విద్యాధరపురంలోని ఆర్టీసీ సెంట్రల్ హాస్పిటల్
భవానీపురం (విజయవాడ పశ్చిమ): ఉద్యోగుల ఆరోగ్యానికి కూడా పెద్దపీట వేస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ). రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్‌లోని తార్నాక ఆర్టీసీ హాస్పిటల్‌లో లక్ష మందికిపైగా ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వైద్యసేవలు అందేవి. విభజన అనంతరం 2016లో విజయవాడ ప్రధాన కేంద్రంగా ఏపీఎస్ ఆర్టీసీ పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ బస్ స్టేషన్‌లోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లో పరిపాలనా కార్యకలాపాలను ప్రారంభించింది.
అప్పట్లో రాష్ట్రంలోని ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ఉద్యోగులు వ్యయప్రయాసలకోర్చి తార్నాక హాస్పిటల్ వెళ్లి వైద్య సేవలు పొందాల్సి వచ్చేది. దీంతో రెండు మూడు రోజుల సమయం వృథా అయ్యేది. ఈ కారణంగా సిబ్బంది తిరిగి విధులకు హాజరు కావడానికి కొంత సమయం పట్టేది. తద్వారా ప్రయాణికుల సేవలకు బస్సులను సకాలంలో నడపటంలో సమస్యలు తలెత్తేవి.
18 డిస్పెన్సరీలు
విద్యాధరపురంలోని సెంట్రల్ హాస్పిటల్‌కు అనుబంధంగా రాష్ట్రవ్యాప్తంగా 18 డిస్పెన్సరీలను కూడా ఏర్పాటు చేశారు. కాగా, ఇటీవల కడపలో 20 పడకల ఏరియా ఆస్పత్రిని నిర్మించి అక్కడ కూడా వైద్య సేవలు అందిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న విశ్రాంత ఉద్యోగులు విజయవాడ వరకు రావాల్సిన పని లేకుండా గత ఏడాది డిసెంబర్ 18న హైదరాబాద్ తార్నాక రోడ్డు నంబర్–1లో 19వ వైద్యశాలను నెలకొల్పారు.
వార్డులు.. అత్యవసర విభాగాలెన్నో..
ఈ ఆస్పత్రిలో అత్యవసర పేషెంట్ల కోసం ఐసీయూ, క్యాజువాలిటీ, పోస్ట్ ఆపరేటివ్ వార్డులు ఏర్పాటు చేశారు. జనరల్ మెడిసిన్, సర్జరీ, ఆర్థోపెడిక్, గైనిక్, డెర్మటాలజీ, ఆప్తమాలజీ, చెవి, ముక్కు, గొంతు, పీడియాట్రిక్స్, రేడియాలజీ, పాథాలజీ, డెంటల్, అనస్థీషియా విభాగాలు అందుబాటులో ఉన్నాయి. ఇవికాకుండా కార్డియాలజీ, ఆంకాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ సూపర్ స్పెషాలిటీ విభాగాల కన్సల్టెంట్ వైద్యులు నెలలో రెండుసార్లు ఇక్కడకు వచ్చి సేవలు అందించే ఏర్పాటు చేశారు. డిజిటల్ ఎక్సరే, ఈసీజీ, స్కానింగ్, లాప్రోస్కోపీ, ఫ్యాకో (కేటరాక్ట్ ఆపరేషన్ కోసం) కలర్ డాప్లర్, ఆటో అనలైజర్, సీ–ఆర్మ్ వంటివే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్యానికి పనికొచ్చేలా 20 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కూడా అందుబాటులో ఉంచారు.
అత్యాధునిక ఫిజయోథెరఫీ విభాగాన్ని సైతం ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్‌కు మెరుగైన వైద్యం కోసం రిఫరల్ హాస్పిటల్స్‌కు తరలించేందుకు అన్ని సౌకర్యాలతో కూడిన అంబులెన్స్‌ను కూడా సమకూర్చారు. వైద్యపరంగా ఏ విధమైన సమాచారం కావాలన్నా 24 గంటలపాటు పనిచేసే హెల్ప్‌లైన్ నంబర్లను (9494248897, 0866– 2415206) అందుబాటులోకి తెచ్చారు. వైద్య పరీక్షలకు అవసరమైన వైద్య పరికరాలు, యంత్ర సామగ్రిని కూడా ఈ ఆస్పత్రి సొంతంగా సమకూర్చుకుంది.
తార్నాక హాస్పిటల్‌కు దీటుగా..
ఉద్యోగుల ఇబ్బందులను అధిగమించే క్రమంలో తార్నాక హాస్పిటల్‌కు దీటుగా విజయవాడలోని విద్యాధరపురంలో ఉద్యోగుల భాగస్వామ్యంతో 2.50 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.15 కోట్ల వ్యయంతో అత్యాధునిక వసతులతో కార్పొరేట్ ఆస్పత్రి తరహాలో ఆర్టీసీ సెంట్రల్ హాస్పిటల్ నిర్మించింది. ఇందులో 2017 జూలై నెల 4వ తేదీ నుంచి వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. 50 పడకల సామర్థ్యంతో నిర్మించిన ఈ ఆస్పత్రి సుమారు 52 వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పెన్షనర్లు కలిపి మొత్తం సుమారు 2.25 లక్షల మంది వైద్య అవసరాలను తీరుస్తోంది.
ఈ ఆస్పత్రి నిర్మాణానికి ప్రతి ఉద్యోగి తమ జీతం నుంచి నెలకు రూ.100 చొప్పున రెండేళ్ల పాటు స్వచ్ఛందంగా విరాళంగా అందజేయటం విశేషం. ఇలా సుమారు రూ.13 కోట్లను సంస్థ సిబ్బంది సమకూర్చుకోగా.. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం వెచ్చించింది. భవనాల నిర్మాణానికయ్యే ఖర్చులో ఎక్కువ మొత్తం సిబ్బంది నుంచే అందగా.. మిగిలిన మొత్తంతోపాటు ఆస్పత్రిలో సౌకర్యాల కల్పన, పరికరాలు, ల్యాబొరేటరీల ఏర్పాటుకయ్యే నిధులను ప్రభుత్వమే సమకూర్చింది. ఈ విధంగా సకల సదుపాయాలు, సంపూర్ణ సౌకర్యాలతో ఉద్యోగులే కట్టుకున్న వైద్యాలయంగా ఆర్టీసీ సెంట్రల్ హాస్పిటల్ విరాజిల్లుతోంది.
వైద్య సేవలకు ప్రాధాన్యత
ఆర్టీసీ హాస్పిటల్‌లో అత్యాధునిక వైద్య సేవలు అందుతున్నాయి. సిబ్బంది ఆరోగ్యాన్ని సంరక్షించడమే లక్ష్యంగా ఆర్టీసీ ముందుకెళుతోంది. సంస్థ ప్రభుత్వంలో విలీనమైన తరువాత ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్ కార్డులు మంజూరైనా సంస్థాపరమైన వైద్య సేవలను ఎప్పటిలానే అందిస్తున్నాం. ఇతర ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులకు అందుబాటులో లేని ఉచిత కన్సల్టేషన్, మందులు అందించే సౌకర్యాన్ని ఆర్టీసీ సంస్థ మాత్రమే తన ఉద్యోగులకు కల్పించింది.
– సీహెచ్ ద్వారకాతిరుమలరావు, ఎండీ, ఏపీఎస్ ఆర్టీసీ
4 లక్షల పరిమితి వరకు
సిబ్బంది ఆరోగ్య పరిరక్షణలో భాగంగా అనేక చర్యలు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు అవసరమైన ఆధునిక మెషినరీ, పరికరాలు సమకూర్చుకుంటున్నాం. రోజుకు దాదాపు 200 మంది సిబ్బంది ఈ విద్యాధరపురం హాస్పిటల్‌కు వస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని హాస్పిటల్స్‌లలో రోజుకు 1700 నుంచి 2 వేల మంది వైద్య సేవలు పొందుతున్నారు. రిటైరైన ఉద్యోగి, అతని జీవిత భాగస్వామికి కలిపి రూ.4 లక్షల పరిమితి వరకు వైద్య సేవలు అందిస్తున్నాం.
– డీవీఎస్ అప్పారావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్, సెంట్రల్ హాస్పిటల్
Comments
Please login to add a commentAdd a comment