Vettrimaran
-
కొత్త దర్శకుడితో విక్రమ్‌ప్రభు
నటుడు విక్రమ్‌ప్రభుకు ప్రస్తుతం ఒక సక్సెస్ కావాలి. ఈ యువ హీరో 60 వయదు మాణియం, తుపాకీ మునై వంటి చిత్రాలతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నా.. సక్సెస్ పరంగా ఆ చిత్రాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. దీంతో విక్రమ్ ప్రభు రేస్‌లో కాస్త వెనుక పడ్డారనే చెప్పాలి. నటుడిగా ఈయన బిజీగానే ఉన్నారు. ప్రస్తుతం అసురగురు, వాల్టర్ చిత్రాలలో నటిస్తున్నారు. తాజాగా మరో చిత్రానికి కమిట్ అయ్యారు. దీన్ని మాయ, మానగరం వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రొటాంషియల్ సంస్థ నిర్మించనుంది. ఈ చిత్రం ద్వారా దర్శకుడు వెట్ట్రిమారన్ శిష్యుడు తమిళరసన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా కథానాయకీ, ఇతర నటినటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందనీ, త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఇటీవల చెన్నైలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని వెల్లడించారు. ఈ చిత్ర షూటింగ్‌ను మార్చి రెండవ వారంలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలతో విక్రమ్‌ప్రభు మళ్లీ సక్సెస్ బాట పడతారని ఆశిద్దాం. -
ధనుష్ దర్శకుడితో సూపర్‌స్టార్?
తమిళసినిమా: సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చిత్రం చేయాలని ప్రతి దర్శకుడు ఆశ పడతారు. అలాంటి అవకాశం కోసం తపస్సు చేస్తారని అనవచ్చు. సినీయర్ దర్శకులతోనే చిత్రాలు చేసే రజనీకాంత్ ఇటీవల యువ దర్శకుడు పా.రంజిత్‌కు వరుసగా రెండు సార్లు అవకాశం ఇవ్వడం విశేషమే అవుతుంది. కాగా తాజాగా మరో కొత్త ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధనుష్ దర్శకుడిగా ముద్రపడిన వెట్రిమారన్‌కు రజనీకాంత్‌తో చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారన్నదే ఆ ప్రచారం. నటుడు ధనుష్‌తో ఆడగళం, పొల్లాదవన్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వెట్రిమారన్. ఆయనతో కలిసి కాక్కాముట్టై, విచారణై వంటి జాతీయ అవార్డులు పొందిన చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం ధనుష్ హీరోగా వడచెన్నై చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దర్శకుడు వెట్రిమారన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ కోసం ఒక కథను సిద్ధం చేశారట. ఇటీవల రజనీని కలిసి కథ వినిపించారు. కథ ఆయనకు బాగా నచ్చేసిందట. అయితే అందులో నటించే విషయమై రజనీకాంత్ ఇంకా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం. ప్రస్తుతం రజనీకాంత్ శంకర్ దర్శకత్వంలో 2.ఓ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. అదే సమయంలో కబాలి చిత్రం ఫేమ్ పా.రంజిత్ దర్శకత్వంలో ధనుష్ నిర్మిస్తున్న కాలా చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు. వీటిలో 2.ఓ చిత్రం 2018 జనవరిలో తెరపైకి రానుంది. ఆ తరువాత కాలా ఉం టుంది. తరువాత చిత్రానికే వెట్రిమారన్ క్యూలో ఉన్నట్లు కోలీవుడ్ టాక్.