అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రం, ఇతర ప్రాంతాల్లోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజల పాలిట జలగల్లా మారాయి. చిన్న జబ్బులకు.. ఉన్నవీ లేనివీ కల్పించి వేలకు వేలు.. లక్షల రూపాయలు లాగుతున్నాయి. దిగువ మధ్య తరగతి ప్రజలు ఈ ఆస్పత్రుల బారిన పడి ఆస్తులు తెగనమ్ముని అప్పులపాలవుతున్నారు. కొన్ని ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్ల యాజమాన్యాలు పరస్పర ఒప్పందంతో నిబంధనలు ఉల్లంఘిస్తూ మాఫియాగా మారాయి. వీరిని ప్రశ్నించే నాథుడే లేడు.
ఎవరైనా రోగి తాలూకు బంధువులు ప్రశ్నిస్తే.. ఇష్టం ఉంటే చూపించుకోండి.. లేదంటే వెళ్లిపోండంటూ గద్దిస్తున్నారు. ఈ మాఫియా ఆస్పత్రుల యాజమాన్యాలకు జడిసి ఇన్నాళ్లూ ఏ అధికారీ వాటి జోలికి వెళ్లిన పాపానపోలేదు. ఇటీవల ఆడ పిల్లల జనన రేటును పెంచేందు కోసం పీసీపీఎన్‌డీటీ (ప్రి కన్సెప్షన్ అండ్ ప్రి నేటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్) చట్టం పకడ్బందీగా అమలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఆదేశాలు రావడంతో డీఎంఅండ్‌హెచ్‌ఓ సి.ఆర్.రామసుబ్బారావు అడపాదడపా తనిఖీలకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో 127 స్కానింగ్ సెంటర్లుండగా, ఇప్పటి వరకు 10 సెంటర్లను తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్, రికార్డులు, అర్హతకలిగిన టెక్నీషియన్లు లేకపోతే చర్యలు తీసుకుంటామని పదేపదే చెబుతున్నారు.
ఇందులో భాగంగానే గురువారం ఆయన అనంతపురం కోర్టు రోడ్డులో ఉంటున్న ఓ ఆస్పత్రిని తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుందని తేల్చి.. ఆ ఆస్పత్రిలోని స్కానింగ్ సెంటర్‌ను సీజ్ చేశారు. ఆ సందర్భంగా డీఎంఅండ్‌హెచ్‌ఓ, ఆస్పత్రి యాజమాన్యానికి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో తనను లారీతో తొక్కించి చంపుతామని బెదిరింపు వచ్చిందని శనివారం విలేకరుల సమావేశంలో డీఎంఅండ్‌హెచ్‌ఒ వెల్లడించడం కలకలం రేపింది. ఆయన్ను బెదిరించిన వారెవరనేది ఆయన చెప్పనప్పటికీ.. జరిగిన పరిణామం చూస్తుంటే ఆస్పత్రుల మాఫియా ఆగడంగా తెలుస్తోంది. జిల్లాలో పలు ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లు, ల్యాబ్‌ల యజమానులు ఓ టెక్నీషియన్(చాలా చోట్ల క్వాలిఫైడ్ కాదు)ను పెట్టుకుని సెంటర్‌ను నడిపిస్తూ ప్రజల నుంచి ఇష్టారాజ్యంగా డబ్బులు పిండుకుంటున్నారు.
వైద్యుడి సిఫార్సు లేకుండానే స్కానింగ్‌లు చేస్తున్నారు. దీనికి తోడు వైద్య పరీక్షలు, చికిత్సల ధరల పట్టికను ప్రదర్శించడం లేదు. వైద్యులు తమ సర్టిఫికెట్లను ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచడం లేదు. కొంత మంది వైద్యులు అవసరానికి మించి టెస్ట్‌లు రాస్తున్నారు. అనంతపురంలోని కొన్ని డయాగ్నస్టిక్ సెంటర్లు, నర్సింగ్ హోమ్‌ల యాజమాన్యాలు జిల్లాకు చెందిన ఓ మంత్రి అండదండలతో పేట్రేగిపోతూ రోగుల నడ్డివిరుస్తున్నాయి. నగర నడిబొడ్డున ఉన్న ఓ డయాగ్నస్టిక్ సెంటర్, కోర్డు రోడ్డులోని ఓ ఆస్పత్రి, కమలానగర్, సాయినగర్‌లోని పలు ఆస్పత్రుల్లో నిబంధనలు పాటించని దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా చోట్ల నిబంధనలకు విరుద్దంగా సెల్లార్‌లోనే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
డొకాయ్ ఆపరేషన్‌స చేపడుతాం
పీసీపీఎన్‌డీటీ చట్టాన్ని మొదటి ఏడాది అతిక్రమిస్తే మూడేళ్ల జైలు శిక్ష తో పాటు రూ 10వేలు జరిమానా విధిస్తాం. రెండోసారి తప్పుచేస్తే ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 50వేల జరిమానా ఉంటుంది. పదే పదే చట్టాన్ని అతిక్రమిస్తే వైద్య మండలి నుంచే తొలగించే అవకాశం ఉంది. స్కానింగ్ సెంటర్లపై ‘డొకాయ్ ఆపరేషన్స్’ చేపడుతాం. మా శాఖ సిబ్బందిని స్కానింగ్ సెంటర్లకు పంపి లింగ నిర్ధారణ చేయాలని అడుగుతాం. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే జైలు తప్పదు. అన్ని స్కానింగ్ సెంటర్లపై త్వరలోనే దాడులు చేపడతాం. రక్తనిధి కేంద్రాలలో సంబంధిత వైద్యులు లేకపోతే అరెస్టుకు సిఫార్సు చేస్తాం.
దేశ వ్యాప్తంగా ప్రతి వెయ్యి మంది పురుషులకు 917 మంది మహిళలు, రాష్ట్ర వ్యాప్తంగా 943 మంది, జిల్లా వ్యాప్తంగా 927 మంది మహిళలు ఉన్నారన్నారు. అనేక చోట్ల లింగ నిర్ధారణలో ఆడపిల్ల అని తెలియడంతో అబార్షన్ చేయించుకుంటున్నారని, అందుకు ఫుల్‌స్టాఫ్ పెట్టాలనేదే ప్రభుత్వ ధ్యేయం. ఇందుకు ఎవరి బెదిరింపులు ఖాతరు చేయం. రెవెన్యూ, పోలీసు, న్యాయ శాఖ సహకారంతో ముందుకెళ్తాం.
- సి.ఆర్.రామసుబ్బారావు, డీఎంఅండ్‌హెచ్‌ఓ
తనిఖీలు చేస్తే చంపేస్తాం
Published Sun, Jan 5 2014 2:51 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement