cyanide poison
-
ప్రసాదమిచ్చి ప్రాణాలు తీస్తాడు
ఏలూరు టౌన్: కోటీశ్వరుల్ని చేస్తానంటూ రూ.లక్షలు వసూలు చేసి.. ఆనక ప్రసాదం పేరుతో సైనైడ్ తినిపించి 10 మందిని హతమార్చిన సీరియల్ కిల్లర్‌ను ఏలూరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ వెల్లడించిన వివరాలివీ.. ఏలూరు మండలం వెంకటాపురం పంచాయతీ ఎన్టీఆర్ కాలనీకి చెందిన వెల్లంకి సింహాద్రి అలియాస్ శివ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేవాడు. అది లాభసాటిగా లేకపోవటంతో సులభంగా డబ్బు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. రైస్ పుల్లింగ్ కాయిన్, రంగు రాళ్లను చూపించి వాటిని ఇంట్లో ఉంచు కుంటే రోజుల్లోనే కోటీశ్వరులు కావచ్చని నమ్మిస్తుండేవాడు. గుప్త నిధులు చూపిస్తానని, బం గారాన్ని రెట్టింపు చేస్తానని కూడా చెబుతుండేవాడు. వీటిపై మక్కువ గల వారిని లక్ష్యంగా చేసుకుని నగదు, నగలు కాజేస్తుండేవాడు. అసలు విషయం తెలిసి నిలదీసిన వారికి.. పూజ చేయించిన ప్రసాదం తింటే వెంటనే ఫలితం కనిపిస్తుందని చెప్పి.. సైనైడ్ తినిపించి హతమార్చేవాడు. ఇప్పటివరకు 20 నెలల్లో 10 మందిని హత్య చేసినట్లు తేలిందని ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ చెప్పారు. నిందితుడి నుంచి కొంత సైనైడ్, 23 తులాల బంగారు ఆభరణాలు, రూ.1,63,400 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సింహాద్రికి సైనైడ్ విక్రయించిన విజయవాడ వాంబే కాలనీ వాసి షేక్ అమీనుల్లా (బాబు అలియాస్ శంకర్) ను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. పీఈటీ హత్యతో వెలుగులోకి.. ఏలూరు కేపీడీటీ ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న కాటి నాగరాజును కిల్లర్ సింహాద్రి గత నెల 16న సైనైడ్ కలిపిన ప్రసాదం తినిపించి చంపాడు. నాగరాజు భార్య ఫిర్యాదు మేరకు మృ తుడి ఫోన్ కాల్ లిస్ట్‌లో చివరి కాల్ సింహాద్రిది కావటంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. హతుల వివరాలివీ.. వల్లభనేని ఉమామహేశ్వరరావు (కృష్ణాజిల్లా) నూజివీడు), పులప తవిటయ్య (కృష్ణా జిల్లా మర్రిబంద), గంటికోట భాస్కరరావు (కృష్ణా జిల్లా ఆగిరిపల్లి), కడియాల బాలవెంకటేశ్వరరావు (కృష్ణా జిల్లా గన్నవరం), రామకృష్ణానంద స్వామీజీ (తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తపట్నం), కొత్తపల్లి నాగమణి (రాజమహేంద్రవరం), సామంతకుర్తి నాగమణి (రాజమండ్రి బొమ్మూరు), చోడవరపు సూర్యనారాయణ (ఏలూరు వంగాయగూడెం), రాములమ్మ (ఏలూరు హనుమాన్ నగర్), కాటి నాగరాజు (ఏలూరు ఎన్టీఆర్ కాలనీ). -
ఎన్నారై హత్యకేసు: సీక్రెట్ డైరీతో గుట్టురట్టు
మెల్బోర్న్ : మూడేళ్ల క్రితం మెల్బోర్న్లో హత్యకు గురైన సామ్ అబ్రహం కేసులో ఆస్ట్రేలియా కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఆరెంజ్ జ్యూస్‌లో సైనేడ్ కలిపి సామ్‌ను హత్య చేసినందుకు అతడి భార్య, ఆమె ప్రియుడికి శిక్ష ఖరారు చేసింది. వివరాలు... కేరళకు చెందిన సామ్ అబ్రహం 2012లో ఉద్యోగ నిమిత్తం భార్య సోఫియా, కుమారుడితో సహా ఆస్ట్రేలియాకు వచ్చి స్థిరపడ్డాడు. అయితే అక్టోబర్ 13, 2015లో సామ్ అకస్మాత్తుగా మృతి చెందాడు. ఈ విషయాన్ని కేరళలో ఉన్న కుటుంబ సభ్యులకు తెలిపిన సోఫియా కన్నీరుమున్నీరుగా విలపించింది. అయితే మొదట గుండె నొప్పితోనే సామ్ మరణించాడని అందరూ భావించారు. కానీ పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో విషప్రయోగం వల్లే అతడు మరణించాడని తేలింది. దీంతో స్థానిక పోలీసులు ఈ కేసును చాలెంజింగ్‌గా తీసుకున్నారు. సోఫియా ప్రవర్తనపై అనుమానంతో ఆమె కదలికలపై దృష్టి సారించారు. కొన్ని రోజుల తర్వాత సోఫియా, కేరళకు చెందిన అరుణ్ కమలాసనన్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని వారు గమనించారు. ప్రాథమిక విచారణ అనంతరం సోఫియా, అరుణ్‌లో అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు నిజం బయటపడింది. కీలకంగా మారిన సీక్రెట్ డైరీ... కేరళకు చెందిన అరుణ్ కమలాసనన్, సోఫియా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కలిసి చదువుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య స్నేహం ప్రేమగా మారింది. కానీ ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో సోఫియా సామ్ అబ్రహంను వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అరుణ్‌కు కూడా వేరొక అమ్మాయితో పెళ్లైంది. అతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లైన తర్వాత కూడా సోఫియా, అరుణ్‌లు తమ గతాన్ని మర్చిపోలేకపోయారు. సోఫియా భర్తతో కలిసి మొదట దుబాయ్‌లో ఉండేది. తర్వాత 2012లో వాళ్లు ఆస్ట్రేలియాకు వచ్చి సెటిలయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అరుణ్ భార్యా పిల్లల్ని వదిలి పెట్టి 2013లో ఆస్ట్రేలియా చేరుకున్నాడు. అప్పటి నుంచి సోఫియా, అరుణ్‌లు రహస్యంగా కలుసుకునేవారు. వారు చర్చించుకున్న విషయాల గురించి సోఫియా తన డైరీలో రాసుకునేది. ఈ విషయాలేవీ భర్తకు తెలియకుండా జాగ్రత్తపడేది. ఈ క్రమంలో సామ్ అడ్డు తొలగించుకుంటే జీవితాంతం తామిద్దరం కలిసి ఉండొచ్చని భావించిన అరుణ్.. సోఫియాను ఒప్పించి సామ్‌ను హత్య చేసేందుకు పథకం రచించాడు. అందులో భాగంగానే 2015 అక్టోబర్‌లో సామ్‌కు సైనేడ్ కలిపిన ఆరెంజ్ జ్యూస్ ఇచ్చి అతడిని హత్య చేశారు. తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా సోఫియా జాగ్రత్తపడింది. కానీ ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు హత్య కేసును సునాయాసంగా ఛేదించారు. ఇదే సరైన శిక్ష... ‘సామ్ అబ్రహం కుటుంబంతో సహా తన ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో హత్యకు గురయ్యాడు. అతడిని చంపడానికి నిందితులు విషాన్ని(సైనేడ్) ఉపయోగించారనేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ హత్యలో ప్రధాన సూత్రధారి అయిన అరుణ్ కమలాసనన్‌కు 27 ఏళ్లు, అతడికి సహకరించిన సోఫియాకు 22 ఏళ్ల పాటు కఠిన శిక్ష విధిస్తున్నానంటూ’ జస్టిస్ కోగ్లాన్ తీర్పు వెలువరించారు. నిందితులకు ఇదే సరైన శిక్ష అంటూ వ్యాఖ్యానించారు. సోఫియాను నిందితురాలిగా నిరూపించడానికి ఆమె సీక్రెట్ డైరీ ఉపయోగపడిందని ప్రాసిక్యూషన్ లాయర్ తెలిపారు. -
ముగ్గురు తీవ్రవాదులు అరెస్ట్ : భారీగా సైనైడ్ స్వాధీనం
చెన్నై: లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ) ఆత్మాహుతి దళానికి చెందిన ముగ్గురు తీవ్రవాదులు శ్రీలంకకు పారిపోతూ సోమవారం రాత్రి పోలీసులకు పట్టుబడ్డారు. తమిళనాడులోని రామనాథపురం వద్ద సముద్రం మార్గంలో ముగ్గురు వ్యక్తులు రహస్యంగా శ్రీలంకకు వెళుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు మదురై-రామనాథపురం జాతీయ రహదారిలో వాహనాల తనిఖీ చేపట్టారు. రామనాథపురం ఉచ్చిపులి పోలీస్‌స్టేషన్ పరిధిలోని రోడ్డులో కారును నిలిపి ఉన్న ముగ్గురిని పోలీసులు అనుమానించి విచారణ జరిపారు. వారు ఎల్టీటీఈ ఉగ్రవాదులని తేలడంతో కారును స్వాధీనం చేసుకున్నారు. కృష్ణకుమార్ (39), రాజేంద్రన్ (44) శశికుమార్ (30) అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కృష్ణకుమార్ చేతి సంచిలో 75 సైనైడ్ గుళికలు, 300 గ్రాముల సైనైడ్, 4 జీపీఎస్ పరికరాలు, 8 సెల్ఫోన్లు ఉన్నాయి. అలాగే రూ.42 వేల భారత కరెన్సీ, రూ.19 వేల శ్రీలంక కరెన్సీని కనుగొన్నారు. కృష్ణకుమార్‌ను రహస్య ప్రదేశంలోకి తీసుకెళ్లి విచారించగా.. అతను ఎల్టీటీఈ ప్రభాకరన్‌కు బంధువు అని, ముఖ్యకార్యదర్శిగా వ్యవహరించినట్లు తెలుసుకున్నారు. తుదిపోరు సమయంలో శ్రీలంక నుంచి పారిపోయి 2008లో తమిళనాడుకు చేరుకున్నట్టు విచారణలో తెలిసింది. తిరుచ్చిరాపల్లి కేకే నగర్లో అద్దె ఇంటిలో ఉంటూ ఇరుగూ పొరుగు వారితో డ్రైవర్‌నని పరిచయం చేసుకున్నాడు. అలాగే శ్రీలంకకు చెందిన ఎల్టీటీఈకి చెందిన రాజేంద్రన్ తమిళనాడులో ఉంటూ శ్రీలంకకు తరచూ సముద్ర మార్గంలో గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్టు తెలిసింది. శ్రీలంకలోని తమ సానుభూతిపరులను సమీకరించి మళ్లీ ఆత్మాహుతి దళాలను సిద్ధం చేసి ఎల్టీటీఈని బలోపేతం చేయడం కోసమే భారీ ఎత్తున సైనైడ్‌తో వారు ముగ్గురు బయలుదేరినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. శశికుమార్, రాజేంద్రన్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు, కృష్ణకుమార్‌ను మాత్రం రహస్య ప్రదేశంలో ఉంచి విచారణను కొనసాగిస్తున్నారు.