ఏలూరు టౌన్: కోటీశ్వరుల్ని చేస్తానంటూ రూ.లక్షలు వసూలు చేసి.. ఆనక ప్రసాదం పేరుతో సైనైడ్ తినిపించి 10 మందిని హతమార్చిన సీరియల్ కిల్లర్‌ను ఏలూరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ వెల్లడించిన వివరాలివీ.. ఏలూరు మండలం వెంకటాపురం పంచాయతీ ఎన్టీఆర్ కాలనీకి చెందిన వెల్లంకి సింహాద్రి అలియాస్ శివ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేవాడు. అది లాభసాటిగా లేకపోవటంతో సులభంగా డబ్బు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. రైస్ పుల్లింగ్ కాయిన్, రంగు రాళ్లను చూపించి వాటిని ఇంట్లో ఉంచు కుంటే రోజుల్లోనే కోటీశ్వరులు కావచ్చని నమ్మిస్తుండేవాడు.
గుప్త నిధులు చూపిస్తానని, బం గారాన్ని రెట్టింపు చేస్తానని కూడా చెబుతుండేవాడు. వీటిపై మక్కువ గల వారిని లక్ష్యంగా చేసుకుని నగదు, నగలు కాజేస్తుండేవాడు. అసలు విషయం తెలిసి నిలదీసిన వారికి.. పూజ చేయించిన ప్రసాదం తింటే వెంటనే ఫలితం కనిపిస్తుందని చెప్పి.. సైనైడ్ తినిపించి హతమార్చేవాడు. ఇప్పటివరకు 20 నెలల్లో 10 మందిని హత్య చేసినట్లు తేలిందని ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ చెప్పారు. నిందితుడి నుంచి కొంత సైనైడ్, 23 తులాల బంగారు ఆభరణాలు, రూ.1,63,400 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సింహాద్రికి సైనైడ్ విక్రయించిన విజయవాడ వాంబే కాలనీ వాసి షేక్ అమీనుల్లా (బాబు అలియాస్ శంకర్) ను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు.
పీఈటీ హత్యతో వెలుగులోకి..
ఏలూరు కేపీడీటీ ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న కాటి నాగరాజును కిల్లర్ సింహాద్రి గత నెల 16న సైనైడ్ కలిపిన ప్రసాదం తినిపించి చంపాడు. నాగరాజు భార్య ఫిర్యాదు మేరకు మృ తుడి ఫోన్ కాల్ లిస్ట్‌లో చివరి కాల్ సింహాద్రిది కావటంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి.
హతుల వివరాలివీ..
వల్లభనేని ఉమామహేశ్వరరావు (కృష్ణాజిల్లా) నూజివీడు), పులప తవిటయ్య (కృష్ణా జిల్లా మర్రిబంద), గంటికోట భాస్కరరావు (కృష్ణా జిల్లా ఆగిరిపల్లి), కడియాల బాలవెంకటేశ్వరరావు (కృష్ణా జిల్లా గన్నవరం), రామకృష్ణానంద స్వామీజీ (తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తపట్నం), కొత్తపల్లి నాగమణి (రాజమహేంద్రవరం), సామంతకుర్తి నాగమణి (రాజమండ్రి బొమ్మూరు), చోడవరపు సూర్యనారాయణ (ఏలూరు వంగాయగూడెం), రాములమ్మ (ఏలూరు హనుమాన్ నగర్), కాటి నాగరాజు (ఏలూరు ఎన్టీఆర్ కాలనీ).
Comments
Please login to add a commentAdd a comment