Vidyadharapuram
-
వరదలో మునిగిన RTC డిపో 1 పూర్తిగా పాడైపోయిన 70 బస్సులు
-
ఉద్యోగులే నిర్మించుకున్న వైద్యాలయం
భవానీపురం (విజయవాడ పశ్చిమ): ఉద్యోగుల ఆరోగ్యానికి కూడా పెద్దపీట వేస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ). రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్‌లోని తార్నాక ఆర్టీసీ హాస్పిటల్లో లక్ష మందికిపైగా ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వైద్యసేవలు అందేవి. విభజన అనంతరం 2016లో విజయవాడ ప్రధాన కేంద్రంగా ఏపీఎస్ ఆర్టీసీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ బస్ స్టేషన్‌లోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లో పరిపాలనా కార్యకలాపాలను ప్రారంభించింది. అప్పట్లో రాష్ట్రంలోని ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ఉద్యోగులు వ్యయప్రయాసలకోర్చి తార్నాక హాస్పిటల్ వెళ్లి వైద్య సేవలు పొందాల్సి వచ్చేది. దీంతో రెండు మూడు రోజుల సమయం వృథా అయ్యేది. ఈ కారణంగా సిబ్బంది తిరిగి విధులకు హాజరు కావడానికి కొంత సమయం పట్టేది. తద్వారా ప్రయాణికుల సేవలకు బస్సులను సకాలంలో నడపటంలో సమస్యలు తలెత్తేవి. 18 డిస్పెన్సరీలు విద్యాధరపురంలోని సెంట్రల్ హాస్పిటల్‌కు అనుబంధంగా రాష్ట్రవ్యాప్తంగా 18 డిస్పెన్సరీలను కూడా ఏర్పాటు చేశారు. కాగా, ఇటీవల కడపలో 20 పడకల ఏరియా ఆస్పత్రిని నిర్మించి అక్కడ కూడా వైద్య సేవలు అందిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న విశ్రాంత ఉద్యోగులు విజయవాడ వరకు రావాల్సిన పని లేకుండా గత ఏడాది డిసెంబర్ 18న హైదరాబాద్ తార్నాక రోడ్డు నంబర్–1లో 19వ వైద్యశాలను నెలకొల్పారు. వార్డులు.. అత్యవసర విభాగాలెన్నో.. ఈ ఆస్పత్రిలో అత్యవసర పేషెంట్ల కోసం ఐసీయూ, క్యాజువాలిటీ, పోస్ట్ ఆపరేటివ్ వార్డులు ఏర్పాటు చేశారు. జనరల్ మెడిసిన్, సర్జరీ, ఆర్థోపెడిక్, గైనిక్, డెర్మటాలజీ, ఆప్తమాలజీ, చెవి, ముక్కు, గొంతు, పీడియాట్రిక్స్, రేడియాలజీ, పాథాలజీ, డెంటల్, అనస్థీషియా విభాగాలు అందుబాటులో ఉన్నాయి. ఇవికాకుండా కార్డియాలజీ, ఆంకాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ సూపర్ స్పెషాలిటీ విభాగాల కన్సల్టెంట్ వైద్యులు నెలలో రెండుసార్లు ఇక్కడకు వచ్చి సేవలు అందించే ఏర్పాటు చేశారు. డిజిటల్ ఎక్సరే, ఈసీజీ, స్కానింగ్, లాప్రోస్కోపీ, ఫ్యాకో (కేటరాక్ట్ ఆపరేషన్ కోసం) కలర్ డాప్లర్, ఆటో అనలైజర్, సీ–ఆర్మ్ వంటివే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్యానికి పనికొచ్చేలా 20 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కూడా అందుబాటులో ఉంచారు. అత్యాధునిక ఫిజయోథెరఫీ విభాగాన్ని సైతం ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్‌కు మెరుగైన వైద్యం కోసం రిఫరల్ హాస్పిటల్స్‌కు తరలించేందుకు అన్ని సౌకర్యాలతో కూడిన అంబులెన్స్‌ను కూడా సమకూర్చారు. వైద్యపరంగా ఏ విధమైన సమాచారం కావాలన్నా 24 గంటలపాటు పనిచేసే హెల్ప్‌లైన్ నంబర్లను (9494248897, 0866– 2415206) అందుబాటులోకి తెచ్చారు. వైద్య పరీక్షలకు అవసరమైన వైద్య పరికరాలు, యంత్ర సామగ్రిని కూడా ఈ ఆస్పత్రి సొంతంగా సమకూర్చుకుంది. తార్నాక హాస్పిటల్‌కు దీటుగా.. ఉద్యోగుల ఇబ్బందులను అధిగమించే క్రమంలో తార్నాక హాస్పిటల్‌కు దీటుగా విజయవాడలోని విద్యాధరపురంలో ఉద్యోగుల భాగస్వామ్యంతో 2.50 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.15 కోట్ల వ్యయంతో అత్యాధునిక వసతులతో కార్పొరేట్ ఆస్పత్రి తరహాలో ఆర్టీసీ సెంట్రల్ హాస్పిటల్ నిర్మించింది. ఇందులో 2017 జూలై నెల 4వ తేదీ నుంచి వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. 50 పడకల సామర్థ్యంతో నిర్మించిన ఈ ఆస్పత్రి సుమారు 52 వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పెన్షనర్లు కలిపి మొత్తం సుమారు 2.25 లక్షల మంది వైద్య అవసరాలను తీరుస్తోంది. ఈ ఆస్పత్రి నిర్మాణానికి ప్రతి ఉద్యోగి తమ జీతం నుంచి నెలకు రూ.100 చొప్పున రెండేళ్ల పాటు స్వచ్ఛందంగా విరాళంగా అందజేయటం విశేషం. ఇలా సుమారు రూ.13 కోట్లను సంస్థ సిబ్బంది సమకూర్చుకోగా.. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం వెచ్చించింది. భవనాల నిర్మాణానికయ్యే ఖర్చులో ఎక్కువ మొత్తం సిబ్బంది నుంచే అందగా.. మిగిలిన మొత్తంతోపాటు ఆస్పత్రిలో సౌకర్యాల కల్పన, పరికరాలు, ల్యాబొరేటరీల ఏర్పాటుకయ్యే నిధులను ప్రభుత్వమే సమకూర్చింది. ఈ విధంగా సకల సదుపాయాలు, సంపూర్ణ సౌకర్యాలతో ఉద్యోగులే కట్టుకున్న వైద్యాలయంగా ఆర్టీసీ సెంట్రల్ హాస్పిటల్ విరాజిల్లుతోంది. వైద్య సేవలకు ప్రాధాన్యత ఆర్టీసీ హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సేవలు అందుతున్నాయి. సిబ్బంది ఆరోగ్యాన్ని సంరక్షించడమే లక్ష్యంగా ఆర్టీసీ ముందుకెళుతోంది. సంస్థ ప్రభుత్వంలో విలీనమైన తరువాత ఉద్యోగులకు ఈహెచ్ఎస్ కార్డులు మంజూరైనా సంస్థాపరమైన వైద్య సేవలను ఎప్పటిలానే అందిస్తున్నాం. ఇతర ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులకు అందుబాటులో లేని ఉచిత కన్సల్టేషన్, మందులు అందించే సౌకర్యాన్ని ఆర్టీసీ సంస్థ మాత్రమే తన ఉద్యోగులకు కల్పించింది. – సీహెచ్ ద్వారకాతిరుమలరావు, ఎండీ, ఏపీఎస్ ఆర్టీసీ 4 లక్షల పరిమితి వరకు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణలో భాగంగా అనేక చర్యలు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు అవసరమైన ఆధునిక మెషినరీ, పరికరాలు సమకూర్చుకుంటున్నాం. రోజుకు దాదాపు 200 మంది సిబ్బంది ఈ విద్యాధరపురం హాస్పిటల్‌కు వస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని హాస్పిటల్స్‌లలో రోజుకు 1700 నుంచి 2 వేల మంది వైద్య సేవలు పొందుతున్నారు. రిటైరైన ఉద్యోగి, అతని జీవిత భాగస్వామికి కలిపి రూ.4 లక్షల పరిమితి వరకు వైద్య సేవలు అందిస్తున్నాం. – డీవీఎస్ అప్పారావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్, సెంట్రల్ హాస్పిటల్ -
గోడ కూలి పారిశుద్ధ్య కార్మికురాలి మృతి
విజయవాడ(భవానీపురం) : పురాతనమైన ఇంటి ఎలివేషన్ గోడ కూలి విధి నిర్వహణలో ఉన్న పారిశుద్ధ్య కార్మికురాలు మృతి చెందింది. విద్యాధరపురం యద్దనపూడివారి వీధిలో గురువారం ఈ ఘటన జరిగింది. స్థానిక 29వ డివిజన్ పరిధిలోని రోటరీనగర్‌లో నివసించే నలిమింటి వరలక్ష్మి(45) గత 17 ఏళ్లుగా నగరపాలక సంస్థ శానిటేషన్ విభాగంలో కాంట్రాక్ట్ కార్మికురాలిగా పనిచేస్తున్నారు. ఆమె యథావిధిగా గురువారం ఉదయం ట్రై సైకిల్‌పై ఇంటింటికీ తిరిగి చెత్త సేకరిస్తూ సుమారు 10గంటల సమయంలో యద్దనపూడివారి (భారత్ గ్యాస్ కంపెనీ రోడ్) వీధిలో పాడుబడిన ఒక ఇంటి ముందుకు వచ్చారు. అక్కడ చెత్త ఉండటంతో దాన్ని తీసేందుకు ప్రయత్నిస్తుండగా... ఆ ఇంటి పైభాగానికి వెళ్లే మెట్ల పక్కన ఉన్న ఎలివేషన్ గోడ ఒక్కసారిగా కూలి ఆమెపై పడటంతో కుప్పకూలిపోయింది. సహ కార్మికులు 108కు ఫోన్ చేయగా, చాలాసేపటి వరకు రాకపోవడంతో ఆమెను ఆటోలో గొల్లపూడిలోని ఆంధ్రా హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం 12 గంటల సమయంలో మృతిచెందింది. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి భర్త అప్పలసూరి రిక్షా కార్మికుడు. వరలక్ష్మికి ముగ్గురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల ఉన్నారు. స్థానిక కార్పొరేటర్ బట్టిపాటి సంధ్యారాణి, వైఎస్సార్ సీపీ నాయకుడు శివ, సీపీఐ నగర సహాయ కార్యదర్శి జి.కోటేశ్వరరావు తదితరులు వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. శిథిలమైన ఇల్లు గోడ కూలిపోయిన ఇల్లు నలభై ఏళ్లనాటిది కావడంతో శిథిలమైపోయింది. నాలుగేళ్లుగా ఆ ఇంట్లో ఎవరూ ఉండటంలేదు. వైఆర్కే కుమార్ అనే వ్యక్తి నుంచి వై.కృష్ణారావు 1974లో స్థలం కొనుగోలు చేసి 1976లో ఇల్లు నిర్మించారు. ప్రస్తుత ఆయన మరణించగా, కుమారుల ఆధీనంలో ఉన్న ఆ ఇంటిని అమ్మకానికి పెడుతూ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో పాడుపడిపోయి ఉంది. -
ఇద్దరు వృద్ధుల ఆత్మహత్య
=పురుగుల మందు తాగి.. =కుటుంబసభ్యుల నిరాదరణ భరించలేక =మద్యం వ్యసనమూ వారికి శాపమైంది విజయవాడ, న్యూస్‌లైన్ : వృద్ధాప్యం పసిప్రాయంతో సమానమైందంటారు. చిన్నపిల్లల మాదిరిగానే వృద్ధులూ అనునయం కోరుకుంటారు. తమ లోటుపాట్లను ఎత్తిచూపడాన్ని సహించరు. తీవ్ర మానసిక వేదనకు గురవుతారు. కుటుంబ సభ్యుల నుంచి సరైన ఆదరణ లేదంటూ వాపోతుంటారు. ఆ పరిస్థితుల్లో కొందరు ఆత్మహత్యలు చేసుకోవడానికి వెనకాడరు. విజయ వాడలో బుధవారం అదే జరిగింది. కుటుంబ సభ్యుల నుంచి ఆదరణ కరువై, బతుకు భారంగా మారిందనే భావనతో విద్యాధరపురానికి చెందిన ఇద్దరు వృద్ధులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో అర్జా శంకరరావు(56) మద్యానికి బానిసకావడంతో కుటుంబసభ్యు లు దూరంగా ఉంచారు. రావూరి కృష్ణమూర్తి(60) భార్య మరణంతో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. వీరిద్దరికీ స్నేహం కుదిరింది. ఆ స్నేహమే వారిద్దర్నీ ఒకేసారి మృత్యు ఒడికి చేర్చింది. ఆ వివరాలు.. బుధవారం ఉదయం ఏడు గంటల సమయంలో కొత్తూరు తాడేపల్లి రోడ్డులోని నైనవరం ఫ్లై ఓవర్‌పై నుంచి వెళుతున్న ఓ యువకుడికి.. హైదరాబాద్ వెళ్లే రైల్వే ట్రాక్‌పైన 581/5ఏ విద్యుత్ పోల్ వద్ద ఇద్దరు వృద్ధులు అచేతనంగా పడి ఉండడం కనిపించింది. అతను వెంటనే కొత్తపేట పోలీసులకు సమాచారం అందించారు. తొలుత ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులను హత్య చేసి ట్రాక్ పక్కన పడేశారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో వెస్ట్ ఏసీపీ టీ. హరికృష్ణ, కొత్తపేట ఎస్ఐ ఈశ్వరరావు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫ్లై ఓవర్ పి7, పి8 ఫిల్లర్లకు మధ్య నిర్మానుష్య ప్రాంతంలో ఇద్దరు వృద్ధులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. రెండు మృతదేహాలు మూడు, నాలుగు అడుగుల దూరంలో పడి ఉన్నాయి. మృతదేహాలకు సమీపంలో రెండు గ్లాసులు, ఓ పురుగుల మందు డబ్బా, కొన్ని మిరపకాయ బజ్జీలున్నాయి. ఓ మృతదేహం వద్ద చిన్న డైరీ లభించింది. దానిలోని ఓ నంబరుకు పోలీసులు ఫోన్ చేశారు. లంబాడీపేటకు చెందిన ఓ వ్యక్తి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఓ మృతదేహాన్ని గుర్తించారు. చిట్టినగర్‌కు చెందిన తన స్నేహితుడి బాబాయ్ అని చెప్పి వారికి ఫోన్ చేశాడు. ఈలోగా మృతుని కుమారుడికి ఫోన్ చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల్లో ఒకరు విద్యాధరపురం లేబర్ కాలనీకి చెందిన రావూరి కృష్ణమూర్తిగా, మరొకరు మువ్వలవారి వీధికి చెందిన అర్జా శంకరావు(56)గా తేలింది. శంకరరావు 2011 వరకు అగ్నిమాపక శాఖలో సర్వీస్మన్గా విధులు నిర్వహించి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. మద్యం అతిగా సేవించే శంకరరావును అతని కుటుంబ సభ్యులు కాస్త దూరంగా ఉంచడంతో తీవ్ర మనోవేదనకు గురవుతుండేవాడని తెలిసింది. మద్యం అలవాటే శంకరరావుతో కృష్ణమూర్తికి స్నేహం కుదిర్చింది. స్థలాల క్రయవిక్రయాలకు మధ్యవర్తిగా వ్యవహరించే కృష్ణమూర్తికి ఇద్దరు కొడుకులున్నారు. ఆయన భార్య రాజ్యలక్ష్మి కొంతకాలం కిందట మరణించింది. కొడుకుల వద్దే ఉంటున్నాడు. తమ మద్యం వ్యసనం గురించి ఆలోచించలేని ఆ వృద్ధులు.. కుటుంబసభ్యుల నుంచి తమకు తగినంత ఆదరణ లేదనే భావనతోనే ఈ ఆత్మహత్యలకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రైల్వే ఎస్ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.