ప్రాణాలు లెక్కచేయని అక్కాచెల్లెళ్లు
ఇరాక్: రాక్షసత్వానికి కూడా అర్థం మార్చిన ఐఎస్ఐఎస్ టెర్రరిస్టుల కబంధ హస్తాల నుంచి తప్పించుకున్న యాజిదీ అమ్మాయిల ముందు ఆమె ఎన్నడూ ఏడ్వదల్చుకోలేదు. కేవలం ఒక్క సిగరెట్ కోసం టెర్రరిస్టుల ఒకరి నుంచి ఒకరు తమను కొనుక్కున్నారనే దారుణ సన్నివేశాల గురించి బాధితుల నుంచి విన్నప్పుడూ ఆమె ఎప్పుడూ ఏడ్వలేదు.
ఆరుగురు పైశాచికానందానికి బలైన బాలిక కన్నీటి గాథను విన్నప్పుడూ ఆమె ఏడ్వలేదు. తొమ్మిదేళ్ల బాలిక రేప్‌కు గురై రక్తస్రావంతో చనిపోయిన సంఘటన గురించి విన్నప్పుడూ కూడా ఆమె ఏడ్వలేదు. ఆమెకు జాలి లేదని కాదు, కళ్లలో కన్నీళ్లు లేవని కాదు. బాధితులు కుమిలిపోకూడదని, వారి మానసిక స్థైర్యం దెబ్బతినకూడదని ఉద్దేశంతోనే ఆమె తన మనసును నిబ్బరం చేసుకొంది. ఆమె యాజిదీ బాధితులకు సేవలందిస్తున్న 25 ఏళ్ల డాక్టర్ డీలన్ డాకిల్.
టెర్రరిస్టుల చేతుల్లో నరకం అనుభవించిన బాధితుల ముందు డాక్టర్ డీలన్ ఏడ్వకపోయినా ఒంటిరిగా ఉన్నప్పుడు వెక్కివెక్కి ఏడుస్తోంది. బాధితుల అనుభవాలను బహిరంగంగా ప్రజా వేదిక ముందు వెల్లడించినప్పుడూ విలపిస్తోంది. బాధితులను ఆదుకునేందుకు తనతోపాటు కలసిరావాల్సిందిగా ప్రపంచానికి గద్గద స్వరంతో పిలుపునిచ్చినప్పుడు ఆమె ఏడుస్తోంది. టైస్టుల చెర నుంచి తప్పించుకున్న యాజిదీ మహిళల శిబిరంలో ఆమె డాక్టర్‌గా పనిచేస్తోంది. తన జీవితం బాధితుల సేవకు, వారికి అండగా పోరాడేందుకే అంకితమని చెబుతోంది. దుర్నీతి, దుష్ట శక్తులకు వ్యతిరేకంగా పోరాడేతత్వం ఆమె రక్తంలోనే ఉందేమో! ఆమె అక్క వియాన్ డాకిల్ ఇరాక్ పార్లమెంట్ సభ్యురాలు. ఇద్దరు యాజిదీ ఎంపీల్లో ఆమె ఒకరు. ఐఎస్ఎస్ టైస్టులను సమూలంగా నాశనం చేయాలంటూ ఇరాక్ పార్లమెంట్ వేదికగా ప్రపంచానికి రణన్నినాదం మొట్టమొదటి సారితా ఇచ్చిందీ వియాన్ డాకిలే. ఇప్పుడు వీరిద్దరూ ఐఎస్ఐఎస్ ‘మోస్ట్టార్గెట్’ జాబితాలో ముందు పేర్లలో ఉన్నారు.
టెర్రరిస్టుల నుంచి వియాన్కున్న ప్రాణాపాయం గురించి మీడియా ఆమెను ప్రశ్నించినప్పుడు వేలాది మంది యాజిదీ మహిళలను నిర్దాక్షిణ్యంగా హింసించి చంపుతుంటే వారితో పోలిస్తే తన ప్రాణం ఏపాటిదని చెబుతారు. మానవ హక్కులకు సంబంధించి ఇటీవల లండన్‌లో జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సులో కూడా వియాన్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఐఎస్ఐఎస్ ముష్కరుల నుంచి పారిపోయిన మహిళల కన్నీటి గాధల ముందు తన ప్రాణానికి లెక్కలేదన్నారు. టైస్టుల చెరలో ముక్కుపచ్చలారని బాలికలు ఎదుర్కొంటున్న దారుణాల ముందు తన ప్రాణాలు పోతే ఎంతా? అని ఆమె ప్రశ్నించారు. పదాలు వేరైనా అదే భావాన్ని వ్యక్తం చేస్తున్నారు డాక్టర్ డీలన్ డాకిల్.