vijayawada autonagar
-
విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదం..
సాక్షి, విజయవాడ: ప్రఖ్యాత పారిశ్రామిక, ఆటోమొబైల్ కేంద్రం ‘విజయవాడ ఆటోనగర్’లో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. కానూరు రోడ్డులోని ఓ కూలర్ల కంపెనీలో ఉదయం 11 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. నిమిషాల వ్యవధిలోనే మంటలు.. పక్కనున్న ఇంజన్ ఆయిల్ మిక్స్డ్ యూనిట్‌కు అంటుకున్నాయి. దీంతో అదుపుచేయలేనంత స్థాయిలో మంటల ఉధృతి పెరిగింది. ప్రస్తుతం పది ఫైరింజన్లలో మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదం జరిగి రెండు గంటలవుతున్నా మంటలు అదుపులోకి రాలేదు. అగ్ని మాపక సిబ్బంది 10 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలను అదుపు చేసేందుకు ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగింది. కలెక్టర్ లక్ష్మీ కాంతం, జాయింట్ పోలీస్ కమిషనర్ క్రాంతి రానా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముడి ఆయిల్ పరిశ్రమకు మంటలు వ్యాపించడంతో అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. ఆయిల్ పరిశ్రమలో 100 పీపాల ఆయిల్ ఉండటంతో పీపాలు పేలుతున్నాయి. కానూరు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ప్రమాద స్థలంలో దట్టమైన పొగ కమ్మేసింది. ముందే వచ్చుంటే ఇంత ఘోరం జరిగేదికాదు.. కాగా, అగ్నిప్రమాద ఘటనలో అగ్నిమాపక సిబ్బంది తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 11:15కు మంటలు గుర్తించి ఫోన్ చేశామని.. అర గంట తర్వాతగానీ ఫైరింజన్ రాలేదని తెలిపారు. ‘‘మంటలు చిన్నగా ఉన్నప్పుడే ఫైరింజన్ వచ్చేదుంటే ఇంత ఘోరం జరిగేదేకాదు. వచ్చిన ఒక్క ఫైరింజన్ కూడా ఏమీ చెయ్యలేక, మరో నాలుగీటిని పిలిపించారు. అదృష్టవశాత్తూ కార్మికులు అందరూ బయటికి వచ్చేశారు’’ అని స్థానికులు చెప్పారు. అగ్నప్రమాదం కారణంగా ఆటోనగర్ ప్రాంతంమంతా దట్టమైన పొగ వ్యాపించి జనం ఇబ్బందులు పడ్డారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. -
బెజవాడ ఆటోనగర్‌లో ఆయుధాల తయారీ!
తెలుగు రాష్ట్రాల్లోనే పేరొందిన విజయవాడ ఆటోనగర్‌లో ఆయుధాల వ్యవహారం కలకలం రేపింది. ఆటోనగర్‌లో ఉన్న లక్ష్మీదుర్గ ఇంజనీరింగ్ వర్క్స్‌పై ఏలూరు పోలీసులు దాడి చేశారు. అక్కడ తుపాకుల కార్ట్రిడ్జిలు, బుల్లెట్లు, ఇతర పరికరాలు భారీ ఎత్తున పట్టుబడ్డాయి. వారం రోజుల క్రితం నెల్లూరు ప్రాంతానికి చెందిన శరత్‌రెడ్డి అనే బీటెక్ విద్యార్థిని పశ్చిమగోదావరి జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. అతడు మావోయిస్టులకు ఆయుధాలు సరఫరా చేస్తుండగా వారు పట్టుకున్నారు. అతడిని విచారించగా.. విజయవాడలో ఆయుధాల తయారీ వ్యవహారం మొత్తం బయటపడింది. దాంతో ఏలూరు నుంచి ప్రత్యేక బృందాలు విజయవాడ ఆటోనగర్‌కు వచ్చి, ఇక్కడ తనిఖీ చేయగా ఆయుధాల తయారీ గుట్టు బయటపడింది. సాధారణంగా ఆయుధాలు కావాలంటే బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాలకు వెళ్లి కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఇక్కడే విడిభాగాలను తయారుచేయడం ఇదే తొలిసారి. మధురానగర్ ప్రాంతంలో రివాల్వర్లకు కావల్సిన స్ప్రింగులు కొనుగోలు చేశారు. అక్కడ విచారించగా, తాము స్ప్రింగులు అమ్మిన విషయం వాస్తవమే గానీ, అవి తుపాకుల కోసమన్నది తెలియదని వ్యాపారులు చెప్పారు. దాంతో ఆటోనగర్‌లో ఆయుధాలు తయారుచేస్తున్న వ్యాపారులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.