తూప్రాన్, న్యూస్‌లైన్: ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఆసుపత్రులు, క్లినిక్‌లు, డయాగ్నిస్టిక్ సెంటర్లపై జిల్లా ఆరోగ్యా శాఖ అధికారిణి పద్మ శుక్రవారం కొరడా ఝళిపించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎనిమిది ఆసుపత్రులు, రెండు డయాగ్నిస్టిక్ సెంటర్లను సీజ్ చేశారు. వివరాలు... తూప్రాన్ పట్టణ కేంద్రంలో గల్లికో ఆసుపత్రి వివిధ పేర్లతో కొనసాగుతోంది. అర్హత లేని వైద్యులు పరీక్షలు నిర్వహించడంతో పాటు ఏకంగా ఆపరేషన్లు చేసేస్తున్నారు. గతంలో తూప్రాన్‌లో ఓ ఆసుపత్రి వైద్యురాలు డెలవరి నిర్వహించి తల్లి, బిడ్డ మృతికి కారకురాలు కావడంతో బంధువులు ఆందోళనకు దిగడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
వైద్యాధికారులు స్పందించి ఆసుపత్రిని సీజ్ చేశారు. అయినా ఆసుపత్రి నిర్వాహకులు నిబంధనలు పాటించాలన్న కనీస ధర్మం మరిచి కేవలం డబ్బులు సంపాదించాలన్న లక్ష్యంతో పేద రోగులతో చెలగాటం ఆడుతున్నారు. దీనిపై పట్టణ బాధితులు ఫోన్ ద్వారా జిల్లా వైద్యాధికారి పద్మకు ఫిర్యాదు చేయడంతో స్పందించి ఆమె శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పట్టణంలోని పలు ఆసుపత్రులను తనిఖీ చేశారు. ఇందులో పోతరాజుపల్లిలోని కేజీఎస్ నర్సింగ్ హోంకు ఎలాంటి అనుమతులు లేకుండా ఆపరేషన్లు నిర్వహించడంతో సీజ్ చేశారు. అలాగే నర్సాపూర్ చౌరస్తా వద్ద ఉన్న శ్రీగీతా నర్సింగ్ హోం, మహాలక్ష్మి నర్సింగ్ హోం, రాఘవేంద్ర ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్, సుష్మ ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్, దేవి నర్సింగ్ హోంలోని ఆపరేషన్ థియేటర్, శివసాయి భవాని ఆసుపత్రి, సాయి కృపా క్లినిక్‌లను సీజ్ చేసి షోకాజ్ నోటీసులు అందజేశారు. అలాగే శ్రీకాంత్ చిల్డ్రన్ ఆసుపత్రికి, శ్రీ సాయి కృష్ణ తూప్రాన్ నర్సింగ్ హోంకు అనుమతుల కాల పరిమితి ముగిసిందన్నారు. వెంటనే అనుమతులు పొందాలన్నారు.
లేనట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. శ్రీలక్ష్మి డయాగ్నిస్టిక్ సెంటర్‌కు అనుమతులు లేని కారణంగా సీజ్ చేశారు. ఆశాజ్యోతి డయాగ్నిస్టిక్ సెంటర్‌కు కేవలం అల్ట్రాసౌండ్‌కు మాత్రమే అనుమతులు ఉండగా ఎక్స్‌రే, ల్యాబ్ నిర్వహిస్తున్న కారణంగా సీజ్ చేసి నోటీసులు అందించామన్నారు. అనుమతులు లేకుండా కొనసాగిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చారించారు. ఈ దాడుల్లో జిల్లా వైద్యాధికారి వెంట గజ్వేల్ క్లాస్టర్ అధికారి సేల్వియా, యూడీసీ ప్రేంసాగర్, వైద్యులు సాధన, కృష్ణప్రియ, పార్వతి తదితరులు పాల్గొన్నారు.
అనుమతుల్లేని ఆస్పత్రులపై కొరడా
Published Fri, Jun 6 2014 11:42 PM | Last Updated on Sat, Sep 2 2017 8:24 AM
Advertisement
Advertisement