శ్రీరాంపూర్: కరీంనగర్ జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్‌పీ) వద్ద బుధవారం బంకర్ ప్లాట్‌ఫాం కూలి మేరుగు శ్రీకాంత్ (26) అనే కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందాడు. మరో ఏడుగురు ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. రైల్వే లైన్‌కు దగ్గరగా ఉన్న బంకర్‌లో కన్వేయర్ బెల్ట్ పక్కన పడే మల్మను (బొగ్గుచూర)ను తీయడానికి 8 మంది కాంట్రాక్ట్ కార్మికులకు పనులు అప్పగించారు.
చెమ్మస్‌తో మల్మలను తీస్తుండగా ఒక్క సారిగా వారు ఉన్న ప్లాట్ ఫాం కూలింది. దీంతో శ్రీకాంత్ పై నుంచి కింద పడ్డాడు . అతనిపై శిథిలాలు పడటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. అక్కడ పని చేసే మిగిలిన చీకటి రామ్మూర్తి, జాడీ చిన్నయ్య, అశోక్, సుధాకర్‌రెడ్డి, నర్సయ్య, శ్రీను, అరుణ్‌లు ప్లాట్ ఫాం విరుగుతున్న శబ్దాలు గ్రహించి పక్కకు తప్పుకున్నారు. ఏ మాత్రం అప్రమత్తంగా లేకున్నా వారు కూడా మృత్యువాత పడేవారు.
అధికారుల నిర్లక్ష్యమే కారణం..
ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. 1972లో ఈ బంకర్‌ను నిర్మించారు. దీంతో బంకర్‌కు ఉన్న సిమెంట్ ఫిల్లర్లు, బెల్ కింద్ర ఉంటే ప్లాట్ ఫాం పూర్తిగా శిథిలావస్థలకు చేరుకున్నాయి. కనీసం ప్రమాదాలకు ఆస్కారం ఉందని తెలిసిన చోట అధికారులు రక్షణ ఏర్పాటు చేయాల్సి ఉండగా పట్టించుకోలేదు. బంకర్ రిపేరు పనులు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. అంతలోనే ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపించారు. మృతుని కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ కార్మికులు, పలు సంఘాలు ఆందోళనకు దిగాయి. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించకుండా అడ్డుకున్నారు.
బంకర్ కూలి కార్మికుడి మృతి
Published Wed, Jun 24 2015 6:37 PM | Last Updated on Sun, Sep 3 2017 4:18 AM
Advertisement
Advertisement