Diagnostic centres
-
డయాగ్నస్టిక్ కంపెనీలకు ఇబ్బందే
ముంబై: వ్యాధి నిర్ధారణ సేవల్లోని కంపెనీల (డయాగ్నస్టిక్స్) ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం తగ్గొచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. కరోనా పరీక్షలు గణనీయంగా తగ్గిపోవడం ఆదాయాల క్షీణతకు దారితీస్తుందని పేర్కొంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో కరోనా పరీక్షలు పెద్ద ఎత్తున ఉండడంతో కంపెనీలు ఆదాయంలో 30 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు గుర్తు చేసింది. వైరస్ ప్రభావం క్షీణించడం, స్వయంగా పరీక్షించుకునే కిట్లకు ప్రాధాన్యం ఇస్తుండడం డయాగ్నస్టిక్స్ కంపెనీల ఆదాయాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సంరలో ప్రభావితం చేస్తుందన్నది క్రిసిల్ విశ్లేషణగా ఉంది. ఇక గత ఆర్థిక సంవత్సరం (2021–22)లో కంపెనీల లాభాల మార్జిన్లు దశాబ్ద గరిష్టమైన 28 శాతానికి చేరుకోగా, అవి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) 24–25 శాతానికి పరిమితం కావొచ్చని క్రిసిల్ తెలిపింది. ఆదాయం తగ్గడానికితోడు అధిక నిర్వహణ వ్యయాలు, ప్రకటనలు, మార్కెటింగ్‌పై అధిక వ్యయాలు లాభాల మార్జిన్లపై ప్రభావం చూపిస్తాయని వివరించింది. అయినప్పటికీ మెరుగైన నగదు ప్రవాహాలు, పటిష్ట మూలధన వ్యయ విధానాలు (ఎక్విప్మెంట్ తదితర), రుణ భారం తక్కువగా ఉండడం వంటివి ఈ రంగంలోని కంపెనీల బ్యాలన్స్ షీట్లను ఆరోగ్యంగానే ఉంచుతాయని క్రిసిల్ తన నివేదికలో పేర్కొంది. ఈ రంగంలోని 11 సంస్థల బ్యాలన్స్ షీట్లను క్రిసిల్ విశ్లేషించింది. పెరిగిన పోటీ.. గత ఆర్థిక సంవత్సరంలో కరోనా టెస్ట్‌ల ద్వారా ఆదాయం మొత్తం ఆదాయంలో 20 శాతంగా ఉంటే, అది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమైనట్టు క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేతి తెలిపారు. కాకపోతే ఇతర వ్యాధి నిర్ధారణ పరీక్షల రూపంలో ఆదాయం 12–14 శాతం మేర పెరగడంతో ఈ ప్రభావాన్ని చాలా వరకు అవి అధిగమిస్తాయని చెప్పారు. ఆన్లైన్ ఫార్మసీ సంస్థలు ల్యాబ్ టెస్ట్‌లను కూడా ఆఫర్ చేస్తుండడంతో ఈ రంగంలో పోటీ పెరిగినట్టు క్రిసిల్ వెల్లడించింది. కాకపోతే వైద్యులు సూచించే పరీక్షలకు ఆన్లైన్ సంస్థల నుంచి పోటీ ఉండకపోవచ్చని అభిప్రాయపడింది. ‘‘ఆన్లైన్ సంస్థలు సొంతంగా సదుపాయాలపై పెట్టుబడులు పెట్టుకుండా, స్థానిక వ్యాధి నిర్ధారణ కేంద్రాలతో టైఅప్ పెట్టుకుని కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. దీంతో ఇప్పటికే మార్కెట్లో నిలదొక్కుకున్న సంప్రదాయ డయాగ్నస్టిక్ సంస్థలు డిజిటల్ సదుపాయాలు, రోగి ఇంటికి వెళ్లి నమూనాల సేకరణకు పెట్టుబడులు పెంచాల్సిన పరిస్థితులను కల్పిస్తోంది’’అని క్రిసిల్ నివేదిక వివరించింది. భవిష్యత్తులో మరోసారి కరోనా వైరస్ మరింత తీవ్రరూపం దాల్చడం, ఆన్లైన్ సంస్థల నుంచి పెరిగే పోటీ, మార్కెట్ వాటా పెంచుకోవడాన్ని పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. -
ఎంఎస్ ధోనితో జట్టు కట్టిన న్యూబర్గ్ డయాగ్నాస్టిక్స్
భారతదేశపు నాలుగో అతి పెద్ద రోగనిర్థారరణ సేవల సంస్థ న్యూబర్గ్ డయాగ్నాస్టిక్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంఎస్ ధోని పని చేయనున్నారు. ఈ మేరకు మాజీ ఇండియన్ కెప్టెన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు న్యూబర్గ్ డయాగ్నాస్టిక్స్ ప్రకటించింది. అంబాటు ధరల్లో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందించేందుకు న్యూబర్గ్ చేపట్టిన కార్యక్రమాలు తనకు నచ్చాయన్నారు మాజీ ఇండియన్ స్కిప్పర్ ధోని. కోవిడ్-19 మహమ్మారి కాలంలో అన్ని వయస్సుల వారి ఆరోగ్యం, బాగోగులపై అవగాహన కల్పించేందుకు వారు చేపట్టిన ప్రచారంలో తాను భాగస్వామి అవుతున్నట్టు వెల్లడించారు. న్యూబర్గ్ డయాగ్నాస్టిక్స్ ఛైర్మన్ డాక్టర్ జీఎస్కే వేలు మాట్లాడుతూ ధోని వంటి లెజెండ్ మా ప్రచారకర్తగా, అంతర్జాతీయ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటాన్ని మేము గౌరవంగా భావిస్తామన్నారు. ప్రారంభించిన నాలుగేళ్లలోనే మూడు ఖండాలకు తన వ్యాపారాన్ని విస్తించింది న్యూబెర్గ్ సంస్థ. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.800 కోట్ల రాబడి సాధించింది. వచ్చే ఏడాది వెయ్యికోట్ల ఆదాయం లక్ష్యంగా ముందుకెళ్తోంది. న్యూబెర్గ్‌కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200లకు పైగా ల్యాబులు, 3000లకు పైగా శాంపిల్ కలెక్షన్ సెంటర్లు ఉన్నాయి. -
హైదరాబాద్‌లో ఉచితంగా 57 పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో రక్త, మూత్ర పరీక్షలతో పాటు ఇకపై ఎక్స్ రే, ఈసీజీ, ఆల్ట్రాసౌండ్, రేడియాలజీ పరీక్షలు ఉచితంగా అందనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో 8 తెలంగాణ డయాగ్నస్టిక్స్ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. లాలాపేట, శ్రీరాంనగర్, అంబర్పేట్, బార్కాస్, జంగంపేట, పానీపురా, పురానాపూల్, సీతాఫల్‌మండిల్లో ఉప ముఖ్యమంత్రి, మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, స్థానిక ఎమ్మెల్యేలు ప్రారంభించారు. బస్తీ దవాఖానాల్లో పేదలకు ఉచిత వైద్య పరీక్షల కోసం డయాగ్నొస్టిక్స్ కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నట్లు వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. పేదలు వేలాది రూపాయలు ఖర్చుచేసి వేద్యం చేయించుకునే పరిస్థితి లేదని, వారికి అందుబాటులో ఉండేలా డయాగ్నోస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కేంద్రాల్లో రోగులకు అవసరమైన పరీక్షలు నిర్వహిస్తారని లాలాపేట డయాగ్నొస్టిక్స్ కేంద్రం ప్రారంభోత్సవంలో మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే గాంధీ ఆస్పత్రిలో రూ.35 కోట్లతో అత్యాధునిక కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 57 రకాల పరీక్షలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని శ్రీరామ్‌నగర్‌లో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ కేంద్రాల ఏర్పాటుతో రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని, ఇప్పుడు కొత్తగా ఎంఆర్ఐ, ఆల్ర్టా సౌండ్, సిటీ స్కాన్ వంటి పరీక్షలు కూడా అందుబాటులోకి వస్తాయని మంత్రి కేటీఆర్ వివరించారు. డయాగ్నోస్టిక్ సెంటర్లలో మొత్తం 57 రకాల రక్త పరీక్షలను చేస్తున్నట్లు తెలిపారు. పట్టణ పేదలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. డయాగ్నోస్టిక్ సెంటర్లను భవిష్యత్‌లో జిల్లా కేంద్రాలకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. -
ఆన్లైన్లోనే ఆస్పత్రుల రిజిస్ట్రేషన్
సాక్షి, అమరావతి: ఆస్పత్రులు, డయాగ్నస్టిక్స్ సెంటర్ల రిజిస్ట్రేషన్ విధానాన్ని ఇకపై ఆన్లైన్ చేయనున్నారు. ఎవరైనా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిందే. నాలుగైదు స్థాయిల్లో ఆన్లైన్ దరఖాస్తులను పరిశీలించాక, అంతా పక్కాగా ఉంటేనే ఆమోదం లభిస్తుంది. ఈ నెల 21వ తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ఇప్పటి వరకూ నర్సింగ్‌హోంలు, స్పెషాలిటీ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్స్ సెంటర్లూ ఇవన్నీ జిల్లా వైద్యాధికారుల పర్యవేక్షణలో ఉండేవి. వాటికి రిజిస్ట్రేషన్, రద్దు వంటివి జిల్లా అధికారులే చేసేవారు. ఇకపై ఈ విధానానికి ప్రభుత్వం స్వస్తి పలుకుతోంది. గతంలోలా ఇష్టారాజ్యంగా అనుమతులు తెచ్చుకుని నడిపేందుకు ఇక వీల్లేదు. నర్సింగ్ హోంలుగానీ, డయాగ్నస్టిక్స్ సెంటర్లుగానీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే అవి ఎవరిపేరు మీద ఉన్నాయో వారి వైద్య సర్టిఫికెట్లను రద్దుచేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టు పరిధిలోకి ఆస్పత్రులు రాష్ట్రంలో సుమారు 2,000 వరకు నర్సింగ్ హోంలు, ఆస్పత్రులున్నాయి. వీటి రెన్యువల్‌కు కూడా ఇకపై ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిందే. ప్రతి ఆస్పత్రీ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్‌కు అనుగుణంగా నడుచుకోవాల్సిందే. ► ఇందుకోసం clinicalesstact.ap.go.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ప్రాంతం, డాక్టర్లు, ఎన్ని పడకల వివరాలతో పాటు ఫైర్ ఎన్వోసీ వంటివన్నీ వెబ్‌సైట్‌కు అప్లోడ్ చేయాలి. ► రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఎలాంటి లావాదేవీలైనా ఈ వెబ్సైట్ ద్వారానే జరపాలి. ► దరఖాస్తులను కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయంలో పరిశీలిస్తారు. ► అన్నీ బాగున్నాయనుకుంటే జిల్లా వైద్యాధికారి నేతృత్వంలో ఆస్పత్రి పరిశీలనకు కమిటీని వేస్తారు. ► కమిటీ నివేదికను కూడా ఈ వెబ్‌సైట్‌కే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గర్భస్థ లింగ నిర్ధారణ నిర్మూలన చట్టం పరిధిలోకి డయాగ్నస్టిక్స్ సెంటర్లు.. రాష్ట్రంలో చిన్నవి, పెద్దవి కలిపి 1,000 వరకు డయాగ్నస్టిక్స్ సెంటర్లున్నాయి. ఎంఆర్ఐ, సీటీ స్కాన్, అల్ట్రాసౌండ్ వంటి నిర్ధారణ చేసే సెంటర్లన్నీ గర్భస్థ లింగ నిర్ధారణ నిర్మూలన చట్టం పరిధిలోకొస్తాయి. వీటి రిజిస్ట్రేషన్‌కు pcpndt.ap.gov.in వెబ్‌సైట్‌కు దరఖాస్తు చేసుకోవాలి. -
డయాగ్నోస్టిక్ సేవల మార్కెట్ @ 22,000 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మారుతున్న జీవనశైలితో కొత్తకొత్త ఆరోగ్య సమస్యలు పుట్టుకొస్తున్నాయి. మనిషినిబట్టి చికిత్స మారుతోంది. దీంతో వైద్య సేవల రంగంలో ఇప్పుడు రోగ నిర్ధారణ పరీక్షలదే కీలకపాత్ర అయింది. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాలు (డయాగ్నోస్టిక్ సెంటర్లు) ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. ఆసుపత్రుల అవసరాలకు తగ్గట్టుగా మారుతున్న కాలానికి అనుగుణంగా ఇవి నూతన టెక్నాలజీని సొంతం చేసుకుంటున్నాయి. ముందస్తు పరీక్షల పట్ల ప్రజల్లో అవగాహన అంతకంతకూ పెరుగుతుండడం కూడా ల్యాబొరేటరీల విస్తరణకు కారణం అవుతోంది. 70 శాతం ప్రత్యేక పరీక్షల కోసం ఆసుపత్రులు పెద్ద ల్యాబ్‌లపై ఆధారపడుతున్నాయంటే వీటి ప్రత్యేకత అర్థం చేసుకోవచ్చు. రూ.22,000 కోట్ల విలువైన భారత రోగ నిర్ధారణ పరీక్షల విపణిలో క్రమంగా వ్యవస్థీకృత రంగం పైచేయి సాధిస్తోంది. ఇదీ భారత మార్కెట్.. దేశంలో రోగ నిర్ధారణ పరీక్షల మార్కెట్ రూ.22,000 కోట్లుంది. అవ్యవస్థీకృత రంగంలో దేశవ్యాప్తంగా ఒక లక్ష వరకు ల్యాబ్‌లు ఉంటాయని సమాచారం. వ్యవస్థీకృత రంగం వాటా 15 శాతం మాత్రమే. అయినప్పటికీ ఈ విభాగం వృద్ధి రేటు ఏకంగా 22 శాతం ఉంది. ఈ రంగంలో డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్, థైరోకేర్ ఇప్పటికే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. ఇటీవలే లిస్ట్ అయిన మెట్రోపోలిస్ హెల్త్‌కేర్ ఆరు రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయిందంటే పరిశ్రమలో ఉన్న అవకాశాలను అంచనా వేయొచ్చు. ఎస్ఆర్ఎల్ డయాగ్నోస్టిక్స్ 397 కేంద్రాలతో పలు రాష్ట్రాల్లో విస్తరించింది. ఇక ప్రతి రాష్ట్రంలో మూడు నాలుగు పెద్ద కంపెనీలు సేవలు అందిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో టెనెట్, విజయ, ఎల్బిట్ వంటివి ప్రాచుర్యంలో ఉన్నాయి. కీలక పరీక్షల కోసం గతంలో ముంబై, ఢిల్లీ ల్యాబొరేటరీలపై తెలుగు రాష్ట్రాల్లోని ఆసుపత్రులు ఆధారపడేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. ఈ రంగంలో ల్యాబొరేటరీలను అనుసంధానించే అగ్రిగేటర్లూ రంగ ప్రవేశం చేశాయి. మొత్తంగా పరిశ్రమలో రూ.15,000 కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చినట్టు సమాచారం. వ్యవస్థీకృత రంగంవైపు.. మార్కెట్ క్రమంగా వ్యవస్థీకృత రంగంవైపు మళ్లుతోంది. దీనికి కారణం పెద్ద ల్యాబొరేటరీలు నాణ్యత ప్రమాణాలు పాటించడమే. నిపుణులైన వైద్యులు, టెక్నీషియన్లను నియమించుకుంటున్నాయి. ఈ రంగంలో చాలా ల్యాబొరేటరీలకు ఎన్ఏబీఎల్ ధ్రువీకరణ ఉంది. అత్యంత నాణ్యత ప్రమాణాలు పాటించే సంస్థలకే ఈ ధ్రువీకరణ లభిస్తుంది. పైగా వ్యవస్థీకృత రంగ సంస్థలు ఎఫ్‌డీఏ, సీఈ ధ్రువీకరణ ఉన్న మెడికల్ కిట్స్‌నే వినియోగిస్తున్నాయి. ఇక పీసీఆర్, తదుపరి తరం సీక్వెన్సింగ్ టెక్నాలజీ, మల్టీప్లెక్స్ పీసీఆర్, ఎల్సీఎంఎస్ వంటి ఖరీదైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్ద సంస్థలు వినియోగిస్తున్నాయి. ఈ టెక్నాలజీ రాకతో రోగ నిర్ధారణ పరీక్షలు త్వరితగతిన పూర్తి కావడంతోపాటు కచ్చితత్వం ఉంటోంది. ఔషధ పరీక్షలు జరిపే కంపెనీలు పెద్ద ల్యాబొరేటరీల సాయం తీసుకుంటున్నాయి. క్లినికల్ డేటా పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి వైద్య పరిశోధనలకు ల్యాబొరేటరీల్లో ప్రభుత్వం పెట్టుబడి పెట్టాలన్నది కంపెనీల మాట. భవిష్యత్‌లో భారత్ నుంచి.. వైద్య సేవల రంగం మాదిరిగా రోగ నిర్ధారణ పరీక్షల రంగంలో కూడా వచ్చే రెండేళ్లలో భారత్ కేంద్ర బిందువు కానుంది. ఇప్పటికే మధ్యప్రాచ్య దేశాల్లోని ఆసుప్రతుల నుంచి రోగ నిర్ధారణ పరీక్షల కోసం శాంపిళ్లు ముంబై, ఢిల్లీకి వస్తున్నాయి. భవిష్యత్తులో యూరప్ ఆసుపత్రులకు భారత్ సేవలందించే అవకాశాలు ఉన్నాయని టెనెట్ డయాగ్నోస్టిక్స్ చైర్మన్ దేవినేని సురేశ్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘యూరప్‌తో పోలిస్తే ఇక్కడే వ్యయం తక్కువ. ఇప్పటికే అక్కడి నుంచి టెనెట్‌కు ఎంక్వైరీలు వస్తున్నాయి. ఆఫ్రికాకు కూడా భారత్ సేవలు అందించనుంది. వచ్చే అయిదేళ్లలో ఈ పరిశ్రమలో కఠిన నిబంధనలు అమలులోకి వస్తాయి. దీంతో నాణ్యత ప్రమాణాలు పాటించని చిన్న ల్యాబొరేటరీలు దాదాపు కనుమరుగవుతాయి. వ్యవస్థీకృత రంగంలో కాన్సాలిడేషన్ జరుగుతుంది. పోటీ పెరగడంతోపాటు అవకాశాలు అదే స్థాయిలో ఉంటాయి. కొత్త టెక్నాలజీని సొంతం చేసుకునే కంపెనీలే మిగులుతాయి’ అని వివరించారు. -
డాక్టర్ నంద కిషోర్ అరెస్టు
సాక్షి, హైదరాబాద్ : చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్న ముగ్గురు ఎంబీబీఎస్ డాక్టర్లను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో లోకల్ షీటీంతో కలిసి ఇబ్రహీంపట్నం, మేడిపల్లిలోని రెండు డయాగ్నోస్టిక్ సెంటర్లపై దాడి చేశామని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు. డాక్టర్ నందకిషోర్, మరో ఇద్దరు వైద్యులను అరెస్టు చేశామని తెలిపారు. లింగ నిర్ధారణ పరీక్షల అనంతరం ఆడపిల్ల వద్దనుకునే వారికి అబార్షన్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నారని చెప్పారు. ఆడ సంతానం వద్దనుకునేవారు బలవంతంగా అబార్షన్ చేయించే క్రమంలో గర్భిణీ ప్రాణాల పోయే ప్రమాదం ఉంటుందన్నారు. ఈ ఘటనపై ఇండియన్ మెడికల్ అసోషియేషన్ (ఐంఎంఏ) కు పూర్తి నివేదిక ఇవ్వనున్నామని తెలిపారు. ఐంఎంఏ చట్టంలో పేర్కొన్న విధంగా వైద్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి కృషి జరుగుతోంది
-
ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి కృషి జరుగుతోంది
సాక్షి, హైదరాబాద్ : ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి కృషి జరుగుతోందని గవర్నర్ నరసింహన్ అన్నారు. గురువారం నారాయణ గూడలోని తెలంగాణ డయాగ్నొసిస్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకే చోట అన్ని పరీక్షలు నిర్వహించి 24 గంటల్లో ఫలితాలు ఇచ్చే కేంద్రాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి, అధికారులు చాలా కష్టపడుతున్నారని, బస్తీ దవాఖానాలు బాగా నడుస్తున్నాయని అన్నారు. హెల్త్ ముఖ్యమైన శాఖ కాబట్టే ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నానని తెలిపారు. అన్ని శాఖలపై దృష్టి పెడుతున్నానని అన్నారు. -
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో మరో మైలు రాయి
-
‘ఇక ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అభివృద్దిలో మరో మైలు రాయి నమోదైంది. సామాన్యులకు, పేదలకు వైద్య పరీక్షలు భారం కాకూడదనే ఉద్దేశంతో ఉచితంగా వ్యాధి నిర్దారణ పరీక్షలను ప్రభుత్వమే నిర్వహించాలని భావించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా శనివారం నారాయణగూడలోని ఐపీఎం ఆవరణలో ఉచిత డయాగ్నోస్టిక్స్ సెంటర్‌ను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిలు కలిసి ప్రారంభించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 40 ఉచిత డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెరిగిందని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని పేద వారికి ఉచితంగా వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రతి పదివేల మందికి ఒక బస్తీ దవాఖానా ఏర్పాటు చేసామని మంత్రి వివరించారు. అందులో భాగంగా నగరంలో 17 బస్తీ దవాఖానాలు ప్రారంభించామని మంత్రి పేర్కొన్నారు. మానవీయ కోణంలో వైద్య ఆరోగ్య శాఖ పనిచేస్తుందని, ప్రజలకు నమ్మకం కలిగేలా ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం చేసామని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఆరోగ్య శాఖలో సిబ్బందిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. -
‘టెస్టు’ పాసైతేనే... వైద్యం
ఈశ్వర్ప్రసాద్ హార్ట్ చెకప్ చేయించుకునేందుకు నిమ్స్‌కు వెళ్లాడు.. డాక్టర్ల సలహా మేరకు ఈసీజీ తీయించుకున్నాడు. అంతా నార్మల్‌గా ఉండటంతో హమ్మయ్యఅనుకున్నాడు. అతడి సహోద్యోగి కూడా హార్ట్ చెకప్ చేయించుకుంటానంటేజూబ్లీహిల్స్లోని ఓ హాస్పిటల్‌కు తోడుగా వెళ్లాడు. బిల్లు చూసి గుండె ఆగినంతపనైంది. నిమ్స్‌లో రూ.50లకే ఈసీజీ తీశారు. అక్కడ మాత్రం రూ.450 బిల్లు వేశారు. కేవలం నాలుగైదు కిలోమీటర్ల తేడాతో బిల్లు మాత్రం దాదాపు 10 రెట్లుపెరగడంతో అతడిలో ఆందోళన కలిగింది. సరే పరికరాల్లో ఏదైనా తేడా ఉందా అంటే అదీ లేదు.. ఇలాంటి ఘటనలు నగరంలో కోకొల్లలు.. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న డయాగ్నోస్టిక్ సంస్థలు.. కార్పొరేట్ పేరుతో హాస్పిటళ్లు ఇష్టానుసారంగా బిల్లులు వసూలు చేస్తూ రోగులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: ఓ సాధారణ డయాగ్నొస్టిక్స్‌లో కంప్లీట్ బ్లడ్ పిక్చర్(సీబీపీ)కి రూ.150–200 ఖర్చు అవుతుంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఇదే పరీక్షకు రూ.700 పైగా వసూలు చేస్తున్నారు. చెస్ట్ ఎక్సరేకు బయట రూ.350 ఖర్చు అవుతుండగా, కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.500 వరకు వసూలు చేస్తున్నారు. తెల్లరేషన్ కార్డులేని రోగులకు గాంధీలో ఎంఆర్ఐ బ్రెయిన్ టెస్ట్‌కు రూ.2,000 ఛార్జీ చేస్తుండగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.8,500 నుంచి 12,000 వరకు వసూలు చేస్తున్నారు. పదేళ్లతో పోలిస్తే నగరంలో ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్ల సంఖ్యతో పాటు సాంకేతిక పరిజ్ఞానం కూడా పెరిగింది. అదేస్థాయిలో ఆయా టెస్టుల కోసం ఉపయోగించే మెషినరీ ధరలు కూడా భారీగా తగ్గాయి. అయితే వైద్య పరీక్షల ఖర్చులు తగ్గక పోగా, భారీగా పెరగడాన్ని పరిశీలిస్తే రోగ నిర్ధారణ పేరుతో కార్పొరేట్ ఆస్పత్రులు ఏ స్థాయిలో దోపిడీకి పాల్పడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒకే టెస్టు, ఒకే కంపెనీ మెషిన్, కానీ రోగ నిర్ధారణ పరీక్షల పేరుతో ఆస్పత్రులు వసూలు చేస్తున్న ఛార్జీల్లో మాత్రం భారీ వ్యత్యాసం కనిపిస్తుండటం గమనార్హం. నగరంలోని పలు కార్పొరేట్ ఆస్పత్రులు అందులో పనిచేసే వైద్యులకు టార్గెట్లు విధిస్తుండటంతో వారు అవసరం లేక పోయినా రోగనిర్ధారణ పరీక్షలు రాస్తున్నారు. సాధారణ జ్వరంతో బాధపడుతున్న రోగికి సీబీపీ, సీయూఎస్, ప్లేట్లెట్స్ కౌంట్ టెస్టులతో పాటు జబ్బుతో సంబంధం లేని పరీక్షలు రాస్తున్నారు. డాక్టర్ వద్దకు వెళ్లి సమస్య చెప్పగానే ముందుగా టెస్టులు చేయాలంటున్నారు. ఆ రిపోర్ట్ చూసిన తర్వాతే మందులు రాస్తున్నారు. ‘నేను కొంతకాలంగా ఛాతిలో మంట, గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నాను. పంజాగుట్టలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్తే.. అక్కడి వైద్యులు ఎండోస్కోపి, కొలనోస్కోపితో పాటు సమస్యతో సంబంధం లేని సీబీపీ, సీయూపీ, ఈసీజీ, టుడిఎకో వంటి టెస్టులన్నీ రాశారు. వైద్యులు సిఫార్సు చేశారు కదా! అని ఆయా పరీక్షలన్నీ చేయించుకుని రిపోర్టులు తీసుకెళ్లి సంబంధిత వైద్యుడికి చూపిస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మసాలా ఫుడ్ తగ్గిస్తే సరిపోతుంది’ అని చెప్పి పంపారని బంజారాహిల్స్‌కు చెందిన రఘురామ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నాకు ఇటీవల మోకాళ్ల నొప్పులు ఎక్కువయ్యాయి. సికింద్రాబాద్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్తే స్పైన్ ఎక్సరే, సిటీస్కాన్, ఎంఆర్ఐ వంటి టెస్టులన్నీ రాసి రూ.50 వేలకుపైగా బిల్లు వేసి చేతి ఇచ్చారు. పరీక్షలన్నీ చేయించుకుని రిపోర్టులు తీసుకుని వైద్యుడి వద్దకు వెళ్తే ఏ సమస్య లేదు’ అని చెప్పి పంపాడు’ అని నల్లగొండకు చెందిన రవీందర్‌రెడ్డి పేర్కొన్నాడు. ‘రోగుల ఆర్థిక పరిస్థితి చూస్తే జాలేస్తుంది. కానీ మేం మాత్రం ఏమి చేయగలం. ఆస్పత్రిలో వేతనం తీసుకుంటున్నందుకు యాజమాన్యం చెప్పినట్లు వినాల్సి వస్తోంది. అవసరం లేకపోయినా ఆస్పత్రి అవసరాల దృష్ట్యా రోగ నిర్ధారణ పరీక్షలు రాయాల్సి వస్తోంది. లేదంటే వైద్యులకూ పనిష్మెంట్లు తప్పడం లేదు’ అని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ సీనియర్ కార్డియాలజిస్ట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత సేవలకు తిలోదకాలు.. రోగ నిర్ధారణలో కీలకమైన ఎంఆర్ఐ, సిటీస్కాన్, ఆల్ట్రాసౌండ్, ఎండోస్కోపి, కొలనోస్కోపి, ఎక్సరే, తదితర మిషన్లలో చాలా వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. ప్రభుత్వం వీటికి రాయితీ కూడా ఇస్తోంది. మెషిన్లపై ప్రభుత్వం నుంచి రాయితీ పొందినందుకు ఒప్పందం ప్రకారం ఆస్పత్రుల్లో 20 శాతం ఉచిత సేవలు అందించాల్సి ఉండగా, నగరంలోని ఏ ఆస్పత్రి కూడా ఈ నిబంధనలు పాటించడం లేదు. చివరకు వైద్య సేవల పేరుతో ఆస్పత్రులు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం నుంచి ఖరీదైన భూములు పొందిన వైద్యులు సైతం వీటిని అమలు చేయడం లేదంటే ఆశ్చర్యం కలగకమానదు. వీధి చివరలోని డయాగ్నోస్టిక్ సెంటర్లోనూ.. ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ ఒకే కంపెనీకి చెందిన ఎంఆర్ఐ, సిటీస్కాన్, ఆల్ట్రాసౌండ్, ఎక్సరే యంత్రాలు ఉన్నా... టెస్టుల పేరుతో అవి వసూలు చేస్తున్న ఛార్జీల్లో మాత్రం భారీ వ్యత్యాసం కనిపిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెరుగుతున్న ఈ రోగ నిర్ధారణ ఖర్చులను ఎప్పటికప్పుడు నియంత్రించాల్సిన ప్రభుత్వం వీటిని పట్టించుకున్న దాఖలాలు మచ్చుకైనా కన్పించడం లేదు. -
అనుమతుల్లేని ఆస్పత్రులపై కొరడా
తూప్రాన్, న్యూస్‌లైన్: ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఆసుపత్రులు, క్లినిక్‌లు, డయాగ్నిస్టిక్ సెంటర్లపై జిల్లా ఆరోగ్యా శాఖ అధికారిణి పద్మ శుక్రవారం కొరడా ఝళిపించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎనిమిది ఆసుపత్రులు, రెండు డయాగ్నిస్టిక్ సెంటర్లను సీజ్ చేశారు. వివరాలు... తూప్రాన్ పట్టణ కేంద్రంలో గల్లికో ఆసుపత్రి వివిధ పేర్లతో కొనసాగుతోంది. అర్హత లేని వైద్యులు పరీక్షలు నిర్వహించడంతో పాటు ఏకంగా ఆపరేషన్లు చేసేస్తున్నారు. గతంలో తూప్రాన్‌లో ఓ ఆసుపత్రి వైద్యురాలు డెలవరి నిర్వహించి తల్లి, బిడ్డ మృతికి కారకురాలు కావడంతో బంధువులు ఆందోళనకు దిగడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్యాధికారులు స్పందించి ఆసుపత్రిని సీజ్ చేశారు. అయినా ఆసుపత్రి నిర్వాహకులు నిబంధనలు పాటించాలన్న కనీస ధర్మం మరిచి కేవలం డబ్బులు సంపాదించాలన్న లక్ష్యంతో పేద రోగులతో చెలగాటం ఆడుతున్నారు. దీనిపై పట్టణ బాధితులు ఫోన్ ద్వారా జిల్లా వైద్యాధికారి పద్మకు ఫిర్యాదు చేయడంతో స్పందించి ఆమె శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పట్టణంలోని పలు ఆసుపత్రులను తనిఖీ చేశారు. ఇందులో పోతరాజుపల్లిలోని కేజీఎస్ నర్సింగ్ హోంకు ఎలాంటి అనుమతులు లేకుండా ఆపరేషన్లు నిర్వహించడంతో సీజ్ చేశారు. అలాగే నర్సాపూర్ చౌరస్తా వద్ద ఉన్న శ్రీగీతా నర్సింగ్ హోం, మహాలక్ష్మి నర్సింగ్ హోం, రాఘవేంద్ర ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్, సుష్మ ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్, దేవి నర్సింగ్ హోంలోని ఆపరేషన్ థియేటర్, శివసాయి భవాని ఆసుపత్రి, సాయి కృపా క్లినిక్‌లను సీజ్ చేసి షోకాజ్ నోటీసులు అందజేశారు. అలాగే శ్రీకాంత్ చిల్డ్రన్ ఆసుపత్రికి, శ్రీ సాయి కృష్ణ తూప్రాన్ నర్సింగ్ హోంకు అనుమతుల కాల పరిమితి ముగిసిందన్నారు. వెంటనే అనుమతులు పొందాలన్నారు. లేనట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. శ్రీలక్ష్మి డయాగ్నిస్టిక్ సెంటర్‌కు అనుమతులు లేని కారణంగా సీజ్ చేశారు. ఆశాజ్యోతి డయాగ్నిస్టిక్ సెంటర్‌కు కేవలం అల్ట్రాసౌండ్కు మాత్రమే అనుమతులు ఉండగా ఎక్స్‌రే, ల్యాబ్ నిర్వహిస్తున్న కారణంగా సీజ్ చేసి నోటీసులు అందించామన్నారు. అనుమతులు లేకుండా కొనసాగిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చారించారు. ఈ దాడుల్లో జిల్లా వైద్యాధికారి వెంట గజ్వేల్ క్లాస్టర్ అధికారి సేల్వియా, యూడీసీ ప్రేంసాగర్, వైద్యులు సాధన, కృష్ణప్రియ, పార్వతి తదితరులు పాల్గొన్నారు. -
తనిఖీలు చేస్తే చంపేస్తాం
అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రం, ఇతర ప్రాంతాల్లోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజల పాలిట జలగల్లా మారాయి. చిన్న జబ్బులకు.. ఉన్నవీ లేనివీ కల్పించి వేలకు వేలు.. లక్షల రూపాయలు లాగుతున్నాయి. దిగువ మధ్య తరగతి ప్రజలు ఈ ఆస్పత్రుల బారిన పడి ఆస్తులు తెగనమ్ముని అప్పులపాలవుతున్నారు. కొన్ని ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్ల యాజమాన్యాలు పరస్పర ఒప్పందంతో నిబంధనలు ఉల్లంఘిస్తూ మాఫియాగా మారాయి. వీరిని ప్రశ్నించే నాథుడే లేడు. ఎవరైనా రోగి తాలూకు బంధువులు ప్రశ్నిస్తే.. ఇష్టం ఉంటే చూపించుకోండి.. లేదంటే వెళ్లిపోండంటూ గద్దిస్తున్నారు. ఈ మాఫియా ఆస్పత్రుల యాజమాన్యాలకు జడిసి ఇన్నాళ్లూ ఏ అధికారీ వాటి జోలికి వెళ్లిన పాపానపోలేదు. ఇటీవల ఆడ పిల్లల జనన రేటును పెంచేందు కోసం పీసీపీఎన్డీటీ (ప్రి కన్సెప్షన్ అండ్ ప్రి నేటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్) చట్టం పకడ్బందీగా అమలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఆదేశాలు రావడంతో డీఎంఅండ్‌హెచ్‌ఓ సి.ఆర్.రామసుబ్బారావు అడపాదడపా తనిఖీలకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో 127 స్కానింగ్ సెంటర్లుండగా, ఇప్పటి వరకు 10 సెంటర్లను తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్, రికార్డులు, అర్హతకలిగిన టెక్నీషియన్లు లేకపోతే చర్యలు తీసుకుంటామని పదేపదే చెబుతున్నారు. ఇందులో భాగంగానే గురువారం ఆయన అనంతపురం కోర్టు రోడ్డులో ఉంటున్న ఓ ఆస్పత్రిని తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుందని తేల్చి.. ఆ ఆస్పత్రిలోని స్కానింగ్ సెంటర్‌ను సీజ్ చేశారు. ఆ సందర్భంగా డీఎంఅండ్‌హెచ్‌ఓ, ఆస్పత్రి యాజమాన్యానికి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో తనను లారీతో తొక్కించి చంపుతామని బెదిరింపు వచ్చిందని శనివారం విలేకరుల సమావేశంలో డీఎంఅండ్హెచ్ఒ వెల్లడించడం కలకలం రేపింది. ఆయన్ను బెదిరించిన వారెవరనేది ఆయన చెప్పనప్పటికీ.. జరిగిన పరిణామం చూస్తుంటే ఆస్పత్రుల మాఫియా ఆగడంగా తెలుస్తోంది. జిల్లాలో పలు ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లు, ల్యాబ్‌ల యజమానులు ఓ టెక్నీషియన్(చాలా చోట్ల క్వాలిఫైడ్ కాదు)ను పెట్టుకుని సెంటర్‌ను నడిపిస్తూ ప్రజల నుంచి ఇష్టారాజ్యంగా డబ్బులు పిండుకుంటున్నారు. వైద్యుడి సిఫార్సు లేకుండానే స్కానింగ్‌లు చేస్తున్నారు. దీనికి తోడు వైద్య పరీక్షలు, చికిత్సల ధరల పట్టికను ప్రదర్శించడం లేదు. వైద్యులు తమ సర్టిఫికెట్లను ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచడం లేదు. కొంత మంది వైద్యులు అవసరానికి మించి టెస్ట్‌లు రాస్తున్నారు. అనంతపురంలోని కొన్ని డయాగ్నస్టిక్ సెంటర్లు, నర్సింగ్ హోమ్‌ల యాజమాన్యాలు జిల్లాకు చెందిన ఓ మంత్రి అండదండలతో పేట్రేగిపోతూ రోగుల నడ్డివిరుస్తున్నాయి. నగర నడిబొడ్డున ఉన్న ఓ డయాగ్నస్టిక్ సెంటర్, కోర్డు రోడ్డులోని ఓ ఆస్పత్రి, కమలానగర్, సాయినగర్‌లోని పలు ఆస్పత్రుల్లో నిబంధనలు పాటించని దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా చోట్ల నిబంధనలకు విరుద్దంగా సెల్లార్లోనే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. డొకాయ్ ఆపరేషన్స చేపడుతాం పీసీపీఎన్డీటీ చట్టాన్ని మొదటి ఏడాది అతిక్రమిస్తే మూడేళ్ల జైలు శిక్ష తో పాటు రూ 10వేలు జరిమానా విధిస్తాం. రెండోసారి తప్పుచేస్తే ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 50వేల జరిమానా ఉంటుంది. పదే పదే చట్టాన్ని అతిక్రమిస్తే వైద్య మండలి నుంచే తొలగించే అవకాశం ఉంది. స్కానింగ్ సెంటర్లపై ‘డొకాయ్ ఆపరేషన్స్’ చేపడుతాం. మా శాఖ సిబ్బందిని స్కానింగ్ సెంటర్లకు పంపి లింగ నిర్ధారణ చేయాలని అడుగుతాం. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే జైలు తప్పదు. అన్ని స్కానింగ్ సెంటర్లపై త్వరలోనే దాడులు చేపడతాం. రక్తనిధి కేంద్రాలలో సంబంధిత వైద్యులు లేకపోతే అరెస్టుకు సిఫార్సు చేస్తాం. దేశ వ్యాప్తంగా ప్రతి వెయ్యి మంది పురుషులకు 917 మంది మహిళలు, రాష్ట్ర వ్యాప్తంగా 943 మంది, జిల్లా వ్యాప్తంగా 927 మంది మహిళలు ఉన్నారన్నారు. అనేక చోట్ల లింగ నిర్ధారణలో ఆడపిల్ల అని తెలియడంతో అబార్షన్ చేయించుకుంటున్నారని, అందుకు ఫుల్‌స్టాఫ్ పెట్టాలనేదే ప్రభుత్వ ధ్యేయం. ఇందుకు ఎవరి బెదిరింపులు ఖాతరు చేయం. రెవెన్యూ, పోలీసు, న్యాయ శాఖ సహకారంతో ముందుకెళ్తాం. - సి.ఆర్.రామసుబ్బారావు, డీఎంఅండ్‌హెచ్‌ఓ