vigilance officers Attacks
-
బోగస్ పేర్లతో ఫీజురీయింబర్స్‌మెంట్ స్వాహా
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీల్లో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. డిగ్రీ కళాశాలల్లో పీజీ తరగతులను నిర్వహిస్తున్నవి కొన్ని కాగా... విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులను యూనివర్సిటీలకు చెల్లించకుండా తమ ఖాతాల్లోనే దాచుకున్న కళాశాలలు మరికొన్ని. ఇక అసలు విద్యార్థులు లేకుండానే ఉన్నట్లుగా చూపిస్తూ బోగస్ పేర్లతో ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు కాజేస్తున్న కాలేజీలు మరికొన్ని ఉన్నట్లు ప్రాథమిక విచారణలో అధికారులు గుర్తించినట్లు సమాచారం. ప్రధానంగా ప్రైవేట్ కాలేజీల్లో వసతులతో పాటు రికార్డులను అధికారులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తనిఖీలను మరో రెండు రోజుల్లో పూర్తి చేసి పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించనున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ కాలేజీల్లో జరుగుతున్న ఈ అవకతవకలను అరికట్టేందుకే ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను కాలేజీల ఖాతాల్లో కాకుండా జవాబుదారీతనం, పారదర్శకత కోసం నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకే క్యాంపస్‌లో డిగ్రీ, పీజీ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న తనిఖీల్లో పలు కాలేజీల్లో అవకతవకలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా డిగ్రీ కాలేజీకి అనుమతి పొందిన కొన్నేళ్ల తర్వాత పీజీ కాలేజీకి అనుమతి తీసుకుంటున్నారు. ఒకటో, రెండో తరగతి గదులను పెంచి అదే క్యాంపస్‌లో పీజీ కాలేజీ నిర్వహిస్తున్నారు. ల్యాబ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం లేదు. బోధనా సిబ్బందిని నియమించకుండా డిగ్రీ అధ్యాపకులతోనే సరిపెడుతున్నారు. ప్రత్యేకంగా తరగతి గదులు, ల్యాబ్, స్టాఫ్ ఉన్నారని తప్పుడు పత్రాలు సృష్టించినట్టు విజిలెన్స్ తనిఖీల్లో బయటపడుతున్నాయి. విద్యార్థుల సంఖ్యల్లోనూ తేడాలు కొన్ని కాలేజీలు యూనివర్సిటీకి, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం సమర్పిస్తున్న విద్యార్థుల సంఖ్యకు, వాస్తవ సంఖ్యకు తేడా ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. బినామీ విద్యార్థుల ఫీజులను కాలేజీ యాజమాన్యాలు తమ జేబులో వేసుకుంటున్నట్లు వెల్లడవుతోంది. కొన్ని కాలేజీల్లో ఇలాంటి అవకతవకలు గుర్తించినట్లు సమాచారం. మరోవైపు కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు యూనివర్సిటీలకు ఫీజులు చెల్లించకుండా ఏళ్ల తరబడి తమ వద్దే ఉంచుకుంటున్నాయి. అయితే ఆ ఫీజులను మాత్రం విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నాయి. విశాఖ జిల్లాలోని ఇంజనీరింగ్ కాలేజీ ఏకంగా రూ.10 కోట్ల మేర జేఎన్టీయూ (కాకినాడ)కు చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. -
దేశ వ్యాప్తంగా 150 చోట్ల సీబీఐ సోదాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సుమారు 150 చోట్ల కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రభుత్వ రంగ ఆధ్వర్యంలోని సంస్థల్లో సీబీఐ విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ, జైపూర్, జోధ్‌పూర్, గువాహటి, శ్రీనగర్, షిల్లాంగ్, చండీగఢ్, సిమ్లా, చెన్నై, మదురై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పుణె, గాంధీనగర్, గోవా, భోపాల్, జబల్పూర్, నాగ్‌పూర్, పట్నా, రాంచీ, ఘజియాబాద్, లక్నో, డెహ్రాడూన్లలో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ రంగంలో అవినీతికి ఆస్కారమున్న సంస్థల్లో సోదాలు చేపట్టినట్లు సీబీఐ అధికారులు చెప్పారు. -
పెద్దాపురంలో రైస్ మిల్లుపై..
తూర్పుగోదావరి, పెద్దాపురం: విజిలెన్స్ ఎస్పీ గంగాధర్ ఆదేశాల మేరకు శుక్రవారం విజిలెన్స్ అధికారులు పెద్దాపురం పట్టణంలో అకస్మిక తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ డీఎస్పీ ఎన్వీఎస్ మూర్తి, సీఐ బి.సాయిరమేష్ తహసీల్దార్ గోపాలరావులకు అందిన సమాచారం మేరకు స్థానిక నాగంపేట సమీపంలోని సూర్య రైసుమిల్లులో అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో సుమారు 450 కేజీల అక్రమ రేషన్ బియ్యాన్ని గుర్తించారు. దీంతో మిల్లులో ఉన్న సుమారు రూ.42 లక్షల విలువ గల బియ్యం, ధాన్యంతో పాటు అక్రమ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఆటోను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ సాయి రమేష్ తెలిపారు. మిల్లు అధినేత బి ప్రసాద్‌పై ఆహార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి జేసీ కోర్టుకు తరలించనున్నట్టు ఆయన వెల్లడించారు. -
జీడి పరిశ్రమపై విజి‘లెన్స్’
పలాస, న్యూస్‌లైన్ : ఉన్నట్టుండి ఒక్కసారిగా తమపై విజి‘లెన్స్’ పడటం.. దాడులు చేసి పెద్ద మొత్తంలో జీడిపప్పు నిల్వలు స్వాధీనం చేసుకోవడంతో పలాస జీడి పరిశ్రమ ఉలిక్కిపడింది. దాడుల భయంతో చాలా ఫ్యాక్టరీలు, షాపులు మూతపడ్డాయి. సోమవారం ఉదయం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జీడి పరిశ్రమల కేంద్రమైన పలాసలో దాడులు, సోదాలు జరిపారు. రికార్డుల్లో చూపకుండా నిల్వ చేసిన సుమారు కోటి రూపాయల విలువైన జీడిపప్పును స్వాధీనం చేసుకోవడంతోపాటు ఇద్దరు యజమానులపై కేసులు నమోదు చేశారు. దాడుల విషయం తెలిసి పలువురు వ్యాపారులు దుకాణాలు మూసివేసి వెళ్లిపోయారు. స్థానిక పారిశ్రామికవాడతోపాటు పట్టణంలోని పలు ఫ్యాక్టరీల పై విజిలెన్స్ అధికారులు దాడులు చేసి రికార్డులు, నిల్వలు పరిశీలించారు. రికార్డుల్లో చూపిన లెక్కకు.. వాస్తవంగా ఉన్న నిల్వలకు తేడా ఉన్న రెండు సంస్థలపై కేసులు నమోదు చేశారు. శ్రీనివాసనగర్‌లోని గణేష్ కాష్యూ ఇండస్ట్రీలో రికార్డుల్లో చూపకుండా నిల్వ చేసిన రూ.57,44,987 విలువైన పప్పును స్వాధీనం చేసుకున్నారు. పరిశ్రమ యజమాని బెల్లాల సత్యనారాయణపై కేసు నమోదు చేశారు. అలాగే సీతారామనగర్లోని కన్నన్ కాష్యూ ఇండస్ట్రీపై కూడా ఏకకాలంలో దాడులు చేసి అక్కడ నిల్వ ఉన్న సుమారు రూ.40 లక్షల విలువైన జీడిపప్పును పట్టుకున్నారు. పరిశ్రమ యజమాని మల్లా కాంతారావు నుంచి వివరణ తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో శ్రీకాకుళం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు సీఐ సీహెచ్ ఉమాకాంత్, ఇన్ స్పెక్టర్ ఎల్.రాధమ్మ, డీసీటీవో ఎ.రఘురాం, హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణరావు, రామ్మోహన్రావు, బాబూరావు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్ఐ రాాధమ్మ ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ గణేష్ కాష్యూ ఇండస్ట్రీకి సంబంధించిన నిల్వ ఉన్న పప్పును పరిశీలించామన్నారు. దానికి సంబంధించి ఎటువంటి పత్రాలు లేవన్నారు. యజమాని బెల్లాల సత్యనారాయణను ప్రశ్నించగా ఇన్స్పెక్షన్ కోసం రికార్డులను పంపించామని త్వరలోనే వాటిని అప్పగిస్తామని చెప్పారన్నారు. సరైన రికార్డులు లేనట్లయితే వారి నుంచి అపరాధ రుసుము వసూలు చేస్తామన్నారు.