బెజవాడ ఆటోనగర్లో ఆయుధాల తయారీ!
తెలుగు రాష్ట్రాల్లోనే పేరొందిన విజయవాడ ఆటోనగర్లో ఆయుధాల వ్యవహారం కలకలం రేపింది. ఆటోనగర్లో ఉన్న లక్ష్మీదుర్గ ఇంజనీరింగ్ వర్క్స్పై ఏలూరు పోలీసులు దాడి చేశారు. అక్కడ తుపాకుల కార్ట్రిడ్జిలు, బుల్లెట్లు, ఇతర పరికరాలు భారీ ఎత్తున పట్టుబడ్డాయి. వారం రోజుల క్రితం నెల్లూరు ప్రాంతానికి చెందిన శరత్రెడ్డి అనే బీటెక్ విద్యార్థిని పశ్చిమగోదావరి జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. అతడు మావోయిస్టులకు ఆయుధాలు సరఫరా చేస్తుండగా వారు పట్టుకున్నారు. అతడిని విచారించగా.. విజయవాడలో ఆయుధాల తయారీ వ్యవహారం మొత్తం బయటపడింది. దాంతో ఏలూరు నుంచి ప్రత్యేక బృందాలు విజయవాడ ఆటోనగర్కు వచ్చి, ఇక్కడ తనిఖీ చేయగా ఆయుధాల తయారీ గుట్టు బయటపడింది.
సాధారణంగా ఆయుధాలు కావాలంటే బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాలకు వెళ్లి కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఇక్కడే విడిభాగాలను తయారుచేయడం ఇదే తొలిసారి. మధురానగర్ ప్రాంతంలో రివాల్వర్లకు కావల్సిన స్ప్రింగులు కొనుగోలు చేశారు. అక్కడ విచారించగా, తాము స్ప్రింగులు అమ్మిన విషయం వాస్తవమే గానీ, అవి తుపాకుల కోసమన్నది తెలియదని వ్యాపారులు చెప్పారు. దాంతో ఆటోనగర్లో ఆయుధాలు తయారుచేస్తున్న వ్యాపారులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.