eluru police
-
భర్తే హంతకుడు
ఏలూరు టౌన్: ఏలూరు రూరల్ పోలీసు స్టేషన్లో ఏలూరు డీఎస్పీ డాక్టర్ ఓ.దిలీప్‌కిరణ్ శుక్రవారం విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఆయనతోపాటు రూరల్ సీఐ ఏ.శ్రీనివాసరావు ఉన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పెదపాడు మండలం వడ్డిగూడెం గ్రామానికి చెందిన ఘంటసాల ఉదయకుమార్ రాజుకు, కృష్ణాజిల్లా మండవల్లి మండలం పెనుమాకలంక గ్రామానికి చెందిన ఘంటసాల చంటితో 2013లో వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం ఉన్నారు. భర్త ఉదయకుమార్ రాజు వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఇరువురికీ తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 2018 మార్చి 30న అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరగటంతో ఉదయకుమార్ రాజు తన భార్య చంటిని రాడ్డుతో తలపై బలంగా కొట్టటంతో ఆమె చనిపోయింది. అప్పట్లో మృతురాలి తండ్రి మోరు రామకృష్ణ పెదపాడు పోలీసులకు తన కుమార్తె ప్రమాదవశాత్తు చనిపోలేదనీ, అనుమానం ఉందని ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కానీ దర్యాప్తు చేయకుండా ఫైలు పక్కనబెట్టేశారు. మిస్టరీ వెలుగులోకి.. పెదపాడు పోలీసు స్టేషన్లో పాత కేసులను పరిశీలిస్తున్న ఏలూరు రూరల్ సీఐ శ్రీనివాసరావుకు ఈ అనుమానాస్పద మృతికేసు ఫైలు కనిపించింది. దీంతో మృతురాలు చంటి హత్య వెనుక అసలు మిస్టరీ బయటపడింది. ఆమె మరణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఆమె రాసినట్లు ఒక ఉత్తరాన్ని భర్త ఉదయకుమార్ రాజు రాశాడు. మెడకు తాడు బిగించి ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు చూపించాలని ప్రయత్నించాడు. కానీ ఆమె చెవిలో నుంచి రక్తం కారుతూ ఉండడంతో మళ్లీ మృతదేహాన్ని కిందికి దింపి బాత్రూమ్లో కాలుజారి ప్రయాదవశాత్తు పడిపోయి తలకు బలమైన గాయం తగిలి మరణించినట్లు చిత్రీకరించాడు. పోస్టుమార్టం రిపోర్ట్‌ను పరిశీలించిన పోలీసు అధికారులు కేసు మిస్టరీపై దృష్టి సారించారు. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లెటర్, మృతురాలి మెడకు ఉరివేసినట్లు గాయం, తలలో బలమైన గాయం, లివర్ సైతం దెబ్బతిన్నట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు హత్య కేసుగా నిర్ధారణకు వచ్చారు. కాగా హత్య చేసిన భయంతో గత మూడు నెలలుగా గ్రామంలో లేకుండా తిరుగుతున్న నిందితుడు ఉదయకుమార్ రాజును మాటువేసిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడు చెప్పిన నిజాలు పోలీసులను విస్తుగొలిపేలా చేశాయి. హత్య తానే చేశానని ఒప్పుకోవడంతో అతడ్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు. కేసు ఛేదించటంలో ప్రతిభ చూపిన హెచ్‌సీ హమీద్, పీసీలు సతీష్, కిషోర్, నరేష్‌లను జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ అభినందించారు. -
ప్రసాదమిచ్చి ప్రాణాలు తీస్తాడు
ఏలూరు టౌన్: కోటీశ్వరుల్ని చేస్తానంటూ రూ.లక్షలు వసూలు చేసి.. ఆనక ప్రసాదం పేరుతో సైనైడ్ తినిపించి 10 మందిని హతమార్చిన సీరియల్ కిల్లర్‌ను ఏలూరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ వెల్లడించిన వివరాలివీ.. ఏలూరు మండలం వెంకటాపురం పంచాయతీ ఎన్టీఆర్ కాలనీకి చెందిన వెల్లంకి సింహాద్రి అలియాస్ శివ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేవాడు. అది లాభసాటిగా లేకపోవటంతో సులభంగా డబ్బు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. రైస్ పుల్లింగ్ కాయిన్, రంగు రాళ్లను చూపించి వాటిని ఇంట్లో ఉంచు కుంటే రోజుల్లోనే కోటీశ్వరులు కావచ్చని నమ్మిస్తుండేవాడు. గుప్త నిధులు చూపిస్తానని, బం గారాన్ని రెట్టింపు చేస్తానని కూడా చెబుతుండేవాడు. వీటిపై మక్కువ గల వారిని లక్ష్యంగా చేసుకుని నగదు, నగలు కాజేస్తుండేవాడు. అసలు విషయం తెలిసి నిలదీసిన వారికి.. పూజ చేయించిన ప్రసాదం తింటే వెంటనే ఫలితం కనిపిస్తుందని చెప్పి.. సైనైడ్ తినిపించి హతమార్చేవాడు. ఇప్పటివరకు 20 నెలల్లో 10 మందిని హత్య చేసినట్లు తేలిందని ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ చెప్పారు. నిందితుడి నుంచి కొంత సైనైడ్, 23 తులాల బంగారు ఆభరణాలు, రూ.1,63,400 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సింహాద్రికి సైనైడ్ విక్రయించిన విజయవాడ వాంబే కాలనీ వాసి షేక్ అమీనుల్లా (బాబు అలియాస్ శంకర్) ను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. పీఈటీ హత్యతో వెలుగులోకి.. ఏలూరు కేపీడీటీ ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న కాటి నాగరాజును కిల్లర్ సింహాద్రి గత నెల 16న సైనైడ్ కలిపిన ప్రసాదం తినిపించి చంపాడు. నాగరాజు భార్య ఫిర్యాదు మేరకు మృ తుడి ఫోన్ కాల్ లిస్ట్‌లో చివరి కాల్ సింహాద్రిది కావటంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. హతుల వివరాలివీ.. వల్లభనేని ఉమామహేశ్వరరావు (కృష్ణాజిల్లా) నూజివీడు), పులప తవిటయ్య (కృష్ణా జిల్లా మర్రిబంద), గంటికోట భాస్కరరావు (కృష్ణా జిల్లా ఆగిరిపల్లి), కడియాల బాలవెంకటేశ్వరరావు (కృష్ణా జిల్లా గన్నవరం), రామకృష్ణానంద స్వామీజీ (తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తపట్నం), కొత్తపల్లి నాగమణి (రాజమహేంద్రవరం), సామంతకుర్తి నాగమణి (రాజమండ్రి బొమ్మూరు), చోడవరపు సూర్యనారాయణ (ఏలూరు వంగాయగూడెం), రాములమ్మ (ఏలూరు హనుమాన్ నగర్), కాటి నాగరాజు (ఏలూరు ఎన్టీఆర్ కాలనీ). -
130 కేజీల గంజాయి పట్టివేత
సాక్షి, పశ్చిమగోదావరి : తమిళనాడుకు చెందిన ఇద్దరు గంజాయి స్మగ్లర్లను ఏలూరు రూరల్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు విల్లుపురంకు చెందిన కాలేజీ స్టూడెంట్స్ మునిస్వామి మహేంద్ర(24), పళనియప్ప ప్రభూ(24) విశాఖపట్టణం నుంచి తమిళనాడుకు కారులో గంజాయి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే ఏలూరు ఆశ్రం ఆసుపత్రి వద్ద రూరల్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా వీరు పట్టుబడ్డారు. నిందితుల వద్ద నుంచి సుమారు 130 కిలోగ్రాముల గంజాయితో పాటు ఓ కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
బెజవాడ ఆటోనగర్‌లో ఆయుధాల తయారీ!
తెలుగు రాష్ట్రాల్లోనే పేరొందిన విజయవాడ ఆటోనగర్‌లో ఆయుధాల వ్యవహారం కలకలం రేపింది. ఆటోనగర్‌లో ఉన్న లక్ష్మీదుర్గ ఇంజనీరింగ్ వర్క్స్‌పై ఏలూరు పోలీసులు దాడి చేశారు. అక్కడ తుపాకుల కార్ట్రిడ్జిలు, బుల్లెట్లు, ఇతర పరికరాలు భారీ ఎత్తున పట్టుబడ్డాయి. వారం రోజుల క్రితం నెల్లూరు ప్రాంతానికి చెందిన శరత్‌రెడ్డి అనే బీటెక్ విద్యార్థిని పశ్చిమగోదావరి జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. అతడు మావోయిస్టులకు ఆయుధాలు సరఫరా చేస్తుండగా వారు పట్టుకున్నారు. అతడిని విచారించగా.. విజయవాడలో ఆయుధాల తయారీ వ్యవహారం మొత్తం బయటపడింది. దాంతో ఏలూరు నుంచి ప్రత్యేక బృందాలు విజయవాడ ఆటోనగర్‌కు వచ్చి, ఇక్కడ తనిఖీ చేయగా ఆయుధాల తయారీ గుట్టు బయటపడింది. సాధారణంగా ఆయుధాలు కావాలంటే బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాలకు వెళ్లి కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఇక్కడే విడిభాగాలను తయారుచేయడం ఇదే తొలిసారి. మధురానగర్ ప్రాంతంలో రివాల్వర్లకు కావల్సిన స్ప్రింగులు కొనుగోలు చేశారు. అక్కడ విచారించగా, తాము స్ప్రింగులు అమ్మిన విషయం వాస్తవమే గానీ, అవి తుపాకుల కోసమన్నది తెలియదని వ్యాపారులు చెప్పారు. దాంతో ఆటోనగర్‌లో ఆయుధాలు తయారుచేస్తున్న వ్యాపారులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వెలుగుచూస్తున్నహర్షవర్ధన్ గ్యాంగ్ ఆగడాలు