అప్పు తీర్చమన్నందుకు స్నేహితుడినే..
- కాంట్రాక్ట్ కార్మికుడి కేసును ఛేదించిన పోలీసులు
- మృతుని ఏటీఎం కార్డు ద్వారా నిందితుల గుర్తింపు
అల్లిపురం: అప్పు తీర్చమన్నందుకు ఏకంగా స్నేహితుడి ఉసురు తీసిన నలుగురు యువకులను దువ్వాడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రూ.28 వేలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దక్షిణ మండలం శాంతి భద్రతల డీసీపీ రాంగోపాలఖ నాయక్ వివరాలు వెల్లడించారు. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధి నడుపూరు, మద్దివానిపాలెం గ్రామాల సరిహద్దులో గత నెల 9వ తేదీన స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుడు.. జార్ఖండ్‌కు చెందిన క్లెమెంట్ ఎక్కా (27) అనుమనాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే.
కేసు నమోదు చేసిన సౌత్ ఏసీపీ మధుసూదనరావు, సీఐ వెంకటరావులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు పెదగంట్యాడ ఏపీ హెచ్బీ కాలనీలో నివసిస్తున్నాడు. పెదగంట్యాడ మండలం నమ్మిదొడ్డిలో నివసిస్తున్న మీసాల బబ్లుకుమార్ (జార్ఖండ్), ఉమేష్ బదాయక్‌లు వచ్చి మృతుడిని తీసుకుని నడుపూడి గ్రామ శివార్లకు తీసుకువెళ్లారు. అప్పటికే అక్కడ ఒడిశాకు చెందిన కిషోర్‌కుమార్, అమిత్ కుమార్‌లు ఉన్నారు. అక్కడ క్లెమెంట్ ఎక్కా బబ్లుకుమార్‌తో మాట్లాడుతుండగా ఉమేష్ వెనుక నుండి బలమైన కర్రతో తలపై మోదాడు. దీంతో ఎక్కా కిందపడిపోగా మిగిలిన వారు అతని ముఖాన్ని రాళ్లతో చితక్కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శవాన్ని అక్కడే వదిలేసి నిందితులు పరారయ్యారు.