vigilance ride
-
16 వేల బస్తాల ప్రభుత్వ ధాన్యం మాయం
జగిత్యాల: ప్రభుత్వ సొమ్ము మాయం కావడం సాధారణం. కాకపోతే ఈసారి జగిత్యాలలో ఏకంగా వేల బస్తాల ప్రభుత్వ ధాన్యం మాయమైంది. స్థానిక మండలంలోని తాటిపల్లి శివారులోని శ్రీ రాజరాజేశ్వర రైస్‌మిల్ పై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రభుత్వ ధాన్యం నిల్వలను పరిశీలించారు. ప్రభుత్వానికి చెందిన 22 వేల బస్తాల ధాన్యం మిల్లులో ఉండాల్సింది కానీ.. ప్రస్తుతం మిల్లులో కేవలం 6 వేల బస్తాల ధాన్యం మాత్రమే ఉన్నాయి. కోటి రూపాయల విలువైన 16 వేల బస్తాల ధాన్యం మాయం కావడం పై అధికారులు విచారణ చేపడుతున్నారు. -
గుట్కా తయారీ కేంద్రంపై విజిలెన్స్ దాడులు
ఖమ్మం : ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం బల్లెపల్లి సమీపంలోని గుట్కా తయారీ కేంద్రంపై బుధవారం విజిలెన్స్ అధికారులు దాడి చేశారు.13 మంది వ్యక్తులను అధికారులు అరెస్ట్ చేశారు. అలాగే రూ. 50 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. రెండు వాహనాలను సీజ్ చేశారు. అనంతరం నిందితులను పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అక్రమ లేఔట్లపై చర్యలు
విజయనగరం: విజయనగరం జిల్లా డెంకాడ మండలంలోని పినతాడివాడ, పెదతాడివాడ గ్రామాల్లో ఏర్పాటైన అనధికార లేఔట్లపై విజిలెన్సు అధికారులు కొరడా ఝుళిపించారు. ఈ ప్రాంతాల్లో అనుమతులు లేకుండా పది లేఔట్లు ఏర్పాటైనట్లు వారు బుధవారం గుర్తించారు. మొత్తం లేఔట్లలోని భూమిలో పది శాతం భూమి విలువ రూ.12 కోట్ల 4 లక్షలను వాటి యజమానుల నుంచి జరిమానా రూపంలో వసూలు చేయాలని, సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.1.60 లక్షలు రాబట్టాలని జిల్లా పంచాయతీ అధికారికి నివేదిక అందజేశారు. దీంతో సదరు లేఔట్ల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయటంతోపాటు, నోటీసులు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్చార్జి పంచాయతీ అధికారి రాజకుమారి తెలిపారు. అదే విధంగా జిల్లాలో 189 వరకు అక్రమంగా ఏర్పాటైన లేఔట్లు ఉన్నట్లు గుర్తించామని, వాటిపైనా నోటీసులు జారీ చేయనున్నట్లు చెప్పారు.