గోడ కూలి పారిశుద్ధ్య కార్మికురాలి మృతి
విజయవాడ(భవానీపురం) : పురాతనమైన ఇంటి ఎలివేషన్ గోడ కూలి విధి నిర్వహణలో ఉన్న పారిశుద్ధ్య కార్మికురాలు మృతి చెందింది. విద్యాధరపురం యద్దనపూడివారి వీధిలో గురువారం ఈ ఘటన జరిగింది. స్థానిక 29వ డివిజన్ పరిధిలోని రోటరీనగర్‌లో నివసించే నలిమింటి వరలక్ష్మి(45) గత 17 ఏళ్లుగా నగరపాలక సంస్థ శానిటేషన్ విభాగంలో కాంట్రాక్ట్ కార్మికురాలిగా పనిచేస్తున్నారు. ఆమె యథావిధిగా గురువారం ఉదయం ట్రై సైకిల్‌పై ఇంటింటికీ తిరిగి చెత్త సేకరిస్తూ సుమారు 10గంటల సమయంలో యద్దనపూడివారి (భారత్ గ్యాస్ కంపెనీ రోడ్) వీధిలో పాడుబడిన ఒక ఇంటి ముందుకు వచ్చారు. అక్కడ చెత్త ఉండటంతో దాన్ని తీసేందుకు ప్రయత్నిస్తుండగా... ఆ ఇంటి పైభాగానికి వెళ్లే మెట్ల పక్కన ఉన్న ఎలివేషన్ గోడ ఒక్కసారిగా కూలి ఆమెపై పడటంతో కుప్పకూలిపోయింది. సహ కార్మికులు 108కు ఫోన్ చేయగా, చాలాసేపటి వరకు రాకపోవడంతో ఆమెను ఆటోలో గొల్లపూడిలోని ఆంధ్రా హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం 12 గంటల సమయంలో మృతిచెందింది. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి భర్త అప్పలసూరి రిక్షా కార్మికుడు. వరలక్ష్మికి ముగ్గురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల ఉన్నారు. స్థానిక కార్పొరేటర్ బట్టిపాటి సంధ్యారాణి, వైఎస్సార్ సీపీ నాయకుడు శివ, సీపీఐ నగర సహాయ కార్యదర్శి జి.కోటేశ్వరరావు తదితరులు వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు.
శిథిలమైన ఇల్లు
గోడ కూలిపోయిన ఇల్లు నలభై ఏళ్లనాటిది కావడంతో శిథిలమైపోయింది. నాలుగేళ్లుగా ఆ ఇంట్లో ఎవరూ ఉండటంలేదు. వైఆర్‌కే కుమార్ అనే వ్యక్తి నుంచి వై.కృష్ణారావు 1974లో స్థలం కొనుగోలు చేసి 1976లో ఇల్లు నిర్మించారు. ప్రస్తుత ఆయన మరణించగా, కుమారుల ఆధీనంలో ఉన్న ఆ ఇంటిని అమ్మకానికి పెడుతూ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో పాడుపడిపోయి ఉంది.