vijaya diagnosis
-
విజయా డయాగ్నొస్టిక్స్ విస్తరణ ప్రణాళిక
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్యపరీక్షల సేవల సంస్థ విజయా డయాగ్నొస్టిక్స్ ఏటా 8–10 కేంద్రాలను ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో మొత్తం 140 పైచిలుకు డయాగ్నొస్టిక్ సెంటర్స్ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ఉన్నాయి. తమ డయాగ్నొస్టిక్ కేంద్రంలో ఫ్యూజిఫిల్్మకి చెందిన అధునాతన ఓపెన్ ఎంఆర్ఐ మెషీన్‌ను ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సంస్థ సీవోవో శేషాద్రి వాసన్ ఈ విషయాలు తెలిపారు. క్లోజ్డ్గా ఉండే ఎంఆర్ఐతో పోలిస్తే ఓపెన్‌గా ఉండే అపెర్టో లూసెంట్ మెషీన్.. పేషంట్లలో ఆదుర్దాను తగ్గించగలిగేలా ఉంటుందని ఫ్యూజి ఫిల్మ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (హెల్త్‌కేర్ విభాగం) చందర్ శేఖర్ సిబాల్ తెలిపారు. వచ్చే రెండేళ్లలో భారత్‌లోనూ తయారీ, అభివృద్ధి కార్యకలాపాలు ప్రారంభించే యోచనలో కంపెనీ ఉన్నట్లు వివరించారు. ఫ్యూజిఫిల్మ్ ఇండియా ఎండీ కోజీ వాడా తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
విజయ డయాగ్నోస్టిక్స్ లాభం రూ. 28 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో విజయ డయాగ్నోస్టిక్స్ లాభం స్వల్పంగా పెరిగి రూ. 27.7 కోట్లుగా నమోదైంది. గత క్యూ2లో ఇది రూ. 26.4 కోట్లు. మరోవైపు ఆదాయం రూ. 113.1 కోట్ల నుంచి రూ. 112.1 కోట్లుగా నమోదైంది. వార్షిక ప్రాతిపదికన కోవిడ్‌యేతర పరీక్షలపరమైన ఆదాయం 22 శాతం పెరగ్గా, కోవిడ్ టెస్టులపరమైన ఆదాయం (ఆర్టీ–పీసీఆర్, యాంటీబాండీ పరీక్షలు) 70% క్షీణించినట్లు సంస్థ తెలిపింది. ఇటీవలే ఐపీవోకి వచ్చి న విజయ డయాగ్నోస్టిక్స్.. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో కొత్తగా 5 సెంటర్స్ ఏర్పాటు చేసినట్లు సంస్థ సీఈవో సుప్రీతా రెడ్డి తెలిపారు. -
విజయా డయాగ్నోస్టిక్స్ ఐపీవో ఓకే
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ చైన్ విజయా డయాగ్నొస్టిక్స్ పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. ఇష్యూ చివరి రోజు శుక్రవారానికల్లా 4.54 రెట్లు అధికంగా దరఖాస్తులు వచ్చాయి. షేరుకి రూ. 522–531 ధరలో చేపట్టిన ఇష్యూలో భాగంగా 2.5 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచింది. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం 11.36 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. క్విబ్ విభాగంలో 13 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 1.3 రెట్లు, రిటైలర్ల నుంచి 1.1 రెట్లు చొప్పున స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 566 కోట్లు సమీకరించిన సంగతి తెలిసిందే. వెరసి రూ. 1,895 కోట్లు సమకూర్చుకుంది. ఇక స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ అమీ ఆర్గానిక్స్ ఐపీవోకు ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. ఇష్యూకి 64.5 రెట్లు అధిక స్పందన లభించింది. షేరుకి రూ. 603–610 ధరలో చేపట్టిన ఇష్యూలో భాగంగా 65.4 లక్షల షేర్లను ఆఫర్ చేసింది. 42.22 కోట్ల షేర్లకు బిడ్స్ దాఖలయ్యాయి. క్విబ్ కోటా 87 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల విభాగంలో 155 రెట్లు, రిటైలర్ల నుంచి 13 రెట్లు అధిక దరఖాస్తులు వచ్చాయి. -
విజయా డయాగ్నొస్టిక్ ఐపీవో @ రూ. 522–531
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెల్త్‌కేర్ సేవల సంస్థ విజయా డయాగ్నొస్టిక్ సెంటర్ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ సెప్టెంబర్ 1న ప్రారంభమై 3న ముగియనుంది. దీనికి సంబంధించి షేరు ఒక్కింటి ధర శ్రేణిని రూ. 522–531గా సంస్థ నిర్ణయించింది. కనీస బిడ్ లాట్ 28 షేర్లుగా ఉంటుంది. ఈ ఇష్యూ ద్వారా విజయా డయాగ్నోస్టిక్ దాదాపు రూ. 1,895 కోట్లు సమీకరించనుంది. ఆఫర్ ఫర్ సేల్ విధానంలో ఉండే ఈ ఐపీవోలో ప్రమోటరు ఎస్ సురేంద్రనాథ్ రెడ్డితో పాటు ఇన్వెస్టర్లయిన కారకోరం లిమిటెడ్, కేదార క్యాపిటల్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్–కేదార క్యాపిటల్ ఏఐఎఫ్ 1 దాదాపు 3.56 కోట్ల దాకా షేర్లను విక్రయించనున్నాయి. సురేంద్రనాథ్ రెడ్డి 50.98 లక్షల షేర్లు, కారకోరం 2.95 కోట్లు, కేదార క్యాపిటల్ 11.02 లక్షల షేర్లు విక్రయిస్తాయి. దీంతో ప్రమోటర్లు, ప్రస్తుత షేర్‌హోల్డర్ల వాటా 35 శాతం మేర తగ్గనుంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్‌నకు 59.78 శాతం, కారకోరం లిమిటెడ్‌కు 38.56 శాతం, కేదారకు 1.44 శాతం వాటాలు ఉన్నాయి. విస్తరణ ప్రణాళికలు .. ప్రస్తుతం తమకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలతో పాటు కోల్‌కతా, నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో మొత్తం 80 పైచిలుకు డయాగ్నొస్టిక్ సెంటర్లు ఉన్నాయని సంస్థ సీఈవో సుప్రీతా రెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోకి విస్తరించనున్నట్లు వివరించారు. దక్షిణాదిన హైదరాబాద్‌కి 4–5 గంటల ప్రయాణ దూరంలో ఉండే చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు తూర్పున కోల్‌కతా తదితర ప్రాంతాలపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. -
డయాగ్నోస్టిక్ సేవల మార్కెట్ @ 22,000 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మారుతున్న జీవనశైలితో కొత్తకొత్త ఆరోగ్య సమస్యలు పుట్టుకొస్తున్నాయి. మనిషినిబట్టి చికిత్స మారుతోంది. దీంతో వైద్య సేవల రంగంలో ఇప్పుడు రోగ నిర్ధారణ పరీక్షలదే కీలకపాత్ర అయింది. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాలు (డయాగ్నోస్టిక్ సెంటర్లు) ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. ఆసుపత్రుల అవసరాలకు తగ్గట్టుగా మారుతున్న కాలానికి అనుగుణంగా ఇవి నూతన టెక్నాలజీని సొంతం చేసుకుంటున్నాయి. ముందస్తు పరీక్షల పట్ల ప్రజల్లో అవగాహన అంతకంతకూ పెరుగుతుండడం కూడా ల్యాబొరేటరీల విస్తరణకు కారణం అవుతోంది. 70 శాతం ప్రత్యేక పరీక్షల కోసం ఆసుపత్రులు పెద్ద ల్యాబ్‌లపై ఆధారపడుతున్నాయంటే వీటి ప్రత్యేకత అర్థం చేసుకోవచ్చు. రూ.22,000 కోట్ల విలువైన భారత రోగ నిర్ధారణ పరీక్షల విపణిలో క్రమంగా వ్యవస్థీకృత రంగం పైచేయి సాధిస్తోంది. ఇదీ భారత మార్కెట్.. దేశంలో రోగ నిర్ధారణ పరీక్షల మార్కెట్ రూ.22,000 కోట్లుంది. అవ్యవస్థీకృత రంగంలో దేశవ్యాప్తంగా ఒక లక్ష వరకు ల్యాబ్‌లు ఉంటాయని సమాచారం. వ్యవస్థీకృత రంగం వాటా 15 శాతం మాత్రమే. అయినప్పటికీ ఈ విభాగం వృద్ధి రేటు ఏకంగా 22 శాతం ఉంది. ఈ రంగంలో డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్, థైరోకేర్ ఇప్పటికే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. ఇటీవలే లిస్ట్ అయిన మెట్రోపోలిస్ హెల్త్‌కేర్ ఆరు రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయిందంటే పరిశ్రమలో ఉన్న అవకాశాలను అంచనా వేయొచ్చు. ఎస్ఆర్ఎల్ డయాగ్నోస్టిక్స్ 397 కేంద్రాలతో పలు రాష్ట్రాల్లో విస్తరించింది. ఇక ప్రతి రాష్ట్రంలో మూడు నాలుగు పెద్ద కంపెనీలు సేవలు అందిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో టెనెట్, విజయ, ఎల్బిట్ వంటివి ప్రాచుర్యంలో ఉన్నాయి. కీలక పరీక్షల కోసం గతంలో ముంబై, ఢిల్లీ ల్యాబొరేటరీలపై తెలుగు రాష్ట్రాల్లోని ఆసుపత్రులు ఆధారపడేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. ఈ రంగంలో ల్యాబొరేటరీలను అనుసంధానించే అగ్రిగేటర్లూ రంగ ప్రవేశం చేశాయి. మొత్తంగా పరిశ్రమలో రూ.15,000 కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చినట్టు సమాచారం. వ్యవస్థీకృత రంగంవైపు.. మార్కెట్ క్రమంగా వ్యవస్థీకృత రంగంవైపు మళ్లుతోంది. దీనికి కారణం పెద్ద ల్యాబొరేటరీలు నాణ్యత ప్రమాణాలు పాటించడమే. నిపుణులైన వైద్యులు, టెక్నీషియన్లను నియమించుకుంటున్నాయి. ఈ రంగంలో చాలా ల్యాబొరేటరీలకు ఎన్ఏబీఎల్ ధ్రువీకరణ ఉంది. అత్యంత నాణ్యత ప్రమాణాలు పాటించే సంస్థలకే ఈ ధ్రువీకరణ లభిస్తుంది. పైగా వ్యవస్థీకృత రంగ సంస్థలు ఎఫ్‌డీఏ, సీఈ ధ్రువీకరణ ఉన్న మెడికల్ కిట్స్‌నే వినియోగిస్తున్నాయి. ఇక పీసీఆర్, తదుపరి తరం సీక్వెన్సింగ్ టెక్నాలజీ, మల్టీప్లెక్స్ పీసీఆర్, ఎల్సీఎంఎస్ వంటి ఖరీదైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్ద సంస్థలు వినియోగిస్తున్నాయి. ఈ టెక్నాలజీ రాకతో రోగ నిర్ధారణ పరీక్షలు త్వరితగతిన పూర్తి కావడంతోపాటు కచ్చితత్వం ఉంటోంది. ఔషధ పరీక్షలు జరిపే కంపెనీలు పెద్ద ల్యాబొరేటరీల సాయం తీసుకుంటున్నాయి. క్లినికల్ డేటా పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి వైద్య పరిశోధనలకు ల్యాబొరేటరీల్లో ప్రభుత్వం పెట్టుబడి పెట్టాలన్నది కంపెనీల మాట. భవిష్యత్‌లో భారత్ నుంచి.. వైద్య సేవల రంగం మాదిరిగా రోగ నిర్ధారణ పరీక్షల రంగంలో కూడా వచ్చే రెండేళ్లలో భారత్ కేంద్ర బిందువు కానుంది. ఇప్పటికే మధ్యప్రాచ్య దేశాల్లోని ఆసుప్రతుల నుంచి రోగ నిర్ధారణ పరీక్షల కోసం శాంపిళ్లు ముంబై, ఢిల్లీకి వస్తున్నాయి. భవిష్యత్తులో యూరప్ ఆసుపత్రులకు భారత్ సేవలందించే అవకాశాలు ఉన్నాయని టెనెట్ డయాగ్నోస్టిక్స్ చైర్మన్ దేవినేని సురేశ్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘యూరప్‌తో పోలిస్తే ఇక్కడే వ్యయం తక్కువ. ఇప్పటికే అక్కడి నుంచి టెనెట్‌కు ఎంక్వైరీలు వస్తున్నాయి. ఆఫ్రికాకు కూడా భారత్ సేవలు అందించనుంది. వచ్చే అయిదేళ్లలో ఈ పరిశ్రమలో కఠిన నిబంధనలు అమలులోకి వస్తాయి. దీంతో నాణ్యత ప్రమాణాలు పాటించని చిన్న ల్యాబొరేటరీలు దాదాపు కనుమరుగవుతాయి. వ్యవస్థీకృత రంగంలో కాన్సాలిడేషన్ జరుగుతుంది. పోటీ పెరగడంతోపాటు అవకాశాలు అదే స్థాయిలో ఉంటాయి. కొత్త టెక్నాలజీని సొంతం చేసుకునే కంపెనీలే మిగులుతాయి’ అని వివరించారు. -
భవనంపై నుంచి పడి యువతి మృతి
హైదరాబాద్: భవనంపై నుంచి పడి ఓ యువతి మృతి చెందింది. ఈ సంఘటన నగరంలోని అమీర్‌పేట్‌లో గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. విజయా డయాగ్నసిస్‌లో టెక్నిషియన్‌గా పని చేస్తోన్న అరుణ అనే యువతి భవనం పై నుంచి పడి మృతి చెందింది. ఫోన్లో మాట్లాడుతూ ప్రమాదవశాత్తు పై నుంచి జారిపడిందా లేక ఆత్మహత్య చేసుకుందా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు కేరళకు వాసిగా గుర్తించారు.