=పురుగుల మందు తాగి..
=కుటుంబసభ్యుల నిరాదరణ భరించలేక
=మద్యం వ్యసనమూ వారికి శాపమైంది
విజయవాడ, న్యూస్‌లైన్ : వృద్ధాప్యం పసిప్రాయంతో సమానమైందంటారు. చిన్నపిల్లల మాదిరిగానే వృద్ధులూ అనునయం కోరుకుంటారు. తమ లోటుపాట్లను ఎత్తిచూపడాన్ని సహించరు. తీవ్ర మానసిక వేదనకు గురవుతారు. కుటుంబ సభ్యుల నుంచి సరైన ఆదరణ లేదంటూ వాపోతుంటారు. ఆ పరిస్థితుల్లో కొందరు ఆత్మహత్యలు చేసుకోవడానికి వెనకాడరు. విజయ వాడలో బుధవారం అదే జరిగింది. కుటుంబ సభ్యుల నుంచి ఆదరణ కరువై, బతుకు భారంగా మారిందనే భావనతో విద్యాధరపురానికి చెందిన ఇద్దరు వృద్ధులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో అర్జా శంకరరావు(56) మద్యానికి బానిసకావడంతో కుటుంబసభ్యు లు దూరంగా ఉంచారు. రావూరి కృష్ణమూర్తి(60) భార్య మరణంతో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. వీరిద్దరికీ స్నేహం కుదిరింది. ఆ స్నేహమే వారిద్దర్నీ ఒకేసారి మృత్యు ఒడికి చేర్చింది. ఆ వివరాలు..
బుధవారం ఉదయం ఏడు గంటల సమయంలో కొత్తూరు తాడేపల్లి రోడ్డులోని నైనవరం ఫ్లై ఓవర్‌పై నుంచి వెళుతున్న ఓ యువకుడికి.. హైదరాబాద్ వెళ్లే రైల్వే ట్రాక్‌పైన 581/5ఏ విద్యుత్ పోల్ వద్ద ఇద్దరు వృద్ధులు అచేతనంగా పడి ఉండడం కనిపించింది. అతను వెంటనే కొత్తపేట పోలీసులకు సమాచారం అందించారు. తొలుత ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులను హత్య చేసి ట్రాక్ పక్కన పడేశారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో వెస్ట్ ఏసీపీ టీ. హరికృష్ణ, కొత్తపేట ఎస్‌ఐ ఈశ్వరరావు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఫ్లై ఓవర్ పి7, పి8 ఫిల్లర్లకు మధ్య నిర్మానుష్య ప్రాంతంలో ఇద్దరు వృద్ధులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. రెండు మృతదేహాలు మూడు, నాలుగు అడుగుల దూరంలో పడి ఉన్నాయి. మృతదేహాలకు సమీపంలో రెండు గ్లాసులు, ఓ పురుగుల మందు డబ్బా, కొన్ని మిరపకాయ బజ్జీలున్నాయి. ఓ మృతదేహం వద్ద చిన్న డైరీ లభించింది. దానిలోని ఓ నంబరుకు పోలీసులు ఫోన్ చేశారు. లంబాడీపేటకు చెందిన ఓ వ్యక్తి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఓ మృతదేహాన్ని గుర్తించారు. చిట్టినగర్‌కు చెందిన తన స్నేహితుడి బాబాయ్ అని చెప్పి వారికి ఫోన్ చేశాడు.
ఈలోగా మృతుని కుమారుడికి ఫోన్ చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల్లో ఒకరు విద్యాధరపురం లేబర్ కాలనీకి చెందిన రావూరి కృష్ణమూర్తిగా, మరొకరు మువ్వలవారి వీధికి చెందిన అర్జా శంకరావు(56)గా తేలింది. శంకరరావు 2011 వరకు అగ్నిమాపక శాఖలో సర్వీస్‌మన్‌గా విధులు నిర్వహించి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. మద్యం అతిగా సేవించే శంకరరావును అతని కుటుంబ సభ్యులు కాస్త దూరంగా ఉంచడంతో తీవ్ర మనోవేదనకు గురవుతుండేవాడని తెలిసింది.
మద్యం అలవాటే శంకరరావుతో కృష్ణమూర్తికి స్నేహం కుదిర్చింది. స్థలాల క్రయవిక్రయాలకు మధ్యవర్తిగా వ్యవహరించే కృష్ణమూర్తికి ఇద్దరు కొడుకులున్నారు. ఆయన భార్య రాజ్యలక్ష్మి కొంతకాలం కిందట మరణించింది. కొడుకుల వద్దే ఉంటున్నాడు. తమ మద్యం వ్యసనం గురించి ఆలోచించలేని ఆ వృద్ధులు.. కుటుంబసభ్యుల నుంచి తమకు తగినంత ఆదరణ లేదనే భావనతోనే ఈ ఆత్మహత్యలకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రైల్వే ఎస్‌ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇద్దరు వృద్ధుల ఆత్మహత్య
Published Thu, Nov 21 2013 1:15 AM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM
Advertisement