విజయవాడ: ఆలయాల కూల్చివేత అంశంపై టీడీపీ-బీజేపీ వివాదం నేపథ్యంలో ఏపీ మంత్రులు ఆదివారం సమావేశమయ్యారు. మున్సిపల్, పోలీస్ కమిషనర్లు ఈ సమావేశానికి హాజరై వివరాలను అందించారు. విజయవాడలో కూల్చేసిన ఆలయాలను మంత్రుల బృందం పరిశీలించింది. అభివృద్ధి కోసం ఆలయాలు కూలిస్తే రాద్ధాంతం చేస్తోన్నారని ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. రామవరప్పాడులో మసీదును కూల్చితే బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేదన్నారు. ఆలయాలకు కూలిస్తే మాట్లాడ్డమేంటని వ్యాఖ్యానించి కేశినేని నాని అక్కడి నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయారు.
విజయవాడలో ఇక ఆలయాల తొలగింపు ఉండదని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. దక్షిణముఖ ఆంజనేయస్వామి ఆలయాన్ని పునర్నిర్మిస్తామని తెలిపారు. ఆలయాలను తొలగించాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.
కూల్చిన ఆలయాలను తిరిగి అదే స్థానంలో పునర్ నిర్మిస్తామని మాణిక్యాలరావు తెలిపారు. రోడ్ల విస్తరణ కోసం భవిష్యత్తులో ఆలయాలను కూల్చాలసి వస్తే ముందుగా అనుమతులు తీసుకుంటామన్నారు. కృష్ణా పుష్కరాలకోసం 2 కోట్ల మందివరకు వస్తారని మాణిక్యాలరావు అన్నారు. ప్రధాన గోపురానికి వెళ్లేదారిని విస్తరిస్తామని పేర్కొన్నారు. గోశాల అంశాన్ని సామరస్యంగా పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.
భక్తుల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకు పోతుందని మంత్రి దేవినేని మహేశ్వరరావు అన్నారు. కృష్ణా పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని అందరూ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సమావేశానికి మంత్రులు మాణిక్యాలరావు, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాసరావులు హాజరయ్యారు. ఆలయాల కూల్చివేత పై మంత్రులు, అధికారులతో రేపు(సోమవారం) సీఎం చంద్రబాబునాయుడు సమీక్షనిర్వహించనున్నారు.
'ఇక ఆలయాల తొలగింపు ఉండదు'
Published Sun, Jul 3 2016 6:36 PM | Last Updated on Mon, Sep 4 2017 4:03 AM
Advertisement