
దేముడు మృతితో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న భార్య సత్యవతి, పిల్లలు, సంఘటన స్థలంలో దేముడి మృతదేహం
మునగపాక(యలమంచిలి): మునగపాక–వాడ్రాపల్లిరోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ పెయింటర్ దుర్మరణం చెందాడు. దీంతో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. దేవుడా ఇక తమకు దిక్కెవరంటూ భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. వివరాలు ఇలా ఉన్నాయి. చోడవరం మండలం లక్కవరం గ్రామానికి చెందిన లక్కవరపు దేముడు(34)పెయింటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొన్నాళ్లపాటు విశాఖలో ఉంటూ పనిచేశాడు. ఏడాది క్రితం అచ్యుతాపురం మండలం జగన్నాథపురంలో తన అత్తవారింటి వచ్చి, అక్కడే ఉంటూ పెయింటింగ్ పనులు చేస్తున్నాడు. మంగళవారం రాత్రి వాడ్రాపల్లిలోని పారిపల్లెమ్మ అమ్మవారి పండుగకు బైక్‌పై వెళ్లాడు.
తిరుగు ప్రయాణంలో బుధవారం తెల్లవారుజామున ఇంటికి వస్తుండగా మునగపాకకు చెందిన కింతాడ దేముడు, కుంది జయలక్ష్మి లిఫ్ట్‌కావాలని అడగడంతో లక్కవరపు దేముడు వారిని తన బైక్‌పై ఎక్కించుకుని మునగపాక వైపు వస్తున్నాడు. అదే సమయంలో వాడ్రాపల్లి వైపునకు వస్తున్న ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో లక్కవరపు దేముడు అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్ వెనుక కూర్చొన్న కింతాడ దేముడు, జయలక్ష్మిలకు తీవ్ర గాయాలు కావడంతో అనకాపల్లి వందపడకల ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్సనిర్వహించి మెరుగైన వైద్యంకోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఎస్‌ఐ స్వామినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారకుడైన ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
మిన్నంటిన రోదనలు
దేముడు మృతి చెందాడన్న విషయం తెలియడంతో అతని కుటుంబ సభ్యులు,బంధువులు అనకాపల్లి వందపడకల ఆస్పత్రికి చేరుకొన్నారు. విగతజీవిగా ఉన్న భర్త దేముడును చూసి భార్య సత్యవతి గుండెలవిసేలా రోదించింది. బందుమిత్రుల రోదనలు మిన్నంటాయి. దేముడికి ధరణి(7), లలిత్(5) అనే పిల్లలున్నారు. చిన్నారులకు దిక్కెవరంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.