ఎక్కడి చెత్త అక్కడే
పట్టణాలు, నగరాల్లో ఎక్కడి చెత్త అక్కడే ఉంది. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 19 కార్పొరేషన్లు, 164 మునిసిపాలిటీలలో పనిచేస్తున్న 25 వేల మందికి పైగా పారిశుధ్య కార్మికులు సమ్మె ప్రారంభించారు. ఎక్కడా పారిశుధ్య విధులు నిర్వర్తించేది లేదని వారు తెగేసి చెప్పారు. దీంతో మొత్తం పట్టణాలు, నగరాలు అన్నీ చెత్తమయం అయిపోయాయి. నెలకు తమకు కనీస వేతనంగా రూ.12,500 చెల్లించాలని, విధి నిర్వహణలో మరణిస్తే ఆ కార్మికుని కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, తమ ఉద్యోగాలను దశల వారీగా క్రమబద్ధీకరించాలని, జాతీయ సెలవు దినాలు, వారాంతపు సెలవు దినాలు ఇవ్వడంతో పాటు సబ్బులు, దుస్తులు ఇవ్వాలని వీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.
ఈ డిమాండ్ల సాధనకు రెండు నెలలుగా వివిధ రకాల ఆందోళనలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో రెండు దఫాలుగా అధికారులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో సోమవారం నుంచి సమ్మె ప్రారంభించారు.వీరి సమ్మెకు ఏఐటీయూసీ, సీఐటీయూ, టీఎన్‌టీయూసీ తదితర కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. నిన్నమొన్నటి దాకా సీమాంధ్ర జిల్లాల్లో మున్సిపల్ ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు. వీరి సమ్మె విరమణ జరిగిన వారంలోపే రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టు కార్మికులు సమ్మెలోకి వెళ్లనుండటంతో అంతంత మాత్రంగా ఉన్న నగర పారిశుధ్యం పూర్తిగా చతికిలపడనుంది.