vijayada
-
విజయవాడలో భారీ దోపిడీ
► 7 కిలోల బంగారు నగల అపహరణ ►నగల కార్ఖానాపై ఆగంతకుల దాడి ►కత్తులు, తుపాకులతో కార్మికులను బెదిరించిన దుండగులు ►దోపిడీలో పాల్గొన్న10 నుంచి 12 మంది యువకులు ►కారులో పారిపోయిన దొంగలు బస్టేషన్ (విజయవాడ తూర్పు) : విజయవాడలో భారీ దోపిడీ జరిగింది. బంగారు నగలు తయారుచేసే కార్ఖానాలోకి తుపాకులు, కత్తులతో చొరబడిన ఆగంతకులు సుమారు ఏడు కిలోల నగలు దోచుకెళ్లారు. ఈ ఘటన విజయవాడ గవర్నరుపేట గోపాలరెడ్డి వీధిలో మంగళవారం రాత్రి పది గంటల సమయంలో జరిగింది. బాధితుల కథనం మేరకు వివరాలు.. బెంగాల్‌కు చెందిన శంకర్ మన్నా గవర్నరుపేట గోపాలరెడ్డి వీధిలోని రెండంతస్తుల భవనంలోని మొదటి అంతస్తులో బంగారు నగలు తయారుచేసే కార్ఖానా నిర్వహిస్తున్నారు. మూడు గదుల్లో నడుస్తున్న ఆ కార్ఖానాలో 30 మంది పనిచేస్తుంటారు. వారంతా బెంగాల్‌కు చెందినవారే. మంగళవారం రాత్రి పది గంటల సమయంలో కార్మికులు నగలు తయారుచేస్తుండగా 10 నుంచి 12 మంది ఆగంతకులు తుపాకులు, కత్తులతో లోనికి చొరబడ్డారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులను ఒకచోటకు చేర్చి చేతులు పైకెత్తించి కూర్చోవాలని ఆదేశించారు. వారు అలా చేయగానే అక్కడ ఉన్న సుమారు ఏడు కిలోల నగలను బ్యాగులోకి సర్దుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే కార్ఖానా యజమాని సోదరుడు సుభాష్ మన్నా, మరో వర్కరు తేరుకుని వారిని వెంబడించారు. కార్మికులు వెంబడించడాన్ని గుర్తించిన ఆగంతకులు కార్ఖానా సమీపంలో నిలిపిన తెల్లకారులో (వెర్టిగో)కి ఎక్కి పారిపోయేందుకు ప్రయత్నించారు. సుభాష్ మన్నా కారుపై దాడిచేసి సైడ్ మిర్రన్‌ను ధ్వంసం చేశారు. అయితే దుండగులు కారును ముందుకు దూకించి వెళ్లిపోయారు. కానిస్టేబుల్ వెంబడించినా..: ఈ తతంగాన్ని గమనించిన నైట్ డ్యూటీ కానిస్టేబుల్ బైక్‌పై కారును వెండించారు. కార్ఖానాకు సమీపంలోని వినాయకుడి గుడివరకూ వెంబడించినా ఫలితంలేకుండా పోయింది. ఘటన జరిగిన సమయంలో కార్ఖానా యజమాని ఎం.శంకర్‌మన్నా అక్కడే ఉన్నారు. దాడిలో పాల్గొన్న ఆగంతకులు అందరూ హిందీలోనే మాట్లాడారని, అంతా 25 నుంచి 30 ఏళ్లలోపు యువకులేనని కార్ఖానా కార్మికులు తెలిపారు. చోరీ సమాచారం అందుకున్న గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు ఆధ్వర్యంలో ఎనిమిది పోలీసు బృందాలు వాహనాల తనిఖీలు చేపట్టాయి. తాడేపల్లి ప్రాంతంలో వాహనాలను తనిఖీచేస్తున్న పోలీసులను చూసిన నిందితులు కారును రోడ్డుపై వదిలి పొలాల్లోకి పరారయ్యారు. కారును పరిశీలించిన పోలీసులకు కారులో రెండురౌండ్ల బుల్లెట్లు లభించాయి. కారులోంచి ఆరుగురు దిగి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. మిగిలిన దుండగులు మార్గంమధ్యలోనే బంగారంతో దిగిపోయి ఉంటారని భావిస్తున్నారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. -
'ఇక ఆలయాల తొలగింపు ఉండదు'
విజయవాడ: ఆలయాల కూల్చివేత అంశంపై టీడీపీ-బీజేపీ వివాదం నేపథ్యంలో ఏపీ మంత్రులు ఆదివారం సమావేశమయ్యారు. మున్సిపల్, పోలీస్ కమిషనర్లు ఈ సమావేశానికి హాజరై వివరాలను అందించారు. విజయవాడలో కూల్చేసిన ఆలయాలను మంత్రుల బృందం పరిశీలించింది. అభివృద్ధి కోసం ఆలయాలు కూలిస్తే రాద్ధాంతం చేస్తోన్నారని ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. రామవరప్పాడులో మసీదును కూల్చితే బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేదన్నారు. ఆలయాలకు కూలిస్తే మాట్లాడ్డమేంటని వ్యాఖ్యానించి కేశినేని నాని అక్కడి నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయారు. విజయవాడలో ఇక ఆలయాల తొలగింపు ఉండదని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. దక్షిణముఖ ఆంజనేయస్వామి ఆలయాన్ని పునర్నిర్మిస్తామని తెలిపారు. ఆలయాలను తొలగించాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. కూల్చిన ఆలయాలను తిరిగి అదే స్థానంలో పునర్ నిర్మిస్తామని మాణిక్యాలరావు తెలిపారు. రోడ్ల విస్తరణ కోసం భవిష్యత్తులో ఆలయాలను కూల్చాలసి వస్తే ముందుగా అనుమతులు తీసుకుంటామన్నారు. కృష్ణా పుష్కరాలకోసం 2 కోట్ల మందివరకు వస్తారని మాణిక్యాలరావు అన్నారు. ప్రధాన గోపురానికి వెళ్లేదారిని విస్తరిస్తామని పేర్కొన్నారు. గోశాల అంశాన్ని సామరస్యంగా పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకు పోతుందని మంత్రి దేవినేని మహేశ్వరరావు అన్నారు. కృష్ణా పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని అందరూ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సమావేశానికి మంత్రులు మాణిక్యాలరావు, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాసరావులు హాజరయ్యారు. ఆలయాల కూల్చివేత పై మంత్రులు, అధికారులతో రేపు(సోమవారం) సీఎం చంద్రబాబునాయుడు సమీక్షనిర్వహించనున్నారు. -
బెజవాడలో పిల్లల కిడ్నాప్ గ్యాంగులు: సీపీ
పిల్లలను అపహరించే గ్యాంగులు విజయవాడలో తిరుగుతున్నట్లు అనుమానంగా ఉందని నగర పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. నెల రోజుల్లోగా రద్దీగా ఉండే దుకాణాల్లో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవాలని, లేకపోతే జరిమానాలు తప్పవని అన్నారు. దుకాణాలను కూడా సీజ్ చేస్తామని సీపీ హెచ్చరించారు. ఈ మేరకు దుకాణాల యజమానులకు ఆయన సూచన చేశారు. పేద పిల్లలనే కిడ్నాపర్లు లక్ష్యంగా పెట్టుకునే అవకాశం ఉందని, పిల్లలను ఒంటరిగా పంపించొద్దని సూచించారు.