విజయవాడలో భారీ దోపిడీ
► 7 కిలోల బంగారు నగల అపహరణ
►నగల కార్ఖానాపై ఆగంతకుల దాడి
►కత్తులు, తుపాకులతో కార్మికులను బెదిరించిన దుండగులు
►దోపిడీలో పాల్గొన్న10 నుంచి 12 మంది యువకులు
►కారులో పారిపోయిన దొంగలు
బస్టేషన్ (విజయవాడ తూర్పు) :
విజయవాడలో భారీ దోపిడీ జరిగింది. బంగారు నగలు తయారుచేసే కార్ఖానాలోకి తుపాకులు, కత్తులతో చొరబడిన ఆగంతకులు సుమారు ఏడు కిలోల నగలు దోచుకెళ్లారు. ఈ ఘటన విజయవాడ గవర్నరుపేట గోపాలరెడ్డి వీధిలో మంగళవారం రాత్రి పది గంటల సమయంలో జరిగింది. బాధితుల కథనం మేరకు వివరాలు.. బెంగాల్‌కు చెందిన శంకర్ మన్నా గవర్నరుపేట గోపాలరెడ్డి వీధిలోని రెండంతస్తుల భవనంలోని మొదటి అంతస్తులో బంగారు నగలు తయారుచేసే కార్ఖానా నిర్వహిస్తున్నారు. మూడు గదుల్లో నడుస్తున్న ఆ కార్ఖానాలో 30 మంది పనిచేస్తుంటారు. వారంతా బెంగాల్‌కు చెందినవారే. మంగళవారం రాత్రి పది గంటల సమయంలో కార్మికులు నగలు తయారుచేస్తుండగా 10 నుంచి 12 మంది ఆగంతకులు తుపాకులు, కత్తులతో లోనికి చొరబడ్డారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులను ఒకచోటకు చేర్చి చేతులు పైకెత్తించి కూర్చోవాలని ఆదేశించారు.
వారు అలా చేయగానే అక్కడ ఉన్న సుమారు ఏడు కిలోల నగలను బ్యాగులోకి సర్దుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే కార్ఖానా యజమాని సోదరుడు సుభాష్ మన్నా, మరో వర్కరు తేరుకుని వారిని వెంబడించారు. కార్మికులు వెంబడించడాన్ని గుర్తించిన ఆగంతకులు కార్ఖానా సమీపంలో నిలిపిన తెల్లకారులో (వెర్టిగో)కి ఎక్కి పారిపోయేందుకు ప్రయత్నించారు. సుభాష్ మన్నా కారుపై దాడిచేసి సైడ్ మిర్రన్‌ను ధ్వంసం చేశారు. అయితే దుండగులు కారును ముందుకు దూకించి వెళ్లిపోయారు.
కానిస్టేబుల్ వెంబడించినా..: ఈ తతంగాన్ని గమనించిన నైట్ డ్యూటీ కానిస్టేబుల్ బైక్‌పై కారును వెండించారు. కార్ఖానాకు సమీపంలోని వినాయకుడి గుడివరకూ వెంబడించినా ఫలితంలేకుండా పోయింది. ఘటన జరిగిన సమయంలో కార్ఖానా యజమాని ఎం.శంకర్‌మన్నా అక్కడే ఉన్నారు. దాడిలో పాల్గొన్న ఆగంతకులు అందరూ హిందీలోనే మాట్లాడారని, అంతా 25 నుంచి 30 ఏళ్లలోపు యువకులేనని కార్ఖానా కార్మికులు తెలిపారు. చోరీ సమాచారం అందుకున్న గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు ఆధ్వర్యంలో ఎనిమిది పోలీసు బృందాలు వాహనాల తనిఖీలు చేపట్టాయి. తాడేపల్లి ప్రాంతంలో వాహనాలను తనిఖీచేస్తున్న పోలీసులను చూసిన నిందితులు కారును రోడ్డుపై వదిలి పొలాల్లోకి పరారయ్యారు. కారును పరిశీలించిన పోలీసులకు కారులో రెండురౌండ్ల బుల్లెట్లు లభించాయి. కారులోంచి ఆరుగురు దిగి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. మిగిలిన దుండగులు మార్గంమధ్యలోనే బంగారంతో దిగిపోయి ఉంటారని భావిస్తున్నారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.