డయాగ్నోస్టిక్‌ సేవల మార్కెట్‌ @ 22,000 కోట్లు | BASF Plans To Invest Rs 22,000 Crore in Asia Pacific Over Next Five Years | Sakshi
Sakshi News home page

డయాగ్నోస్టిక్‌ సేవల మార్కెట్‌ @ 22,000 కోట్లు

Published Tue, Apr 9 2019 1:08 AM | Last Updated on Tue, Apr 9 2019 1:08 AM

BASF Plans To Invest Rs 22,000 Crore in Asia Pacific Over Next Five Years - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మారుతున్న జీవనశైలితో కొత్తకొత్త ఆరోగ్య సమస్యలు పుట్టుకొస్తున్నాయి. మనిషినిబట్టి చికిత్స మారుతోంది. దీంతో వైద్య సేవల రంగంలో ఇప్పుడు రోగ నిర్ధారణ పరీక్షలదే కీలకపాత్ర అయింది. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాలు (డయాగ్నోస్టిక్‌ సెంటర్లు) ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. ఆసుపత్రుల అవసరాలకు తగ్గట్టుగా మారుతున్న కాలానికి అనుగుణంగా ఇవి నూతన టెక్నాలజీని సొంతం చేసుకుంటున్నాయి. ముందస్తు పరీక్షల పట్ల ప్రజల్లో అవగాహన అంతకంతకూ పెరుగుతుండడం కూడా ల్యాబొరేటరీల విస్తరణకు కారణం అవుతోంది. 70 శాతం ప్రత్యేక పరీక్షల కోసం ఆసుపత్రులు పెద్ద ల్యాబ్‌లపై ఆధారపడుతున్నాయంటే వీటి ప్రత్యేకత అర్థం చేసుకోవచ్చు. రూ.22,000 కోట్ల విలువైన భారత రోగ నిర్ధారణ పరీక్షల విపణిలో క్రమంగా వ్యవస్థీకృత రంగం పైచేయి సాధిస్తోంది.  

ఇదీ భారత మార్కెట్‌..
దేశంలో రోగ నిర్ధారణ పరీక్షల మార్కెట్‌ రూ.22,000 కోట్లుంది. అవ్యవస్థీకృత రంగంలో దేశవ్యాప్తంగా ఒక లక్ష వరకు ల్యాబ్‌లు ఉంటాయని సమాచారం. వ్యవస్థీకృత రంగం వాటా 15 శాతం మాత్రమే. అయినప్పటికీ ఈ విభాగం వృద్ధి రేటు ఏకంగా 22 శాతం ఉంది. ఈ రంగంలో డాక్టర్‌ లాల్‌ పాథ్‌ల్యాబ్స్, థైరోకేర్‌ ఇప్పటికే స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ అయ్యాయి. ఇటీవలే లిస్ట్‌ అయిన మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌ ఆరు రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయిందంటే పరిశ్రమలో ఉన్న అవకాశాలను అంచనా వేయొచ్చు. ఎస్‌ఆర్‌ఎల్‌ డయాగ్నోస్టిక్స్‌ 397 కేంద్రాలతో పలు రాష్ట్రాల్లో విస్తరించింది. ఇక ప్రతి రాష్ట్రంలో మూడు నాలుగు పెద్ద కంపెనీలు సేవలు అందిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో టెనెట్, విజయ, ఎల్బిట్‌ వంటివి ప్రాచుర్యంలో ఉన్నాయి. కీలక పరీక్షల కోసం గతంలో ముంబై, ఢిల్లీ ల్యాబొరేటరీలపై తెలుగు రాష్ట్రాల్లోని ఆసుపత్రులు ఆధారపడేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. ఈ రంగంలో ల్యాబొరేటరీలను అనుసంధానించే అగ్రిగేటర్లూ రంగ ప్రవేశం చేశాయి. మొత్తంగా పరిశ్రమలో రూ.15,000 కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చినట్టు సమాచారం.

వ్యవస్థీకృత రంగంవైపు..
మార్కెట్‌ క్రమంగా వ్యవస్థీకృత రంగంవైపు మళ్లుతోంది. దీనికి కారణం పెద్ద ల్యాబొరేటరీలు నాణ్యత ప్రమాణాలు పాటించడమే. నిపుణులైన వైద్యులు, టెక్నీషియన్లను నియమించుకుంటున్నాయి. ఈ రంగంలో చాలా ల్యాబొరేటరీలకు ఎన్‌ఏబీఎల్‌ ధ్రువీకరణ ఉంది. అత్యంత నాణ్యత ప్రమాణాలు పాటించే సంస్థలకే ఈ ధ్రువీకరణ లభిస్తుంది. పైగా వ్యవస్థీకృత రంగ సంస్థలు ఎఫ్‌డీఏ, సీఈ ధ్రువీకరణ ఉన్న మెడికల్‌ కిట్స్‌నే వినియోగిస్తున్నాయి. ఇక పీసీఆర్, తదుపరి తరం సీక్వెన్సింగ్‌ టెక్నాలజీ, మల్టీప్లెక్స్‌ పీసీఆర్, ఎల్‌సీఎంఎస్‌ వంటి ఖరీదైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్ద సంస్థలు వినియోగిస్తున్నాయి. ఈ టెక్నాలజీ రాకతో రోగ నిర్ధారణ పరీక్షలు త్వరితగతిన పూర్తి కావడంతోపాటు కచ్చితత్వం ఉంటోంది. ఔషధ పరీక్షలు జరిపే కంపెనీలు పెద్ద ల్యాబొరేటరీల సాయం తీసుకుంటున్నాయి. క్లినికల్‌ డేటా పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి వైద్య పరిశోధనలకు ల్యాబొరేటరీల్లో ప్రభుత్వం పెట్టుబడి పెట్టాలన్నది కంపెనీల మాట.

భవిష్యత్‌లో భారత్‌ నుంచి..
వైద్య సేవల రంగం మాదిరిగా రోగ నిర్ధారణ పరీక్షల రంగంలో కూడా వచ్చే రెండేళ్లలో భారత్‌ కేంద్ర బిందువు కానుంది. ఇప్పటికే మధ్యప్రాచ్య దేశాల్లోని ఆసుప్రతుల నుంచి రోగ నిర్ధారణ పరీక్షల కోసం శాంపిళ్లు ముంబై, ఢిల్లీకి వస్తున్నాయి. భవిష్యత్తులో యూరప్‌ ఆసుపత్రులకు భారత్‌ సేవలందించే అవకాశాలు ఉన్నాయని టెనెట్‌ డయాగ్నోస్టిక్స్‌ చైర్మన్‌ దేవినేని సురేశ్‌ సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. ‘యూరప్‌తో పోలిస్తే ఇక్కడే వ్యయం తక్కువ. ఇప్పటికే అక్కడి నుంచి టెనెట్‌కు ఎంక్వైరీలు వస్తున్నాయి. ఆఫ్రికాకు కూడా భారత్‌ సేవలు అందించనుంది. వచ్చే అయిదేళ్లలో ఈ పరిశ్రమలో కఠిన నిబంధనలు అమలులోకి వస్తాయి. దీంతో నాణ్యత ప్రమాణాలు పాటించని చిన్న ల్యాబొరేటరీలు దాదాపు కనుమరుగవుతాయి. వ్యవస్థీకృత రంగంలో కాన్సాలిడేషన్‌ జరుగుతుంది. పోటీ పెరగడంతోపాటు అవకాశాలు అదే స్థాయిలో ఉంటాయి. కొత్త టెక్నాలజీని సొంతం చేసుకునే కంపెనీలే మిగులుతాయి’ అని వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement