చెన్నై: లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టీటీఈ) ఆత్మాహుతి దళానికి చెందిన ముగ్గురు తీవ్రవాదులు శ్రీలంకకు పారిపోతూ సోమవారం రాత్రి పోలీసులకు పట్టుబడ్డారు. తమిళనాడులోని రామనాథపురం వద్ద సముద్రం మార్గంలో ముగ్గురు వ్యక్తులు రహస్యంగా శ్రీలంకకు వెళుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు మదురై-రామనాథపురం జాతీయ రహదారిలో వాహనాల తనిఖీ చేపట్టారు.
రామనాథపురం ఉచ్చిపులి పోలీస్‌స్టేషన్ పరిధిలోని రోడ్డులో కారును నిలిపి ఉన్న ముగ్గురిని పోలీసులు అనుమానించి విచారణ జరిపారు. వారు ఎల్‌టీటీఈ ఉగ్రవాదులని తేలడంతో కారును స్వాధీనం చేసుకున్నారు. కృష్ణకుమార్ (39), రాజేంద్రన్ (44) శశికుమార్ (30) అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కృష్ణకుమార్ చేతి సంచిలో 75 సైనైడ్ గుళికలు, 300 గ్రాముల సైనైడ్, 4 జీపీఎస్ పరికరాలు, 8 సెల్‌ఫోన్లు ఉన్నాయి. అలాగే రూ.42 వేల భారత కరెన్సీ, రూ.19 వేల శ్రీలంక కరెన్సీని కనుగొన్నారు.
కృష్ణకుమార్‌ను రహస్య ప్రదేశంలోకి తీసుకెళ్లి విచారించగా.. అతను ఎల్‌టీటీఈ ప్రభాకరన్‌కు బంధువు అని, ముఖ్యకార్యదర్శిగా వ్యవహరించినట్లు తెలుసుకున్నారు. తుదిపోరు సమయంలో శ్రీలంక నుంచి పారిపోయి 2008లో తమిళనాడుకు చేరుకున్నట్టు విచారణలో తెలిసింది. తిరుచ్చిరాపల్లి కేకే నగర్‌లో అద్దె ఇంటిలో ఉంటూ ఇరుగూ పొరుగు వారితో డ్రైవర్‌నని పరిచయం చేసుకున్నాడు.
అలాగే శ్రీలంకకు చెందిన ఎల్‌టీటీఈకి చెందిన రాజేంద్రన్ తమిళనాడులో ఉంటూ శ్రీలంకకు తరచూ సముద్ర మార్గంలో గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్టు తెలిసింది. శ్రీలంకలోని తమ సానుభూతిపరులను సమీకరించి మళ్లీ ఆత్మాహుతి దళాలను సిద్ధం చేసి ఎల్‌టీటీఈని బలోపేతం చేయడం కోసమే భారీ ఎత్తున సైనైడ్‌తో వారు ముగ్గురు బయలుదేరినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. శశికుమార్, రాజేంద్రన్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు, కృష్ణకుమార్‌ను మాత్రం రహస్య ప్రదేశంలో ఉంచి విచారణను కొనసాగిస్తున్నారు.
ముగ్గురు తీవ్రవాదులు అరెస్ట్ : భారీగా సైనైడ్ స్వాధీనం
Published Tue, Jul 21 2015 7:31 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
Advertisement
Advertisement