పాపం... ‘పోలీస్’
సేఫ్టీ ఆఫీసర్ నిర్వాకంతో కార్మికుడి మృతి
రాజమండ్రి పేపరు మిల్లులో ఘటన
25 లక్షల పరిహారం చెల్లించాలి: జక్కంపూడి విజయలక్ష్మి డిమాండ్
రూ.13 లక్షలు, భార్యకు ఉద్యోగం ఇస్తామని యాజమాన్యం హామీ
రాజమండ్రి: పేపర్ మిల్లు సేఫ్టీ ఆఫీసర్ నిర్వాకం వల్ల ఓ కాంట్రాక్ట్ కార్మికుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ఎదురపల్లి గ్రామానికి చెందిన మైనపల్లి పోలీస్ (25) ఇంటర్ నేషనల్ పేపర్ మిల్లులో నాలుగు నెలలుగా కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. పేపర్ మిల్లు గోడౌన్‌కు 30 అడుగుల ఎత్తులో తాడుకు వేలాడుతూ సున్నం వేస్తుండగా, సేఫ్టీ ఆఫీసర్ రెడ్డి తాడును పట్టుకొని లాగడంతో మైనపల్లి పోలీస్ జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఏడాది క్రితం పెళ్లయింది. గర్భిణి అయిన భార్య పుట్టింట్లో ఉంటోంది.
పోలీస్ మృతితో పేపర్‌మిల్లులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సంఘటనతో ఆగ్రహించిన వైఎస్సార్ సీపీ కేంద్ర కమిటీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, కార్మిక సంఘం నాయకుడు టి.కె. విశ్వేశ్వరరెడ్డి, సీపీఎం నాయకులు టి.అరుణ్ తదితరులు బైఠాయించి బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని, సంఘటనకు కారణమైన రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మికుడి కుటుంబానికి రూ.25 లక్షలు చెల్లించాలని, అతడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక దశలో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ హెచ్‌ఆర్ శ్రీనివాసరావు, నాయకుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.
జక్కంపూడి విజయలక్ష్మి రూ.25 లక్షలు నష్టపరిహారం డిమాండ్ చేయగా, యాజమాన్యం రూ.13 లక్షలు, మృతుడి భార్యకు పేపర్‌మిల్లు కేంటీన్‌లో ఉద్యోగం ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో కార్మికులు, ఉద్యోగులు తదితర నాయకులు ఆందోళన విరమించారు. ఈ ఆందోళనలో పేపర్ మిల్లు కార్మిక నాయకులు బయ్యే జోసఫ్ రాజు, బ్రహ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.