రెండు దశాబ్దాలుగా అదే సెంటిమెంట్!
రాజకీయాల్లో సెంటిమెంటుకు తావులేదని ప్రకటనలిచ్చే నేతలు సైతం తాము చేసే ప్రతీ పనికి వెనుకా ముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటారు. ఎన్నికలొచ్చిన ప్రతీసారీ నేతల విజయావకాశాలతో పాటు, ఆయా స్ధానాల సెంటిమెంట్లు, గత ఎన్నికల ఫలితాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. సరిగ్గా అలాంటి సెంటిమెంటే విజయనగరం జిల్లా రాజకీయ వేదికపై రెండు దశాబ్దాలుగా సజీవంగా నిలూస్తూ వస్తోంది. రాజకీయాల్లో సెంటిమెంట్లు భలే ఉంటాయి. నాయకుల నమ్మకాలు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. రాజకీయ నేతలు ఏం చేయాలన్నా ముహూర్తాలు చూసుకోవడంతోపాటు గతానుభవాలను కూడా బేరీజు వేసుకుంటారు. శాస్త్రీయంగా ఆ అంశాలను నిరూపించలేనప్పటికీ లెక్కల్లో మాత్రం ఖచ్చితంగా నమ్మాలనిపించేటట్లు ఉంటాయి.
విజయనగరం జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా చేసిన వ్యక్తి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుపు ఖాయం. వినడానికి కాస్తా ఆశ్చర్యంగా ఉన్నా ఇది గణాంకాల సాక్షిగా నిరూపితమైన నిజం. విజయనగరం జిల్లాలో 1995 నుంచి 2009 వరకు అక్షరాలా అమలవుతున్న నిజమిది. సుమారు రెండు దశాబ్దాల కాలంలో జెడ్పీ పీఠంపై కూర్చుని ఆ పై ఉన్నత పదవులు పొందిన వారిని పరిశీలిస్తే ఈ సెంటిమెంటును ఒప్పుకోకతప్పదు. 1995-96లో జిల్లా పరిషత్ అధ్యక్షుడుగా పనిచేసిన కొండపల్లి పైడితల్లి నాయుడు ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేశారు. ప్రత్యర్థి బొత్స సత్యనారాయణపై ఇరవై వేల ఓట్ల మెజార్టీతో బొబ్బిలి నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. మళ్లీ 1998లో కూడా ఆయన బొత్సపై ఇరవై ఆరువేల ఓట్ల మెజార్టీతో లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయితే 1999 ఎన్నికల్లో టీడీపీ ఆయనకు టిక్కెట్ కేటాయించకపోవడంతో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కొండపల్లి పైడితల్లినాయుడు టీడీపీ నుంచి మూడోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత అదే పార్టీకి చెందిన లగుడు సింహాద్రి నాలుగేళ్లు పాటు 1996-2000 మధ్య కాలంలో జిల్లా పరిషత్ పీఠాన్ని అధిష్టించారు. అయితే ఆయన అక్కడతో రాజకీయాలకే గుడ్ బై చెప్పేశారు. 2001 నుంచి 2006 వరకు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ పార్టీ తరపున బొత్స ఝూన్సీలక్షి ఎంపికయ్యారు. అప్పటి సిట్టింగ్ లోక్‌సభ సభ్యుడు కొండపల్లి పైడితల్లి నాయుడు అకాలమరణంతో బొబ్బిలి స్థానానికి ఉపఎన్నికలు జరిగాయి. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఉన్న బొత్స ఝూన్సీ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి పైడితల్లినాయుడు కుమారుడు కెఏ నాయుడుపై విజయం సాధించారు. ఆ తరువాత డెంకాడ జెడ్పీటీసీగా ఉన్న బొత్స సత్యనారాయణ బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆయన జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఉంటూనే 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నెల్లిమర్ల శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన బెల్లాన చంద్రశేఖర్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికై పూర్తి కాలం పదవిలో కొనసాగారు.
ఇలా 1995లో కొండపల్లి పైడితల్లినాయుడు నుంచి 2009లో బడ్డుకొండ అప్పలనాయుడు వరకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి నిర్వహించి ఆ తరువాత చట్టసభలకు పోటీ చేసిన వారు తమ తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నిక్లలో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న మాజీ జెడ్పీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్ కూడా విజయం సాధించడం ఖాయమని భావిస్తున్నారు. రెండు దశాబ్దాలుగా నిజమవుతూ వస్తున్న సెంటిమెంట్ ఈ దఫా కూడా ఖచ్చితంగా ఫలిస్తుందని వారి నమ్మకం.