Contract Labour
-
‘కాంట్రాక్ట్ కార్మికులపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు’
సాక్షి, విజయవాడ : కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతంరెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కాంట్రాక్ట్ కార్మికుల పర్మినెంట్‌కు సంబంధించి వేసిన కేబినెట్ సబ్‌కమిటీ ఇంతవరకూ నివేదిక ఇవ్వలేదని మండిపడ్డారు. ఇలా కమిటీలు వేయడం.. నివేదికలు విస్మరించడం ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని విమర్శించారు. పర్మీనెంట్ చేసే విషయంలో ఇప్పుడు సుప్రీం ఉత్తర్వులు గుర్తుకొచ్చాయా అని ప్రశ్నించారు. అలాంటప్పుడు ప్రభుత్వం కేబినెట్ సబ్‌కమిటీ ఎందుకు వేసిందని నిలదీశారు. కాంట్రాక్ట్ కార్మికులను చంద్రబాబు మోసం చేస్తున్నారని, తగిన మూల్యం చెల్లించుకుంటారని గౌతం రెడ్డి పేర్కొన్నారు. -
కాంట్రాక్ట్ కార్మికుడికి కరెంట్ షాక్
కదిరి అర్బన్ : కదిరి రూరల్ మండలం సమీపంలోని విద్యుత్ లైన్ మరమ్మతు చేస్తుండగా కాంట్రాక్ట్ కార్మికుడు వెంకటరమణనాయక్ విద్యుదాఘాతంతో తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని వెంటనే ఆటోలో కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఒక ఫీడర్లో ఎల్సీ తీసుకుని మరో ఫీడర్లో పని చేస్తుండగా ప్రమాదం జరిగిందని ట్రాన్స్‌కో ఏఈ షాజహాన్ తెలిపారు. -
కాంట్రాక్ట్ కార్మికులకు వైద్య పరీక్షలు
భెల్: కార్మికులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేయగలుగుతారని ఏజీఎం హెచ్ఆర్ ఆదిశేష్, భెల్ అధికార కార్మిక యూనియన్ అధ్యక్షుడు జి.ఎల్లయ్య పేర్కొన్నారు. బీహెచ్ఈఎల్, ఈఎస్ఐ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం జ్యోతి విద్యాలయంలో ఒప్పంద కార్మికులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈఎస్ఐ జాయింట్ డైరక్టర్ సమక్షంలో వైద్య బందం కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భెల్ పరిశ్రమ యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని ఉచిత వైద్య శిబిరం నిర్వహించిదన్నారు. కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిబిరం మరో రెండు రోజుల పాటు కొనసాగింస్తామనిఅధికారులు పేర్కొన్నారు. కార్మికులకు పరీక్షల్లో ఇతరత్ర వ్యాధులు నిర్ధారణ అయితే మెరుగైన వైద్యం కోసం కార్పొరేటర్ ఆస్పత్రులకు తరలిస్తామన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు సత్యబాబు, వైద్యులు, కార్మిక యూనియన్ నాయకులు, హెచ్ఆర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఎఫ్‌సీఐలో సంబరాలు
జ్యోతినగర్: ప్రధాని నరేంద్రమోడీ గజ్వేల్‌లో మిషన్‌కాకతీయ పైలాన్, రామగుండం ఎరువుల కర్మాగారానికి శంకుస్థాపన చేయడంతో ఎఫ్‌సీఐ మాజీ ఉద్యోగులు, కాంట్రాక్టు క్యాజువల్ లేబర్, స్థానిక నిరుద్యోగ యువత, ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీనవర్గాల యువత బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ కమిటీ మాజీ అధ్యక్షుడు ఎం.సుందర్రాజు, డి.పోశంయాదవ్, బొడ్డుపల్లి నారాయణ మాట్లాడుతూ ఎరువుల కర్మాగారం గ్యాస్ ఆధారితంగా రోజుకు 3850 టన్నుల యూరియా, 200 టన్నుల అమ్మోనియా తయారు చేస్తుందన్నారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంత్‌కుమార్, కేంద్ర సహజ వాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కృషి చేశారని పేర్కొన్నారు. గతంలో పనిచేసిన మాజీ ఉద్యోగుల కుటుంబాల పిల్లలకు పర్మినెంట్ ఉపాధి కల్పించాలని, కాంట్రాక్టు క్యాజువల్ లేబర్ కుటుంబాల పిల్లలకు అర్హతలను బట్టి పర్మినెంట్, ఔట్సోర్సింగ్ పద్ధతిన ఉపాధి కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఆసిఫ్‌పాషా, రాంబాబు, ప్రతాప్, భూంరావు, మల్లేష్‌తో పాటు కాంట్రాక్టు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
గోదావరిఖని : బొగ్గుగని కార్మికుల పదో వేజ్‌బోర్డులో కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై చర్చించి వేతన ఒప్పందాన్ని చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి తోకల రమేశ్ డిమాండ్ చేశారు. రెండేళ్ల చర్చల ఫలితంగా దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మిక సంఘాలను ఒక్క తాటిపైకి తీసుకువచ్చి ఐక్య ఉద్యమం నిర్వహించడంలో ఐఎఫ్టీయూ విజయం సాధించిందని తెలిపారు. ఆగస్టు 1న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఏడు రాష్ట్రాల ధర్నాలో ఐఎఫ్టీయూ జాతీయ అధ్యక్షులు అపర్ణ, ప్రధాన కార్యదర్శి బి.ప్రదీప్, టి.శ్రీనివాస్, ఎ.వెంకన్న. జె.సీతారామయ్య, శంకర్‌ముదిరాజ్ పాల్గొన్నారని గుర్తుచేశారు. 2013 జనవరి నుంచి అమలు కావాల్సిన హైపవర్ కమిటీ వేతనాలపై వేజ్‌బోర్డు సంఘాలు స్పందించడం లేదని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కాంట్రాక్టు కార్మికులకు హెచ్పీసీ వేతనాలు అమలు జరిగిన దాఖలాలు లేవని తెలిపారు. 10 వేజ్‌బోర్డులో కాంట్రాక్టు కార్మికులకు వేతన ఒప్పందాన్ని వర్తింపజేసి అమలు చేయాలని వారు డిమాండ్ చేశారని, ధర్నా అనంతరం కేంద్ర బొగ్గు గనుల కార్యదర్శికి వినతిపత్రం అందించారని గుర్తుచేశారు. -
గోడ కూలి పారిశుద్ధ్య కార్మికురాలి మృతి
విజయవాడ(భవానీపురం) : పురాతనమైన ఇంటి ఎలివేషన్ గోడ కూలి విధి నిర్వహణలో ఉన్న పారిశుద్ధ్య కార్మికురాలు మృతి చెందింది. విద్యాధరపురం యద్దనపూడివారి వీధిలో గురువారం ఈ ఘటన జరిగింది. స్థానిక 29వ డివిజన్ పరిధిలోని రోటరీనగర్‌లో నివసించే నలిమింటి వరలక్ష్మి(45) గత 17 ఏళ్లుగా నగరపాలక సంస్థ శానిటేషన్ విభాగంలో కాంట్రాక్ట్ కార్మికురాలిగా పనిచేస్తున్నారు. ఆమె యథావిధిగా గురువారం ఉదయం ట్రై సైకిల్‌పై ఇంటింటికీ తిరిగి చెత్త సేకరిస్తూ సుమారు 10గంటల సమయంలో యద్దనపూడివారి (భారత్ గ్యాస్ కంపెనీ రోడ్) వీధిలో పాడుబడిన ఒక ఇంటి ముందుకు వచ్చారు. అక్కడ చెత్త ఉండటంతో దాన్ని తీసేందుకు ప్రయత్నిస్తుండగా... ఆ ఇంటి పైభాగానికి వెళ్లే మెట్ల పక్కన ఉన్న ఎలివేషన్ గోడ ఒక్కసారిగా కూలి ఆమెపై పడటంతో కుప్పకూలిపోయింది. సహ కార్మికులు 108కు ఫోన్ చేయగా, చాలాసేపటి వరకు రాకపోవడంతో ఆమెను ఆటోలో గొల్లపూడిలోని ఆంధ్రా హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం 12 గంటల సమయంలో మృతిచెందింది. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి భర్త అప్పలసూరి రిక్షా కార్మికుడు. వరలక్ష్మికి ముగ్గురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల ఉన్నారు. స్థానిక కార్పొరేటర్ బట్టిపాటి సంధ్యారాణి, వైఎస్సార్ సీపీ నాయకుడు శివ, సీపీఐ నగర సహాయ కార్యదర్శి జి.కోటేశ్వరరావు తదితరులు వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. శిథిలమైన ఇల్లు గోడ కూలిపోయిన ఇల్లు నలభై ఏళ్లనాటిది కావడంతో శిథిలమైపోయింది. నాలుగేళ్లుగా ఆ ఇంట్లో ఎవరూ ఉండటంలేదు. వైఆర్కే కుమార్ అనే వ్యక్తి నుంచి వై.కృష్ణారావు 1974లో స్థలం కొనుగోలు చేసి 1976లో ఇల్లు నిర్మించారు. ప్రస్తుత ఆయన మరణించగా, కుమారుల ఆధీనంలో ఉన్న ఆ ఇంటిని అమ్మకానికి పెడుతూ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో పాడుపడిపోయి ఉంది. -
అప్పు తీర్చమన్నందుకు స్నేహితుడినే..
కాంట్రాక్ట్ కార్మికుడి కేసును ఛేదించిన పోలీసులు మృతుని ఏటీఎం కార్డు ద్వారా నిందితుల గుర్తింపు అల్లిపురం: అప్పు తీర్చమన్నందుకు ఏకంగా స్నేహితుడి ఉసురు తీసిన నలుగురు యువకులను దువ్వాడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రూ.28 వేలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దక్షిణ మండలం శాంతి భద్రతల డీసీపీ రాంగోపాలఖ నాయక్ వివరాలు వెల్లడించారు. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధి నడుపూరు, మద్దివానిపాలెం గ్రామాల సరిహద్దులో గత నెల 9వ తేదీన స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుడు.. జార్ఖండ్‌కు చెందిన క్లెమెంట్ ఎక్కా (27) అనుమనాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. కేసు నమోదు చేసిన సౌత్ ఏసీపీ మధుసూదనరావు, సీఐ వెంకటరావులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు పెదగంట్యాడ ఏపీ హెచ్‌బీ కాలనీలో నివసిస్తున్నాడు. పెదగంట్యాడ మండలం నమ్మిదొడ్డిలో నివసిస్తున్న మీసాల బబ్లుకుమార్ (జార్ఖండ్), ఉమేష్ బదాయక్లు వచ్చి మృతుడిని తీసుకుని నడుపూడి గ్రామ శివార్లకు తీసుకువెళ్లారు. అప్పటికే అక్కడ ఒడిశాకు చెందిన కిషోర్‌కుమార్, అమిత్ కుమార్‌లు ఉన్నారు. అక్కడ క్లెమెంట్ ఎక్కా బబ్లుకుమార్‌తో మాట్లాడుతుండగా ఉమేష్ వెనుక నుండి బలమైన కర్రతో తలపై మోదాడు. దీంతో ఎక్కా కిందపడిపోగా మిగిలిన వారు అతని ముఖాన్ని రాళ్లతో చితక్కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శవాన్ని అక్కడే వదిలేసి నిందితులు పరారయ్యారు. -
కార్మికుడి ఆత్మహత్యాయత్నం
మెదక్ : ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఓ కాంట్రాక్ట్ కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా పుల్కల్ మండలంలోని చార్మినార్ బ్రేవరీస్ కర్మాగారం ఎదుట గురువారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. చార్మినార్ బ్రేవరీస్ కర్మాగారంలో గత పది సంవత్సరాలుగా కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న మిర్యాల కిట్టయ్య(38)ను ఇక ముందు పనికి రావద్దని కాంట్రాక్టర్ చెప్పడంతో మనస్తాపం చెందిన కిట్టయ్య ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన తోటి కార్మికులు అతన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
బంకర్ కూలి కార్మికుడి మృతి
శ్రీరాంపూర్: కరీంనగర్ జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్‌పీ) వద్ద బుధవారం బంకర్ ప్లాట్‌ఫాం కూలి మేరుగు శ్రీకాంత్ (26) అనే కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందాడు. మరో ఏడుగురు ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. రైల్వే లైన్‌కు దగ్గరగా ఉన్న బంకర్లో కన్వేయర్ బెల్ట్ పక్కన పడే మల్మను (బొగ్గుచూర)ను తీయడానికి 8 మంది కాంట్రాక్ట్ కార్మికులకు పనులు అప్పగించారు. చెమ్మస్‌తో మల్మలను తీస్తుండగా ఒక్క సారిగా వారు ఉన్న ప్లాట్ ఫాం కూలింది. దీంతో శ్రీకాంత్ పై నుంచి కింద పడ్డాడు . అతనిపై శిథిలాలు పడటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. అక్కడ పని చేసే మిగిలిన చీకటి రామ్మూర్తి, జాడీ చిన్నయ్య, అశోక్, సుధాకర్‌రెడ్డి, నర్సయ్య, శ్రీను, అరుణ్‌లు ప్లాట్ ఫాం విరుగుతున్న శబ్దాలు గ్రహించి పక్కకు తప్పుకున్నారు. ఏ మాత్రం అప్రమత్తంగా లేకున్నా వారు కూడా మృత్యువాత పడేవారు. అధికారుల నిర్లక్ష్యమే కారణం.. ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. 1972లో ఈ బంకర్‌ను నిర్మించారు. దీంతో బంకర్‌కు ఉన్న సిమెంట్ ఫిల్లర్లు, బెల్ కింద్ర ఉంటే ప్లాట్ ఫాం పూర్తిగా శిథిలావస్థలకు చేరుకున్నాయి. కనీసం ప్రమాదాలకు ఆస్కారం ఉందని తెలిసిన చోట అధికారులు రక్షణ ఏర్పాటు చేయాల్సి ఉండగా పట్టించుకోలేదు. బంకర్ రిపేరు పనులు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. అంతలోనే ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపించారు. మృతుని కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ కార్మికులు, పలు సంఘాలు ఆందోళనకు దిగాయి. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించకుండా అడ్డుకున్నారు. -
'షార్' లో వివాదం
శ్రీహరికోట (నెల్లూరు) : షార్‌లో పని చేసే కాంట్రాక్ట్ లేబర్, సీఎస్ఎఫ్ పోలీసులకు మధ్య వివాదం చెలరేగింది. ఈ సంఘటన సోమవారం శ్రీహరికోటలోని షార్‌లో వెలుగుచూసింది. వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొంతమంది కార్మికులు శ్రీహరికోట షార్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. కాగా ఆదివారం శెలవు కావడంతో 10 మంది కార్మికులు సాయంత్రం షార్ పరిసర ప్రాంతాల్లో మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ఒక సీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఇది చూసి వారిని దూషించారు. దీంతో ఆగ్రహించిన కార్మికులు అతనిపై దాడి చేశారు. ఈ విషయం మరి కొంతమంది సీఎస్ఎఫ్ కానిస్టేబుల్స్‌కు తెలియడంతో వారు అక్కడికి చేరుకున్నారు. విషయం పెద్దదై పరస్పరం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై సోమవారం కార్మికులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లినట్లు తెలిసింది. -
డబ్బులివ్వలేదని కన్నతల్లిని కడతేర్చిన కొడుకు
కొత్తగూడెం: రూ. రెండు వేలు అడిగితే ఇవ్వనన్నందుకు కన్నతల్లిని గొడ్డలితో నరికి దారుణంగా హత్యచేశాడో ప్రబుద్ధుడు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని చిట్టిరామవరంలో శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన వివరాలు.. చిట్టిరామవరానికి చెందిన అజ్మీరా సక్కుబాయి(65) సింగరేణిలో కాంట్రాక్టు లేబర్‌గా పని చేస్తోంది. ఈమె కొడుకు రాంచందర్ కొత్తగూడెంలోని స్వీట్‌షాపులో పని చేస్తున్నాడు. తల్లి సొంత ఇంట్లోనే ఓ గదిలో ఉంటుండగా, మరో పోర్షన్లో రాంచందర్ ఉంటున్నాడు. మద్యానికి బానిసైన రాంచందర్ డబ్బుల కోసం తల్లిని తరచూ వేధించేవాడు. శనివారం రాత్రి సైతం రూ. 2 వేలు ఇవ్వాలని తల్లి సక్కుబాయిని అడిగాడు. ఇవ్వకపోవడంతో పక్కనే ఉన్న గొడ్డలి తీసుకొని తల్లిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. దీంతో సక్కుబాయి మెడ, చేయిపై తీవ్రగాయాలయ్యాయి. అరుపులకు స్థానికులు వచ్చి సక్కుబాయిని 108లో కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మం తరలిస్తుండగా మరణించింది. ఆదివారం ఉదయం పత్తి చేనులో నిందితుడు రాంచందర్ పడుకొని ఉండగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కాంట్రాక్టు కార్మికుల పట్ల సర్కార్ తీరు దారుణం
హైదరాబాద్ : కాంట్రాక్టు కార్మికుల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా సేవలందిస్తున్నా.... వారిని కాంట్రాక్ట్ సేవలకే పరిమితం చేయడం దారుణమన్నారు. న్యాయబద్ధమైన వేతనాల కోసం ఆందోళనలు, నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. అసెంబ్లీ విరామ సమయంలో మీడియాతో మాట్లాడిన విశ్వేశ్వరరెడ్డి....కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై చంద్రబాబును నిలదీశారు. -
మునిసిపల్ కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంపు
నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్లకు రూ. 6,700 నుంచి 8,300 వర్కర్ల వేతనాలను రూ.6,700 నుంచి 7,300కి పెంపు సాక్షి, హైదరాబాద్: మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాల పెంపును తక్షణమే అమలు చేయాలని సంబంధిత మునిసిపల్ కమిషనర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణ మునిసిపల్ వాటర్ వర్క్స్, ఎంప్లాయీస్ యూనియన్ విజ్ఞప్తి మేరకు .. వాటర్ వర్క్స్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో పనిచేస్తున్న నాన్ పబ్లిక్ హెల్త్ ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనాలను పెంచుతూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న నాన్ పబ్లిక్ హెల్త్ కాంట్రాక్టు వర్కర్ల వేతనాలు రూ.6,700 నుంచి 8,300లకు, నగర పంచాయతీ కాంట్రాక్టు వర్కర్ల వేతనాలను రూ.6,700 నుంచి రూ.7,300లకు పెంచింది. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఈ ఉత్తర్వులను అమలు చేయాలని మంగళవారం మరోసారి ఆదేశించింది. -
పాపం... ‘పోలీస్’
సేఫ్టీ ఆఫీసర్ నిర్వాకంతో కార్మికుడి మృతి రాజమండ్రి పేపరు మిల్లులో ఘటన 25 లక్షల పరిహారం చెల్లించాలి: జక్కంపూడి విజయలక్ష్మి డిమాండ్ రూ.13 లక్షలు, భార్యకు ఉద్యోగం ఇస్తామని యాజమాన్యం హామీ రాజమండ్రి: పేపర్ మిల్లు సేఫ్టీ ఆఫీసర్ నిర్వాకం వల్ల ఓ కాంట్రాక్ట్ కార్మికుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ఎదురపల్లి గ్రామానికి చెందిన మైనపల్లి పోలీస్ (25) ఇంటర్ నేషనల్ పేపర్ మిల్లులో నాలుగు నెలలుగా కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. పేపర్ మిల్లు గోడౌన్‌కు 30 అడుగుల ఎత్తులో తాడుకు వేలాడుతూ సున్నం వేస్తుండగా, సేఫ్టీ ఆఫీసర్ రెడ్డి తాడును పట్టుకొని లాగడంతో మైనపల్లి పోలీస్ జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఏడాది క్రితం పెళ్లయింది. గర్భిణి అయిన భార్య పుట్టింట్లో ఉంటోంది. పోలీస్ మృతితో పేపర్‌మిల్లులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సంఘటనతో ఆగ్రహించిన వైఎస్సార్ సీపీ కేంద్ర కమిటీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, కార్మిక సంఘం నాయకుడు టి.కె. విశ్వేశ్వరరెడ్డి, సీపీఎం నాయకులు టి.అరుణ్ తదితరులు బైఠాయించి బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని, సంఘటనకు కారణమైన రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మికుడి కుటుంబానికి రూ.25 లక్షలు చెల్లించాలని, అతడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక దశలో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ హెచ్ఆర్ శ్రీనివాసరావు, నాయకుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. జక్కంపూడి విజయలక్ష్మి రూ.25 లక్షలు నష్టపరిహారం డిమాండ్ చేయగా, యాజమాన్యం రూ.13 లక్షలు, మృతుడి భార్యకు పేపర్‌మిల్లు కేంటీన్లో ఉద్యోగం ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో కార్మికులు, ఉద్యోగులు తదితర నాయకులు ఆందోళన విరమించారు. ఈ ఆందోళనలో పేపర్ మిల్లు కార్మిక నాయకులు బయ్యే జోసఫ్ రాజు, బ్రహ్మయ్య, తదితరులు పాల్గొన్నారు. -
ఎక్కడి చెత్త అక్కడే
పట్టణాలు, నగరాల్లో ఎక్కడి చెత్త అక్కడే ఉంది. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 19 కార్పొరేషన్లు, 164 మునిసిపాలిటీలలో పనిచేస్తున్న 25 వేల మందికి పైగా పారిశుధ్య కార్మికులు సమ్మె ప్రారంభించారు. ఎక్కడా పారిశుధ్య విధులు నిర్వర్తించేది లేదని వారు తెగేసి చెప్పారు. దీంతో మొత్తం పట్టణాలు, నగరాలు అన్నీ చెత్తమయం అయిపోయాయి. నెలకు తమకు కనీస వేతనంగా రూ.12,500 చెల్లించాలని, విధి నిర్వహణలో మరణిస్తే ఆ కార్మికుని కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, తమ ఉద్యోగాలను దశల వారీగా క్రమబద్ధీకరించాలని, జాతీయ సెలవు దినాలు, వారాంతపు సెలవు దినాలు ఇవ్వడంతో పాటు సబ్బులు, దుస్తులు ఇవ్వాలని వీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ల సాధనకు రెండు నెలలుగా వివిధ రకాల ఆందోళనలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో రెండు దఫాలుగా అధికారులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో సోమవారం నుంచి సమ్మె ప్రారంభించారు.వీరి సమ్మెకు ఏఐటీయూసీ, సీఐటీయూ, టీఎన్టీయూసీ తదితర కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. నిన్నమొన్నటి దాకా సీమాంధ్ర జిల్లాల్లో మున్సిపల్ ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు. వీరి సమ్మె విరమణ జరిగిన వారంలోపే రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టు కార్మికులు సమ్మెలోకి వెళ్లనుండటంతో అంతంత మాత్రంగా ఉన్న నగర పారిశుధ్యం పూర్తిగా చతికిలపడనుంది. -
నేటి నుంచి కాంట్రాక్టు పారిశుధ్య కార్మికుల సమ్మె
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు సోమవారం నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆదివారం రాత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 164 మునిసిపాలిటీలు, 19 కార్పొరేషన్లలో పనిచేస్తున్న 25 వేల మందికి పైగా కార్మికులు సమ్మెలోకి వెళుతున్నారు. కాంట్రాక్టు కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు కూడా వీరిలో ఉన్నారు. నెలసరి కనీస వేతనం రూ.12,500 చెల్లించాలని, విధి నిర్వహణలో మరణిస్తే ఆ కార్మికుని కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, తమ ఉద్యోగాలను దశల వారీగా క్రమబద్ధీకరించాలని, జాతీయ సెలవు దినాలు, వారాంతపు సెలవు దినాలు ఇవ్వడంతో పాటు సబ్బులు, దుస్తులు ఇవ్వాలని వీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ల సాధనకు రెండు నెలలుగా వివిధ రకాల ఆందోళనలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో రెండు దఫాలుగా అధికారులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో సోమవారం నుంచి సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా 10 కాంట్రాక్టు కార్మిక సంఘాలు సమ్మెలోకి వెళ్లనున్నట్లు నేతలు ప్రకటించారు. వీరి సమ్మెకు ఏఐటీయూసీ, సీఐటీయూ, టీఎన్టీయూసీ తదితర కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. నిన్నమొన్నటి దాకా సీమాంధ్ర జిల్లాల్లో మున్సిపల్ ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు. వీరి సమ్మె విరమణ జరిగిన వారంలోపే రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టు కార్మికులు సమ్మెలోకి వెళ్లనుండటంతో అంతంత మాత్రంగా ఉన్న నగర పారిశుధ్యం పూర్తిగా చతికిలపడనుంది. అందుబాటులో లేని శాఖాధిపతులు... కార్మికుల సమ్మె విరమణకు చర్చలు జరపడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాల్సిన మున్సిపల్ శాఖ అధిపతులు ముగ్గురూ అందుబాటులో లేరు. వ్యక్తిగత పనులపై ముఖ్య కార్యదర్శి సెలవులో ఉన్నారు. కార్యదర్శి శిక్షణలో ఉన్నారు. కమిషనర్ ‘అధ్యయనానికి’ ఇజ్రాయిల్ వెళ్లారు. ‘గ్రేటర్’ కమిషనర్ ఉన్నప్పటికీ సమ్మెలోకి వెళ్లే కార్మికులను కనీసం చర్చలకు కూడా పిలవలేదు.