విజయనగరం: విజయనగరం జిల్లా డెంకాడ మండలంలోని పినతాడివాడ, పెదతాడివాడ గ్రామాల్లో ఏర్పాటైన అనధికార లేఔట్లపై విజిలెన్సు అధికారులు కొరడా ఝుళిపించారు. ఈ ప్రాంతాల్లో అనుమతులు లేకుండా పది లేఔట్లు ఏర్పాటైనట్లు వారు బుధవారం గుర్తించారు. మొత్తం లేఔట్లలోని భూమిలో పది శాతం భూమి విలువ రూ.12 కోట్ల 4 లక్షలను వాటి యజమానుల నుంచి జరిమానా రూపంలో వసూలు చేయాలని, సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.1.60 లక్షలు రాబట్టాలని జిల్లా పంచాయతీ అధికారికి నివేదిక అందజేశారు.
దీంతో సదరు లేఔట్ల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయటంతోపాటు, నోటీసులు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్‌చార్జి పంచాయతీ అధికారి రాజకుమారి తెలిపారు. అదే విధంగా జిల్లాలో 189 వరకు అక్రమంగా ఏర్పాటైన లేఔట్లు ఉన్నట్లు గుర్తించామని, వాటిపైనా నోటీసులు జారీ చేయనున్నట్లు చెప్పారు.