద్రన్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. శ్రీరంగం ఆలయం నుంచి పవిత్రమైన అనేక పురాతన కళాఖండాలు చోరీకి గురయ్యాయనీ, ఆలయంలోని ప్రధాన పెరుమాళ్(విష్ణుమూర్తి) విగ్రహం దెబ్బతిందని ఫిర్యాదుదారులు ఆరోపించారు. అలాగే కపాలీశ్వర్ ఆలయంలో శివుడిని పూజించే నెమలి(పార్వతిదేవి ప్రతిరూపంగా భావించే) ప్రతిమను మార్చివేశారని ఆరోపించారు. 2004లో ఆయన పునరుద్ధరణ కార్యక్రమంలో వీటిని రాత్రికి రాత్రే తారుమారు చేశారనేది పిటిషన్ దారుల ప్రధాన ఆరోపణ.
కాగా 2004లో తమిళనాడులోని దేవాలయాలలో కుంభాభిషేకం నిర్వహణకు నియమించిన ప్రభుత్వ కమిటీ(ఆలయ పునరుద్ధరణ కమిటీ)లో వేణు శ్రీనివాసన్ సభ్యుడిగా ఉన్నారు. అలాగే శ్రీరంగం ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్‌గా కూడా ఆయన ఉన్నారు. ఇక్కడ కుంభాభిషేకం నిర్వహణలో కూడా ఈయన భాగం. తమిళనాడులోని ప్రసిద్ధ ఆలయాలు, చెన్నైశివారు ప్రాంతంలో మైలాపూర్‌లోని కపాలీశ్వర, శ్రీరంగం ఆలయాల విగ్రహాలు, ఇతర పురాతన వస్తులు మాయం కేసులో విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశించిన మరోసటి రోజే శ్రీనివాసన్ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. మరోవైపు టీవీఎస్ ట్రస్ట్ పేరుతో దేశవ్యాప‍్తంగా ముఖ్యంగా తమిళనాడులోని అనేక పురాతన ఆలయాల పునరుద్ధరణ, అభివృద్ధికి సహాయ సహకారాలందించే శ్రీనివాసన్‌పై తాజా ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment